Thursday 15 August 2013

"క్షత్రియప్రభ" ఆగస్ట్ సంచికలో నా వ్యాసం. 

             స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి...





చివరి బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారత దేశంగాను మరియు ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగష్టు 14న పాకిస్తాన్, 1947 ఆగష్ట్ 15 న భారత దేశం స్వతంత్ర్య దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్యానంతరం హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర మతఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ మరియు ఉపప్రధాని వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్ ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా కోరారు. 1948 లో అయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా నియమితులైనారు. 565 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసే భాధ్యతను పటేల్ స్వీకరించారు. ఆయన తన ఉక్కు సంకల్పం నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బలప్రయోగంతో జూనాఘడ్, జమ్మూ-కాశ్మీర్ మరియు హైదరాబాద్ ఆపరేషన్ పోలో సంస్థానాల విలీనాలు ఆయన ఉక్కు సంకల్పానికి మచ్చుతునకలు. 1949 నవంబర్ 26 లో రజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1950 జనవరి 26 వ భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.రాజ్యాంగ పరిషత్ డా| రాజేధ్ర ప్రసాద్ ని ప్రథమ రాష్ట్రపతికా ఎన్నుకోవటంతో ఆయన రాజగోపాలా చారినుండి బధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర్య సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54 మరియు సిక్కింలు 1975 లో విలీనమయ్యాయి. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మనం స్వాతంత్ర్యం సాధించి ఇప్పటికి 65 ఏళ్లు పూర్తయ్యాయి.  "దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఆ విశ్వాసానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రతిఫలం లభించింది. అంత చీకటిలోనూ కోట్లాది భారతీయుల కళ్ళలో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవయ్యేళ్ళు.అరవయ్యేళ్ళ స్వాతంత్ర ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా జరుపుకున్నాం. ఇలా 65 ఆగస్టు 15లు చేశాం. ఈ ఏడాది ఈ నెలలో 66వ పర్వదినం జరుపుకోబోతున్నాం. కానీ మన దేశంలో మనం మౌలిక విషయాలకు సైద్ధాంతిక ప్రాముఖ్యతను నేటికీ ఇవ్వలేకపోయాం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రెండు తరాలు గతించాయి. కానీ ఆహారం, పోషణ, ఆరోగ్యం మరియు విద్య వంటి ప్రాధమిక అవసరాలు ఇప్పటికీ జనాభాకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.  స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏదో స్వీట్లు పంచుకుని కేకలు వేసుకుంటూ ఏవో నీతులు చెప్పి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కాదు. ఇది ఎంతమాత్రం సరికాదు. స్వాతంత్ర్య పోరాటంలో నాటి మహనీయులు చూపిన కృషి, అంకితభావం, వారి త్యాగం, జీవితాలను పణంగా పెట్టి సాధించిన అపురూపమైన ప్రేమైక బహుమానం స్వాతంత్రం అని తెలుసుకుని స్మరించుకోవాలి. స్వాంతంత్రం ఎందుకూ అంటే, మన జీవితాన్ని మనమే స్వేచ్ఛగా మలచుకుని ఓ మంచి మార్గంలో పెట్టుకుని పరిపూర్ణమైన మానవునిగా ఉండేందుకు. అంతేతప్ప ఎవరో మన జీవితాలను మలచడం కోసం కాదు. 

స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది, కానీ మౌలిక వసతుల మాటేమిటి... అందుకే ఇప్పటితరం చేయాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉండాలన్నది మనకు మనమే నిర్దేశించుకోవడం, అలాగే దేశం ఎలా ఉండాలో.. అలా తీర్చిదిద్దుకోవడం, అదేవిధంగా భావితరాలకు కావల్సిన బంగారు బాటను వేయడం. అందుకోసం ప్రాథమిక అవసరాలైన పోషణ, ఆరోగ్యం, విద్య, మరియు జీవావరణ వ్యవస్థలను పటిష్టపరచుకోవడం. ఇవి అవశ్యం.  దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్న మనం దేశానికి అవసరమైన గొప్పగొప్ప నాయకులను మాత్రం తయారు చేసుకోలేకపోయాం. రాజకీయవేత్తలను, నిర్వాహకులను తయారుచేసుకోగలిగాము కానీ దేశానికి కావలసిన గొప్ప నాయకులను మాత్రం సాధించుకోలేకపోయాము. సమగ్రత, మేధస్సు దేశానికి అవసరం. వీటిని ఆయుధాలుగా చేసుకుని నేటి యువత దేశాన్ని నడపాలి. మనం కొన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని చూపిస్తున్నప్పటికీ, జనాభాలో ఇప్పటికీ 50 శాతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దేశ జనభా శక్తియుక్తుల్ని ఉపయోగించుకోకుండా ఏ దేశమూ ప్రగతిపథంలో పయనించజాలదు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనూజాలదు. అందుకే ఈ స్వాతంత్ర్యదినం నాడు, ప్రతి భారతీయుడు ప్రతినబూనాలి. మనకు మన దేశం ఎలా ఉండాలో అలా సృష్టించుకునేందకు పాటుపడాలని నిశ్చయించుకోవాలి. మనం మన దేశంకోసం పడిన శ్రమ భావితరాలకు బంగారుబాటలు వేయాలి. వాటిని ఆస్వాదించే భావితరం మనల్ని తలచుకుని గర్వపడాలి. ఈ స్వాతంత్ర్యదినోత్సవంనాడు ఈ లక్ష్యసాధనకు నడుం బిగించుదాం. 
   
 ప్రముఖ సాహితీ వేత్త ఆరుద్ర అన్నట్లు 'మన స్వతంత్రం మేడి పండు-మన దరిద్రం రాచపుండు'' లా దాపురించింది ప్రస్తుత దేశ పరిస్ధితి. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్వైర విహారం చేస్తున్నది. భారత రాజ్యాంగం సృష్టించిన ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందించాలని సంకల్పిం చింది. ఈ మేరకు పంచవర్ష ప్రణాళికల రూపంలో కొంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి సాధించింది. కాని సాధించాల్సింది ఎంతో ఉంది. స్వతంత్రం సిద్ధించే నాటికి దేశాభివృద్ధికి నిర్ణయించిన కర్తవ్యాలు ఇంకా నెరవేరలేదు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇప్పటికే గుర్తింపు పొందిన భారత దేశంలో అలజడి, అల్లకల్లోలం, అవ్యవస్థ నెలకొని ఉన్నాయి. దేశ మంతటా అవినీతి ఆవరించి ఉంది. అన్యాయం మితి మీరింది. దరిద్రం తాండవిస్తున్నది. దేశమంతటా జాతి బేధాలు, మత బేధాలు, ఆర్ధిక బేధాలు పడగలెత్తి బుసలు కొడు తున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక జనాభా, దారిద్య్రం వంటి ఎన్నో సమ స్యలు దేశాన్ని పట్టి పీడిస్తు న్నాయి. అవినీతి కుంభ కోణాలు విశృంఖలంగా వెలుగు చూస్తున్నాయి. బస్టాండులు, పార్కులు, వ్యాపార కూడళ్ళ నుంచి పార్లమెంట్‌ భవనం వరకూ అన్నీ ఉగ్రవాద దాడులకు గురి అవు తున్నాయి. ప్రస్తుతం అస్సాంలో సాగుతున్న మారణ హోమం జాతి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశ రాజకీయ సార్వభౌమత్వాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపు ఆజ్ఞల లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక విధానాల్లో చోటుచేసుకున్న అవకతవకలు మనల్ని ఇతర దేశాల ముందు తలదించుకునేలా చేసే పరిస్థితి నెల కొన్నది. బలహీన, అల్ప సంఖ్యాక వర్గాలకు సామాజిక న్యాయం ఎండమావిగా మారింది.

No comments:

Post a Comment