Monday, 25 February 2013
మరో మెట్టుపైకి సోదరి భావరాజు పద్మిని..

సోదరి పద్మిని రచనా సామర్థ్యానికి మరో వారపత్రిక ప్రోత్సాహం లభించింది. తెలుగు సాహిత్యం పై పట్టు సాధించి అనెక చోట్ల గుర్తింపు పొందిన సోదరి అంతర్జాల వేదికపై ఏడాది కిందట "అచ్చంగా తెలుగు" బృందానికి శ్రీకారం చుట్టి తన రచనా పాటవం పెంచుకోవడంతోపాటు మరికొందరు ఔత్సాహిక రచయితలు, రచయిత్రులను ప్రోత్సహించింది. పండుగలకు రెండు పర్యాయాలు రచనల పోటీలు నిర్వహించి విజేతలకు సాహితీమూర్తులు, ప్రముఖ పత్రికా సంపాదకుల ద్వారా బహుమతి ప్రదానం చేయించింది. బ్లాగుల నిర్వహణ సహా, అనేక నెట్ పత్రికలకు వ్యంగ్య, హాస్య, సాహితీ అంశాలు సహా ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన రచనలు చేసి గుర్తింపు పొందింది. తరువాత నాలుగో ప్రపంచ తెలుగు మాహా సభలు, ప్రపంచ మాతృభాషా దినోత్సవాల సందర్భంగా తెలుగు సాహిత్య సంబంధ అంశాలపై ఆకాశవాణిలో ప్రసంగించింది. 


మరో మెట్టు ఎక్కి "క్షత్రియ ప్రభ"మాస పత్రికలో వేర్వేరు అంశాలపై రచనలు మొదలెట్టింది. గత 16 సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని నుంచి తెలంగాణా ప్రాంత సంపూర్ణ స్వతంత్ర వారపత్రికగా ప్రచురితమవుతున్న "ప్రజాతంత్ర"లో రచయిత్రిగా మరో అడుగు ముందుకేసింది. వారపత్రిక తాజా సంచికలో స్వీయ అనుభవాలను "అంతర్జాలపు మాయాజాలంలో రచయిత్రులు" శీర్షికన ఆవిష్కరించింది. తాజాగా మొదలైన "రాజకీయ మాయాజాలం" గ్రూపులో కూడా రాజకీయాలపై చురకలు అంటించడం మొదలెట్టి అక్కడ కూడా తన ప్రతిభ నిరూపించ్కుంటున్నది. 


ఇప్పటికే ఆమె అనేక ఆధ్యాత్మిక రచనలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసి గురువరేణ్యులు, పలువురు పెద్దల ప్రశంసలు అందుకుంది. మా ఆడపడుచు పద్మిని ఇలా ఒక్కొక్క సోపానం అధిష్ఠిస్తూ, భగవత్ కృప, గురువరేణ్యుని ఆశీస్సులతో, సాహితీ రచనల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని, ఒక మంచి గుర్తింపు పొందాలని మనసారా కోరుకుంటూ ఆమెకు అన్నీ విజయాలు కలగాలని అన్నయ్యగా ఆకాంక్షిస్తున్నా..

                                                          నమో హిందుమాతా మాతా సుజాతా!!!
శ్రీ మాన్ బుధ్ధ ప్రసాద్ గారూ! నమస్కారాలు. తెలుగు అభివృధ్ధికి మీరు చేస్తున్న అవిరళ కృషిని మనసారా అభినందిస్తున్నాం. 

తెలుగు జాతికి అనర్ఘ రత్నమైన ఒక ప్రాచీన ప్రాచుర్య గీతాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.. దానిని పునరుజ్జీవింపజేసి ఈ తరానికి ఆతరం ఘనతను తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు ఆరు దశాబ్దాలకిందట ఈ గేయ రత్నం కనీసం అయిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉండేది. విద్యార్ధినీ విద్యార్ధులకు కంఠోపాఠం గా ఉండేది. మాన్యులు మీ తండ్రిగారు దివంగత వేంకట కృష్ణారావు గారు కూదా చాలా ఇష్టపడిన గేయం. దీని ప్రాభవం మీకు తెలీదనే ధైర్యం చేయలేము..

దీనికి మళ్ళీ బహుళ ప్రాచుర్యం కల్పించి .. విపుల హిమాద్రులు, వేణీభరము, కంఠహారము, కటిసూత్రము, గోలకొండ, 
రత్నకోశము, కోహినూరు, తాజమహలు వంటివాటిని ఈ తరానికి, భావితరానికి శాశ్వతంగా గుర్తుండే మాదిరి చర్య తీసుకోవాలని, రాష్ట్రప్రాభవం తెలిపే ఈ గీతాన్ని సభలలో వినిపించేలా చొరవ తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నాం. పూర్తిగా కనుమరుగైన ఈ గీతాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన ఘనత తెలుగింటి ఆడపడుచు, తెలుగు భాష వీరాభిమాని, సోదరి శ్రీమతి భావరాజు పద్మినిది. ఆమెను అభినందిస్తున్నాం. మీనుంచి అటువంటి భాషాభిమానులకు ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం.... 
----------------------

"నమో హిందుమాతా మాతా సుజాతా
నమో జగన్మాతా
అమోఘ దివ్య మహిమ సమేతా
అఖండవర భరతఖండ మాతా
విపుల హిమాద్రులే వేణీభరముగ
గంగా యమునలె కంఠహారముగ
ఘన గోదావరి కటి సూత్రమ్ముగ
కనులకు పండువ ఘటించు మాతా
గోలకొండ నీ రత్నకోశమట
కోహినూరు నీ జడలో పూవట
తాజమహలు నీ దివ్య భవనమట
ఆహాహా నీ భాగ్యము మాతా!!"
----------------------


మీకు చిరపరచితుడనైన

నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్.

Friday, 22 February 2013
                                                ఇది రాజకీయ మాయాజాలం. రాజకీయ రచనల బృందం.


                                             
                                              

ఓం శ్రీ పద్మావతి సహిత వేంకటేశ్వరాయనమః. ఓం గురుభ్యోన్నమః, జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరిదేవికి ఫ్రణామములు. చెల్లెలు భావరాజు పద్మినికి కృతజ్ఞతలు. 

ఇది రాజకీయ మాయాజాలం. రాజకీయ రచనల బృందం. విలువలను గౌరవించే వ్యక్తులకు సాదర ఆహ్వానం..

ఈ రోజు పవిత్ర భీష్మ ఏకాదశి.ప్రపంచ మాతృభాషా దినోత్సవం కూడా కలిసొచ్చింది. గురువారం. జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ శుభదినాన నాకు, నా తోటి వారికి ఆసక్తిదాయక కార్యక్రమం చేపట్టాలన్న అలోచన తళుక్కున మస్తిష్కంలొ మెరిసింది. 

ఆందుకు స్ఫూర్తి నా చెల్లెలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావరాజు పద్మిని. నా ఆలొచనలు, వృత్తి, ప్రవృత్తిని గమనంలో ఉంచుకుని,"అన్నయ్యా నీకిష్టమైన రాజకీయ రంగం నుంచి ఈ మధ్య దూరమవుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. నీ ఆసక్తిని చంపుకోవద్దు. సృజనను వెలికితీసి తెలుగు భాష, ఆధ్యాత్మికం, రచనా వ్యాసంగంతో పాటు నీ మూడున్నర దశాబ్దాల పాత్రికేయ వృత్తికి మూలామైన రాజకీయంపై మళ్ళీ దృష్టి సారించి, రాజకీయ మాయాజలంపై నీ అస్త్రాలు సంధించడం ప్రారంభించు, నీ భావజాలం కలిగిన వారితో కలసి అడుగులు కదుపు" అని సలహా ఇచ్చింది.

నన్నేమి చేయామంటావమ్మా, అని అడగగా, రాజకీయ అంశాలపై ప్రత్యేక బృందం (గ్రూపు) ప్రారంభించవలసిందిగా సలహా ఇచ్చింది. చెల్లెలు ప్రోత్సాహం నాకు వెయ్యేనుగుల బలం ఇచ్చినట్లయింది. అందుకే శుభస్య శీఘ్రం అన్నట్లు, చెల్లెలు అమృత హస్తాలతొ రాజకీయ బృందానికి శ్రీకారం చుడుతున్నాను. రాజకీయ అంతా మాయాజాలం దానికి తోదు ఇది అంతర్జాల ప్రపంచం అందుకని ఈ గ్రూపునకు "రాజకీయ మాయాజాలం" గా నామకరణం చేయించాను. నందిరాజు ఇంటి ఆడపడుచు పద్మిని చేతుల మీదుగా కొద్ది నిముషాల కిందటే అధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలింపజేయించి ఆ బంగరు తల్లి చేత ప్రారంభింపజేశాను.

అచ్చంగా తెలుగు ఏర్పడి నేటితొ ఏడాది పూర్తైన శుభ ఘడియల్లో ఆ అమృత హస్తాలతో మరో నూతన బృందావిష్కరణ జరిగింది. నాతో మీరుకూడా అలోచనలను పంచుకుంటారని, నిష్పాక్షికంగా రాజకీయ విశ్లేషణలకు తోడ్పాటునిస్తారని ఆశిస్తున్నాను. విలువల ప్రాతిపదికపై ఈ బృందం నడుస్తుంది. రాజకీయ నాయకుల అభిప్రాయాలకు కూడా తావిస్తాము. వ్య్క్తిగత దూషణలు, విమర్శలకు చోటు లేదు. కేవలం ప్రజాల ఆకాంక్ష మేరకు రాజకీయ ప్రస్తావనలు జరుగుతాయి. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఇక్కడ మిత్రులు, స్నేహితులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయ వచ్చు.

ఒక్కొక్కరు రోజులో ఒక అంశంపై 10-12 పంక్తులకు మించకుండా పోస్టింగ్స్ ఇవ్వవచ్చు. వర్తమాన రచనలకే ప్రాధాన్యం. పాత రచనలు, ప్రచురణలకు ఏమాత్రం స్థానం లేదు.బ్లాగు రచనలకు తావు లేదు. ఇక్కడ రాసిన అనంతరం మాత్రమే వారి సొంత బ్లాగుల్లో పెట్టుకోవచ్చు. ఆధ్యాత్మిక,సంగీత, సాహిత్య, భాషాభి వృధ్ధి అంస్శలకు కూదా ప్రాముఖ్యత కల్పిస్తాము. కవితలు, గేయాలకు ఇక్కడ ఆస్కారం లేదు. ఇది జనవేదిక వంటిది. చెల్లెలు పద్మిని తనకు ఇష్తమైన అంశంతో ఒక వ్యాసంగాని అందివ్వాలని అభ్యర్ధిస్తున్నాను. ఇక మొదలిడదామా!!

Thursday, 21 February 2013


                                                           అచ్చంగా తెలుగుకు ఏడాది పూర్తయింది 


బుడి బుడి నడకలతో మొదలై వడి వడి అడుగులతో ఉరకలేస్తున్న "అచ్చంగా తెలుగు" బృందానికి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. .. 

చెల్లెలు చి.ల.సౌ. భావరాజు పద్మినికి ఆశీస్సులు, అభినందనలు, మంగళహారతులు, విజయ దుందుభులు..

కమ్మనైన అమ్మ భాష పట్ల మక్కువతో మరింత ఆసక్తి పెంచుకుని, ఆ మాతృభాష పరిమళాలను తెలుగు నేల నలుదిశల వ్యాపింపజేసే సదాశయంతో సరిగ్గా ఏడాదికిందట,తెలుగు వారికి ప్రతిష్ఠాత్మకమైన పర్వదినం వంటి ఇదే మాతృభాషా దినాన 2012 ఫిబ్రవరి 21న ప్రారంభించిన అచ్చంగా తెలుగు బృందం నేటితో ఏడాది పూర్తిచేసుకుని రెండో సంవత్సరంలో అడుగెట్టింది. ఈ బృందం ఇప్పుడు 608 మంది సభ్యులతో అలరారుతున్నది. 

ఏడాదిలో అచ్చంగా తెలుగు ఎలా ఎదిగిందంటే ఆ నాడు బలిచక్రవర్తి నుంచి దానంగా పొందిన మూడడుగులకోసం విశ్వమంతా వ్యాపించిన వామనుని వలే... పద్మిని అకుంఠిత దీక్ష, ఉత్సాహం ఇనుమడించినందునే ఏడాదిలో ..ఆనాడు వామనుని మూర్తి మాదిరి......అచ్చంగా తెలుగు "బ్రహ్మాండాంతసంవర్ధియై.." ఎదిగిగి పెద్దల మన్ననలు పొందింది.

మరోసారి చెల్లెలుకు అభినందనలు. ఆమెకు సహకరిస్తున్న సభ్యులకు హృదయపూర్వక అభివాదములు.. ఆమెకు వెన్నుదన్నుగా నిలిచి అండందలందిస్తున్న "తెలుగు బావగారు: సతీష్ గారికి కృతజ్ఞ్తలు. అశీస్సులందిస్తున్న గురువర్యులకు, ప్రొత్సహిస్తున్న పెద్దలకు ప్రణామములు.,

ఈ సందర్భంగా.. పోతనామాత్యుని ఘంటమునుంచి జాలువారిన ఆ మృదుమధురమైన అచ్చ తెలుగు పద్యం ఇక్కడ పునః పఠించుకోవడం మాతృభాషను గౌరవించుకున్నట్లే అవుతుంది..

ఇంతింతై, వటుడింతై, మఱియు దానింతై, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై...

అలా పెరుగుతున్న మన తెలుగుకు వచ్చిన ప్రమాదమేమీలేదు.. మనకంతా ప్రమోదమే..

Sunday, 17 February 2013                           ప్రేమే భారమై.. హృదయం శూన్యమై.. యువతకు మానసిక క్షోభ..

                                                              ప్రేమను ప్రేమించు.

                                       (మహా తాత్వికుడు, జగద్గురువు జిడ్డు కృష్ణమూర్తి..)


(అయిదో భాగం)

ఈమధ్య ప్రేమ అతి భారమైన అంశంగా తయారై అనేకమందిని అనేక విధాలుగా బాధించి తద్వార మరికొంతమందిని   పరోక్షంగా బాధకు గురిచేస్తున్నది. అసలు ప్రేమ ఏమిటి,ఏలా ఉంటుంది. తత్వము, రూపము, గుణము ఎలా ఉంటాయి? 70  సంవత్సరాల పాటు ప్రపంచం చుట్టివచ్చిన మహా తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి ప్రేమను గురించి ఇలా అభివర్ణిస్తారు.  ఒకసారి చదివితే  అర్ధం ఆదు. పదికి మరో పది సార్లు చదవాలి. యువత ముఖ్యంగా అర్ధం చేసుకోవాలి. ఇది   సుదీర్ఘం..

ప్రేమ ఒక వింతైన వస్తువు. మనం తేలిగ్గా దాని వెచ్చని మంటను పోగొట్టుకుంటం. మంట పోతుంది. పొగ మిగులుతుంది.మన హృదయాలు మనసులు పొగతో నిండిపోయాయి. కన్నీళ్ళతో రోజులు గడుపుతున్నాం. పాట మర్చిపోయాం, మాటకు అర్ధం పోయింది. పరిమళం పోయింది. చేతులు వట్టివైపోయాయి. పొగలేకుండా మంటను స్పష్టం చేసుకోవడం మనకు తెలియకుండా పోయింది. పొగ ఎప్పుడూ మంటను అణచివేస్తుంది.

ప్రేమ మనసుకు సంబంధించినది కాదు.  అలోచన అనె గూడులో లేదు. దాన్ని వెతకలేం. అబహ్యసించలేం. పోషించలేం. మనసు మౌనంగా, హృదయం ఖాళీగా ఉన్నప్పుడు ప్రమ ఉంటుంది. ప్రేమకు పేరులేదు. మంచిమాటలతో ప్రేమనుపుట్టించలేం. మొత్తం అలోచన ప్రక్రియను కాదనడమే ప్రేమ. కాదనడంలో ఉన్న సౌందర్యమే ప్రేమ. ఇదిలేకుండా సత్యానందం లేదు. ప్రేమ తయారయ్యే స్థితికాదు.ప్రేమ సున్నితమైనది. బహిరంగమైనది. చింతించేది కాదు. తెలియనిది. ప్రేమ ఇచ్చి పుచ్చుక్నేసరకు కాదు. అది వ్యాపారమైన మార్కెట్లో కొనేవస్తువు కాదు. ప్రేమించడమంటే ప్రతిఫలం కోరడం కాదు. ప్రేమ స్వేచ్ఛ నెరుగగలదు.

తల్లిదండ్రులుసైతం పిల్లలను ప్రేమలేనిచోతికి చదువుకి పంపుతారు. వారు నీలో కోరుకునేది ఒక మంచి ఉద్యోగం. జీవితం విజయవంతం కావడం మాత్రమే. అందుకే న సమాజం క్రమేపీ క్షీణించిపోతున్నది. ప్రేమించబడాలని పట్టుపట్టనంతకాలం నీలో ప్రేమ ఉండదు. ప్రేమ భావన కలగకపోతే నీవు అసహ్యంగా, క్రౌర్యంగా ఉంటావు. ప్రేమలేకపోతే శవప్రాయుడే. చచ్చిన వస్తువు ప్రేమనుకోరడం ఇంకా చచ్చినట్లే అవుతుంది. నీ హృదయం ప్రేమతో నిండి ఉంటే, ప్రేమించబడాలని కోరవు. నీ ఖాళీబొచ్చను నింపాలని దాన్ని ఎవరిముందూ చాచవు.  ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడే అది నింపాలని కోరుకుంటావు. శూన్య హృదయం ఎప్పటికీ పూరించబడదు.

బాహ్యంగా ఎన్ని అలంకరణలున్నా హృదయంలో ప్రేమ లేకపొతే మనిషి అసహ్యకరమైన కురూపి. ప్రేమించినపుడు ముఖంలో కళ కనిపిస్తుంది. యవ్వనంలో ఉన్నప్పుడూ పువ్వులను, ప్రజలను, జంతువులను ప్రేమించకపోతే పెద్దవాడైన తరువాత జీవితం శూన్యమవుతుంది. ఒంటరివైపోతావు. భయంతో చీకటి నీడలు ఎప్పుడూ వెంటాడుతుంటాయి.  కానీ అసాధరణమైన ప్రేమ  హృదయంలో ఉంటే, లోతుగా భావిస్తే, దాని ఆనందం, తన్మయత వలన ప్రపంచం పూర్తిగా మారిన అనుభూతి ఏర్పడుతుంది.  ప్రేమించగలిగినప్పుడు క్రమశిక్షణతో పనిలేదు. ప్రేమ క్రియాత్మకమైన అవగాహన ఇస్తుంది. విరోధం లేదు. ఘర్షణ లేదు. ప్రేమించదమే ఈ ప్రపంచంలో క్రమతను ఏర్పరుస్తుంది.ప్రేమను దాని పని దానిని చెయ్యనియ్యండి. --The Wold Teacher 'Jiddu Krishna Murti

Thursday, 14 February 2013


తల్లీ! పద్మినీ మీ కుటుంబానికి ఆ సీతారాములు, పవనసుతుని ఆశీస్సులు

మనసంతా ఆనంద తరంగాలపై ఓలలాడుతున్న శుభ తరుణాన ఒక  విషయం. ఈ రోజు మా కుటుంబం లోని ముగ్గురి హృదయల్లో మూల విరాట్టు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మిని. "పద్మిని, మా నందిరాజు కుటుంబ పెద్దాడపడుచు". మా అందరి కంటి వెలుగు. వయసున  చిన్నదైనా ఆమె మా అందరికీ నిజంగా ఒక మార్గదర్శకురాలు. కష్ట సుఖాల్లోనే కాదు... మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలుగా పద్మిని మాకు కొండంత అండ..  మాకు జగద్గురు  ప్రసాదించిన గొప్పవరం ఆమె. సద్గురు దర్శన భాగ్యం కూడా మాకు పద్మిని కల్పించిన మహదవకాశమే.  ఎందరో పెద్దల సహచర్యం కూడా ప్రాప్తించింది.  

నాకు ఇందరు చెల్లెళ్ళు ఉండడం ఎంతో గర్వకారణం. అన్నయ్యంటే చెల్లెళ్లకి ఎంత ప్రేమో! ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయతను పంచి ఇచ్చే ఇంతమంది ఆడపడుచులు తోడు నీడగా ఉన్నారని  నా భార్యకు ఎంత సంతోషమో.. ఇంతమంది మేనత్తలున్నారని మా అమ్మాయికి అంత ఆనందం. ఇంతమంది ఆత్మీయులను, ఆప్తులను మాకు చేరువ చేసింది మా ఇంటి పెద్దాడపడుచు పద్మిని.  సతీష్ పద్మిని దంపతులు, చిరంజీవులు అనూష, సమీరకు ఎల్లవేళల భగవత్ కటాక్షం, సద్గురు దీవెనలు ప్రసరించాలని, సర్వ విజయాలు చేకూరాలని మా ముగ్గురి మనఃపూర్వక ఆకాంక్ష.Wednesday, 13 February 2013

ఎడిటరు విలువలు ఎలా ఉండాలి!!? 

పత్రికా రంగం, ఎడిటర్లు, పాఠకులు దిగజారతారని పెద్దలు(విజ్ఞులు) నూటపాతిక సంవత్సరాల కిందటే ఊహించినట్లున్నారు. 1871లో మద్రాసు నగరం నుంచి ముద్రణ, ప్రచురణ "ఆంధ్ర భాషా సంజీవని" అనే మాస పత్రికలో ఎడిటర్లు, ఎదిటర్ సహాయకులు, పాఠకులు ఇలా ఉండాలని కొన్ని విలువలు సూచించారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. ఇప్పుడు "సంపాదకులు" తయారయ్యారుకానీ ఆదిలో అందరూ విలేఖకులే! అంటే ఎడిటర్లు అని అర్ధం. 

"..పండితుండును, సత్ప్రవర్తకుండును, జగద్వ్యాపార విజ్ఞుండు, స్థైర్యయుతుడు, ధైర్య సంపన్నుడు, ధని, యుచితజ్ఞుండు, శక్తి త్రయాధ్యుండు, సూక్తిచతురుడను పదంబులె బిరుదాభిదానంబులు, బిరుదాభరణములై లెలయు మిగుల.. ఈ విశేష మణుల్ భావింపబడునవలక్ష్ణములివే విలక్షణములు గాన నిటు నవ లక్షణ కలితుడైన వాడు నవరత్నహార సంభావనీయుడవు విలేఖకుడిటుగామి నేనే యొరుడు వానివలె గాక కుముఖుండయౌ నిజముగ.."

ఎడిటరుకు ఉండాల్సిన తొమ్మిది లక్షనాలు ఇవిట.శక్తిత్రయం కలిగియుండటం అందులో ఒకటి. సక్తి త్రయమంతే..ప్రభు భక్తి, మంత్ర శక్తి, ఉత్సాహం నిఘంటుకారులు ఇచ్చిన అర్ధం. ఇందులో ప్రభుభక్తి అంటే ప్రభుత్వం అండ దండలు అని గాక యాజమాన్య నిర్వాహణ సామర్ఠ్యం అని అర్ధం చేసుకోవాలి. మంత్ర శక్తి అంటే అలోచనా శక్తి, మేధస్సు అని అర్ధం చేసుకోవాలి. ఎడిటరుగా తన నైతిక బాధ్యత నిర్వర్తించాలంటే న్యాయంగా ఈ పై లక్షణాలు అవసరం..

ఎడిటోరియల్ విభాగంలో ఎడిటరు ఒక్కడే సమస్త పనులను సమర్ధంగా పనిచేయలేడు. సహాయం ఉంటేనే పత్రిక బాగా వస్తుంది. ఆ కాలంలో తక్కువ సహాయకారులు ఉండే వాళ్ళు.కొందరు కార్యాలయంలో ఉండి పని చేస్తే ఇంకొందరు బయటకు వెళ్ళి విషయ, వార్తా సమాచార సేకరణ చేసుకు వచ్చేవారు. అలాంటి సహాయకబృందం ఉండి, ఎడిటరు అలోచనా విధానాలకు అనుగుణంగా నదచుకుంటేనే పత్రిక విజయవంతం అవుతుందని చెప్పారు.[ఈ సమాచారం "ఆంధ్ర జాతి ఆక్షర సంపద- తెలుగు పత్రికలు" గ్రంధం నుంచి సేకరించినది]

ఆ విలువలను మంత కలిపే వ్యక్తులు ఇప్పుడు (ఎడిటర్లు) సంపాదకులుగా తయరై పాత్రికేయ వృత్తిని, పత్రిక విలువను కాల రాస్తున్నారు. ఈ కుహనా పాత్రికేయులను ఒక కంట కనిపెట్టాలి


ఎడిటర్.. .

తెలుగునాట ఎడిటర్ గా ఖ్యాతినొందిన నార్ల వెంకటేశ్వరరావు గారు..ఆ ఎడిటర్ ఎలా ఉండాలో ఇలా చెప్పారు...

నీతి నియతిలేని నీచుని చేతిలో
పత్రికుండెనేని ప్రజకు చేటు:
హంత చేతి కత్తి గొంతులు కోయదా?
నవయుగాల బాట నార్ల మాట!

వర్తమాన జగతి పరివర్తనాలపై
స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి
ఎడిటరెందుకోయి ఏటిలో గలపనా?
నవయుగాల బాట నార్ల మాట!

ఎడిటరైనవాడు ఏమైన వ్రాయును
ముల్లె యొకటె తనకు ముఖ్యమైన:
పడుపు వృత్తిలోన పట్టింపులుండునా?
నవయుగాల బాట నార్ల మాట!

పత్రికారచనౌ పడపు వృత్తిగమార్చు
వెధవకంటె పచ్చి వేశ్య మేలు:
తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా..
నవయుగాల బాట నార్ల మాట!
                         జ్ఞానము జ్ఞాపకాల పుట్ట, ప్రేమ లేని జ్ఞానం నాశన  హేతువు: జిడ్డు కృష్ణమూర్తి.

                                                                  (ఇది నాలుగో భాగం.. )


జి కె అన్ని భవబంధాలను వదుల్చుకున్న తరువాత సంపూర్ణ  స్వేచ్ఛతో 70 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ప్రపంచాన్ని చుట్టి బహుజనానికి బోధ చేశారు. మొదటి నుంచి చివరి వరకు స్వేచ్ఛ , విద్య-జీవిత ప్రాధాన్యత, అసాధ్యమైన ప్రశ్న, కృష్ణమూర్తి నోట్ బుక్, కృష్ణమూర్తి జర్నల్, జీవన వ్యాఖ్యానాలు, హింస కావల, జీవన పరిపూర్నత, ప్రజ్ఞా మేలుకొలుపు తదితరాలైన రచనలు, ప్రవచన గ్రంధాలన్యు పాతికపైగా రాసి ప్రచురించారు.  ఆయన విప్లవాత్మక భావాలకు అనుగుణంగా ఇండియ, ఇంగ్లండ్, అమెరికా దేశాలలో ఏడెనిందికి పైగా కొత్త పాఠశాలలు ఏర్పడ్దాయి. కృష్ణమూర్తి ఫౌండషన్ వాటినిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నది.
 
జికె ప్రబోధాలు కదళీఫలం కాదు, నారికేళమే.. ఒక పట్టాన జీర్ణం కావనే ప్రచారం ఉంది. సత్యానికి మార్గమంటూ లేదని, ఏ మార్గం ద్వారా కాని, ఏ మతం ద్వారాగాని, ఏశాఖ ద్వారా కాని, సత్యాన్ని పొందలేరని, సత్యం హద్దులకు నిబధ్ధతలకు లోనుకానిదని ఆయన చెప్పేవారు. అందువల్లనే సత్యాన్ని సంస్థాగతం చేయకూడదని, చేస్తే శవసదృశమవుతుందని ముఖం మీద కొట్టినట్లు వెల్లడించేవారు. ప్రజలను ఒక ప్రత్యేక సంస్థ, లేదా  సంఘాన్ని బట్టి పోవాలని ఒత్తిడి చేయడం తగదని స్పష్టం చేశారు.

దేవునిలో నమ్మకమే మతమనుకుంటామని,నమ్మకపోతే  నాస్తికుడని సమాజం, సంఘం తిట్టిపొస్తుందని, అలా కాకుండా నమ్మితే  ఒక సంఘం తిరస్కరిస్తుందని, నమంకపోతే మరొక సంఘం దండెత్తుతుందని అనేవారు. ఏ మత విశ్వాసమైనా మనుష్యులను వేరు చేస్తుందని పేర్కొంటూ విశ్వాసమ కేవలం వ్యక్తిగతమని కుండబద్దలు కొట్టినట్లు జికె చెప్పేవారు.

జ్ఞానం గురించి మాట్లాడుతూ, కేవలం తెలిసినదే జ్ఞానమని, దానిని మెదడు కణాలు సేకరిస్తాయని, అనతరం అది ఒక జ్ఞాపకంగా మిగులుతుందని తెలిపే వారు. జ్ఞాపకాల పుట్టను జ్ఞానమంటారని, అంతే గాక గతమే జ్ఞానమని జికె వివరించారు. సాంకేతిక జ్ఞానం ఒక మేరకు మాత్రమే, ఒక స్థాయిలో అవసరమని, అది భౌతిక జీవనానికి ఆధారమని వివరణ ఇచ్చారు.  మనిషిని జ్ఞానం మానసికంగా నిబధ్ధిస్తుందని, స్వేచ్ఛనివ్వదని, అది కొనసాగే ప్రక్రియ కనుక దానికి పరిపూర్ణత లేదని వాదం వినిపించే వారు.

అందువల్ల జ్ఞానం సృజనాత్మకమైన ఆంశం ఆదనికాదని,జ్ఞానంలో ఉబ్బి తబ్బిబ్బైన పండితులలో తామెక్కువంటే తామెక్కువన్న అహంకారం ఆవరించడం మొదలవుతుందని నిష్కర్షగా చెప్పి విషయ సేకరణ కంటే అవగాహన ముఖ్యమని ఆయన అనేవారు. "నిన్ను నీవు అర్ధం చేసుకోకుండా పెద్దల వత్తిడికి లోబడితే మనస్సును అణచివేయడం ప్రారంభమవుతుంది", అని హెచ్చరించేవారు. మనసు అణచివేతకు గురవుతే భయం ఆవరిస్తుందని, భయం ఉన్న చోట ప్రేమ ఉండదని, ప్రేమలేని జ్ఞానం మనలను నాశనం చేస్తుందని నిష్కర్షగాచెబుతూ, ప్రస్తుతం అదే జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారు.

ధ్యానం గురించి ప్రసంగిస్తూ, ధ్యానం అంటే మనసును డొల్ల చేయడమని, ఆ ప్రక్రియ ద్వారా నూతనత్వం పుట్టుకొస్తుందని, అన్ని ఆలోచనలనుండి, శబ్దాల నుండి మనసుకు స్వేచ్ఛనివ్వడమే నిజమైన ధ్యానమని నిర్వచించారు. ధ్యానంలో ఏకాగ్రత అనెది  స్వార్థపరంగా మొలకెత్తే అంశమని పేర్కొంటూ, అన్ని శక్తులను శ్రధ్ధగా, సావధానంగా సమీకరించడమేనని  ఉద్బోధించేవారు. సావధాన  సమీకరణే  ప్రేమ సుమం వికసించడానికి దోహద పడుతుందనేవారు.

"నేను-నాది" ఇవి వ్యక్తి భావాలని గుర్తించడం అవసరమని అవి ఒక విధంగా సార్థకాలు, అర్ధరహితాలని చెబుతూనే అవి వ్యవహారానికి అవసరమని అనేవారు. -నా చేయి, నా సరీరం, నా చిత్తం, నా ఆత్మ, నా దేవుడు.. అనడంతో నేను వేరు, నా చేయి వేరు అని విడదీస్తున్నామని అనిపిస్తుందనే వారు జికె. నేను- వేరు చేసి; ఇది శాస్వతం, సత్యం, సర్వాత్మ అంటూ వివరిస్తుంటామని, నా ఆత్మ- అన్నప్పుడు, నేను ఆత్మ వేరైనత్లేనా? నేనుకు-ఆత్మకు తేడా ఏమిటి? అని ప్రశ్నించేవారు. "అహం బ్రహ్మాస్మి-ఆయ మాత్మా బ్రహ్మ" అనే వాక్యాలను "నేను బ్రహ్మను,ఈ ఆత్మయే బ్రహ్మ -నేనే ఆత్మను, బ్రహ్మను" అని వాటి అభిప్రాయమని వివరణ ఇచ్చారు.అయితే నేను అన్నది వేరైనదా? లేక అనీ అదేనా? అనే సంశయం ఉత్పన్న మవుతుందనేవారు. దైవాన్ని, దైవశక్తిని ఆత్మ అని, పరమాత్మ అని, అంటే  పేర్కొంటుంటారని,  అంటే అతీత శక్తి "ఆత్మ" రూపమైందని అంటారని, బ్రహ్మ, పరబ్రహ్మ ఆత్మకు పర్యాయ పదాలని జికె తెలిపే వారు. "నేను" I  అని ME అని SELF అని EGO    అని ఇంగ్లీషులో వాడతారని చెప్పేవారు. "ఆత్మ" SOUL అని,SPIRIT అని వాడతారు అని కూడా వివరించేవారు.

(మిగతా భాగాలు త్వరలో..)

ఇది మాకొక పెద్ద పండుగ రోజు  

ఒక రోజున ఎన్ని ప్రాశస్త్యాలో 

రేపు,   14 తేది గురువారం ఎంత ప్రాశస్త్యమైన దినమో!! ఎన్ని శుభ ఘడియలో, ఎన్ని నిశ్చితార్ధాలో, వివాహాలో.. ఎన్నిపెళ్ళి రోజులో.. ఎంత  పవిత్ర దినమో!!ఈ సంవత్సరం అదే రోజున మనకు అత్యంత ముఖ్యమైన రోజని కూడా తెలుసుకుందాం. మాఘ మాసం శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని అంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజించడం ప్రశస్తం. మరో ముఖ్యమైన రోజు కూడా..  అదే ప్రేమికుల రోజు !!   Valentine day అని విదేశీయులను అనుకరించి మనవారంతా శుభాకాంక్షలు అందజేసుకుంటారు. ఇదే రోజున నందిరాజు వారి ఇంట దశాబ్దాల కిందట (ఎంకి-నాయుడు బావ) పెళ్ళిరోజు కూడా. 

ఎఱ్ఱి నా యెంకి..
-----------------
"యెనక జల్మములోన 
యెవరమో"నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక...నా యెంకి 
"ముందు మనకే జల్మ
ముందోలె" యంటి!
తెల్లతెలబోయింది
పిల్ల... నా యెంకి! 
"యెన్నాళొ మనకోలె
యీ సుకము"లంటి
కంట నీరెట్టింది 
జంట... నాయెంకి!

ఈ నెల 7 వ తేదీ ఈ ఎంకిపాట మీ ముందుంచి ఆ ఎంకి ఎవరో త్వరలో చెబుతానని చెప్పా.. గుర్తుండక పొవచ్చు. ఎందుకంటే నా మాటలు గుర్తుంచుకో తగినంత గొప్పవి కాదు.  ఎందుకంటే నేనే అతి సామాన్యుణ్ణి కనుక.  ఇప్పుడు చెబుతాను..ఎంకి గురించి. 
       
భౌతికంగా శివుడు, పార్వతీమాత అర్దనారీశ్వరులు. కృష్ణుడు ఆధ్యాత్మికంగా అసలైన అర్ధ నారీశ్వరుడు. రాధాకృష్ణులు కూడా అవిభాజ్య పదం, జంట. రాధ అనే పదం ఉంటే కృష్ణుడు ఉన్నట్టే. కృష్ణునికి అష్టభార్యలు, 16 వేలమంది గోపికలు ఉన్నా రాధ మాత్రమే ప్రేమ సామ్రాజ్ఞి, పట్టమహిషి. 14 వతేదీ ప్రపంచం ప్రేమికుల దినోత్సవం  (వాలన్‌టైన్స్ డే) జరుపుకుంటున్నది. ఇది ఎప్పటినుంచి మొదలైందో తెలీదు కాని కృష్ణ ప్రేమతత్వం  ద్వాపరయుగం నాటిది. ప్రేమికులు శాశ్వతంగా  అలాగే మిగిలిపొతారో, ఐక్యమవుతారో తెలీదు. ప్రేమించి కలసిపోవడం ఒక అంశం. పెళ్ళాడి ప్రేమను అజరామరంగా సాగించడం అదృష్టం. 

పెనుమాక వారి ఇంట పుట్టి నందిరాజూ వారింట మెట్టి, నందిరాజు  ఎంకి గా మారిన రోజు . నండూరివారు వారు కూడా బంధువులే  కనుక కాపీరైటు నాకూ ఉంటుందనుకుంటా..  ఎంకి  (వెంకట శ్యామల)ని ఈ బావ (అంటే నేను) మనువాడాడు.   ఆమే నన్ను మనువాడిందని మా వాళ్ళు అంటారు. ఎందుకంటే నేను రాధ గా ఆమె శ్యామ్‌గా. కలిస్తే  రాధేశ్యామ్. ఆమే స్వతహాగానే విష్ణుభక్తురాలు. అంటే మేము రాధాకృష్ణులు, మేము ప్రేమ జంట కదా! మమ్ములను అటు ఇటు తిప్పినా మళ్లీ మేమే..కృష్ణ-శ్యామల. ఇక నాలోనే రాధాకృష్ణులు ఉన్నారు. అంటే మాది రాధాకృష్ణుల ప్రేమతత్వం. మా మనువు రోజుకు ఒక విశేషమొకటుంది.  శ్రీ పంచమి కూడా అయింది..    

నాకు ఇల్లే లేదు కనుక సామ్రాజ్యం అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం. కానీ నాజీవిత సామ్రాజ్యానికి ఆమే మహారాజు, మహారాణి.. సర్వస్వం. సుఖాలు ఎన్ని అనుభవించిందో తెలీదుకాని కష్టాలను మాత్రం పూర్తిగా జీర్ణం చేసుకున్నది. ఒక్కరోజు కూడా ఇదికావాలని అడగలేదు. ఎందుకంటే అది ఇవ్వలేని వాడినని తెలుసు గనుక. అది నా అదృష్టమో, తన  దురదృష్టమో తెలీదు.  ఆ ప్రేమికుల పండుగరోజు  మా పెళ్ళి రోజు. ఫిబ్రవరి 14... అ పెళ్ళికూడా దశాబ్దాల కిందట జరగడం కలియుగ వైకుంఠం (తిరుమల) లోనే జరగడం కాకతాళీయమో, మా అదృష్టమో!!.  బంధు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు ఎవ్వరు కలసి వచ్చినా, రాకున్నా .. మేము కడ వరకు కలసి సాగుతాం, కలసే పోతాం....మాది కూడా ఒక "మిధునం"..... జన్మ జన్మలకూ మాదే మధురమైన "మిధునం". 

నా ఎంకి గురించి, నా గురించి ఆత్మీయంగా తెలిసిన మరొక ఆప్త బంధువు
-------------------------------------------------------------------- 
*అచ్చంగా తెలుగు  ఆడపడుచు*.."చెల్లెలు పద్మిని"..
---------------------------------------------------
ఇది మా ఇంట అన్నింటికంటే మించిన  పెద్ద పండుగ, ఎంత సంతోషమో!! 

మా ఇంట "ఎంకి" గురించి నా చిన్న నాటి స్నేహితులకూ ఎరుకే! ఎందుకంటే మా మిత్రులం స్కూలు రోజుల్లో గుంటూరులోని మా మామ గారి ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. గత నెలలో మేము 50 సంవత్సరాల బాల్య మిత్రుల పండుగ చేసుకున్నప్పుడు పదిహేను మంది మిత్రులు మా ఇంటికి వచ్చి మా జంటను చూసి సంతోషించారు. వారి భార్యలు కూడ అందరూ ఒకే స్కూలులో చదివిన బాల్య స్నేహితులు కావడం మరొక గొప్ప విశేషం..  ఎన్ని మధురమైన "మిధునాలో"..