Wednesday, 16 January 2013

16-1-2013


జి కె లో అనూహ్య మార్పు
బవబంధాలను తెంచుకున్నారు..


(జిడ్డు కృష్ణమూర్తి -2)అలా ఆగస్ట్ 17న పరివర్తన పొందిన జికె (జిడ్డు కృష్ణమూర్తి) కొంత కాలానికి మిత్రులతొ కలసి ఆస్ట్రియాలోని ఎర్వాల్డ్ కు వెళ్ళారు. అక్కడ రెండునెలలపాటు ఆయనలొ పరివేదన కొనసాగింది.ఒక రోజు ఆ పరివేదన పరాకాష్ఠకు చేరుకుని స్పృహకొల్పోయారు. నాటినుంచి జికె లో నిశ్చలత, గాంభీర్యం, తేజస్సు, దీక్ష, విశాలత, స్వేచ్ఛ,శక్తి స్పష్టంగా కనిపించ సాగాయి. అనుయాయులు, అభిమానులు మిత్రులు ఆయనను 'కృష్ణజీ' అని పిలవసాగారు. ఓహైలో ఉంటున్న భవనాలు కొనుగోలు చేసి "సోదరుల ట్రస్ట్"కు దఖలు పరచి -ఆర్యవిహార్- గా వ్యవహరించారు. ఇలా ఉండగా, అడయార్ లో స్వర్ణోత్సవ మహాసదస్సుకు హాజరు కావాలని సోదరులకు అనీబిసెంట్ నుంచి పిలుపు వచ్చింది. అయితే నిత్యకు అనారోగ్యం తార స్థాయిలొ ఉండడంతో  జి కె ఏదీ చెప్పలేక పోయారు. నిత్యకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదని పరమ గురువులు హామీ ఇచ్చారని  స్వయంగా అనీబిసెంట్ చెప్పడంతో కాదనలేక జి కె అడయారుకు బయలుదేరారు. మద్రాసు ప్రయాణం మార్గమధ్యంలో ఉండగా నిత్య మరణ సమాచారం జి కె కు తంతి ద్వారా తెలిసి ఖిన్నులయ్యారు. దాంతో గురువులపై ఆయనకు విశ్వాసం సడలింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎలాగో దిగమింగుకుని గుండె దిటవు చేసుకుని  జీవితాన్ని ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు . నిత్య తనలో  ఐక్యమైనట్లుగా తాను ద్విగుణీకృత శక్తిమంతుడైనట్లు ప్రకటించారు.

అడయారు చేరుకుని స్వర్ణోత్సవ సభలో అధునాతన భావాలను ప్రస్ఫుటింపజేస్తూ ప్రసంగించారు. అప్పటి వరకు ఆయనకున్న ఆధ్యాత్మిక భావాలకు, విధానాలకు మార్పు కోరుకున్నారు. ఆ సభల్లో 'ఒక ప్రపంచ బోధకుడు ఉదయించాడని" అనీబిసెంట్ ప్రకటించింది. అంతేకాక తాను కృష్ణజీకి భక్తి తత్పరతతోకూడిన శిష్యురాలిగా ప్రకటించుకుంది. అనీబిసెంట్, లెడ్ బీటర్ ఆశించినట్లు జి కె విశ్వగురువు కాలేదు. సమస్త విశ్వాసాలను, సర్వ విధానాలను, సకల సంస్థలను ప్రశ్నించారు. ఆ విధానాలు, విశ్వాసాలవలన సత్యదర్శనం కలగదని స్పష్టంగా చెప్పారు. 18సంవత్సరాలపాటు ఆదరించి, పెంచి పెద్దచేసి, తన అధ్యక్ష స్థానంలొ తనకై ప్రచారం చేసిన "ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్" సంస్థను అనీబిసెంట్ సమక్షంలోనే రద్దుచేసి, దానికి సంబంధించిన కోటానుకోట్ల రూపాయల విలువైన ఆస్తులను దాతలకు తిరిగి ఇచ్చేశారు. దివ్యజ్ఞాన  సమాజాన్నే వదలి, బవబంధాలనుండి, సంస్థలనుండి, విశ్వాసాలనుంచి, నిబధ్ధత నుంచి వైదొలగారు. సంపూర్ణ స్వేచ్ఛతో సర్వ స్వతంత్రుడయ్యారు.

సత్యానికి మార్గం లేదని, ఏ మార్గం ద్వారా కాని, ఏ మతం ద్వారాగాని, ఏ శాఖ ద్వారాకాని, సత్యాన్ని పొందలేరని ప్రవచించారు కృష్ణజీ. సత్యం హద్దుకు, నిబద్ధతకు లోనుకానిదని కనుక సంస్థాగతం చేయరాదని స్పష్టం చేసి.. అలా బద్ధత చేస్తే శవసదృశమేనని ప్రకటించారు. ఒక ప్రత్యేక సంస్థ, మార్గం వెంట మార్గంలో వెళ్ళాలని ఏ ఒక్క సంఘమూ ప్రజలను వొత్తిడి చేయవద్దని కోరారు. దేవుని పట్ల నమ్మకమే మతమనుకొంటామని, నమ్మకపోతే సంఘం నాస్తికుడుగా ముద్ర వేస్తుందని , నమ్మితే ఒక సంఘం లేదా సంస్థ తిట్టిపోస్తుందని నమ్మక పోతే మరో సంస్థ తిరస్కరిస్తుందని  చెప్పారు. ఏ  మత విశ్వాసమైనా మనుష్యులను విభజిస్తుందని, విశ్వాసం కేవలం వ్యక్తిగతమైనదని కృస్ణజీ బోధించారు... (మిగతా.. తర్వాతి భాగంలో...)                                          

Monday, 14 January 2013


14-1-2013

నిత్య సత్యాన్వేష ప్రక్రియలో జిడ్డు కృష్ణమూర్తి ప్రయాణ  విశేషాలు...

అనుకోకుండా మహాతాత్వికుడు జిడ్డు కృష్ణ మూర్తి గారి గురించి నిన్న ఎందుకో నాకు ఆలోచనలు మొదలయ్యాయి. నాకు తెలిసినంతవరకు ఆయన మార్గంలో అడుగులు వేస్తే మిగిలిన తాత్విక ప్రయాణాన్ని శ్రీ శర్మ గారి వంటి గురువర్యుల వద్ద అభ్యసించాలని మనసైంది. అందులో నా మొదటి  అధ్యాయానికి సంక్రాంతి పర్వ దినాన శ్రీకారం చుట్టాను. మూడు భాగాలుగా వివరించే చిన్ని ప్రయత్నం మొదలెట్టాను. నా అడుగులు పొరబడితే పెద్దలు సరిదిద్దగలరన్న విశ్వాసంతో....

నిత్య సత్యాన్వేషి, తాత్విక విప్లవకారుడుగా విశ్వఖ్యాతి నొందిన జిడ్డు కృష్ణమూర్తిగారిని శ్రీకృష్ణునిగా  భావించడానికి కారణం ఆయనకూడా శ్రీకృష్ణ పరమాత్ముని వలె సంజీవమ్మ- నారాయణయ్య దంపతులకు అష్టమగర్భ సంజాతకుడు కావడం ఒక కారణమంటారు. చిత్తూరు జిల్లా  మదనపల్లెలో రెవిన్యూ అధికారిగా నారాయణయ్య పనిచేస్తున్నప్పుడు 1895 మే 11వ తేదీ స్వగృహం పూజామందిరంలొ ఆయన జన్మించారు. అనంతరం నారాయణయ్య పదవీవిరమణ చేసి మదరాసు(అడయారు)లోని దివ్యజ్ఞాన సమాజంలో కొత్త విధులనిర్వహణలో చేరడం వలన బిడ్డలు సహా కుటుంబం మొత్తాన్ని అక్కడికి మార్చారు. పరమ గురువు మైత్రేయ మహర్షి అగోచరంగా ఉండి ప్రపంచాన్ని  రక్షిస్తున్నాడని విశ్వసించే దివ్యజ్ఞాన సమాజం లొ కీలక  సభ్యుడైన సి డబ్ల్యు లెడ్ బీటర్ ఒక సాయంత్రం అడయారు ఇసుకతిన్నెలపై ఆడుకుంటున్న కృష్ణమూర్తి ముఖ వర్చస్సు గమనించి ఆకర్షితుడయ్యరట. మైత్రేయ ప్రభువు ప్రవేసించడానికి కృష్ణమూర్తి దేహం అనువైనదని భావించిన బీటర్ ఆ బాలుని దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు డాక్టర్ అనీబిసెంట్ వద్దకు తీసుకుపొయి తన భావాన్ని వ్యక్తీకరించాడట.

అప్పటికి కృష్ణ వయసు 12 సంవత్సరాలు. ఆమెకూడా అంగీకరించడంతో కృష్ణ. అతని కనిష్ట సోదరుడు నిత్యకు సమాజంలోనే భోజన నివాస సదుపాయాలు కల్పించారు. వారికి తమ విధానంలో శిక్షణ ఇస్తూ ప్రైవేటుగా విద్యాబోధన చేయించాడు.  సోదరులలో తేజస్సు గుర్తించి అనీబిసెంట్ వారిని దత్తత తీసుకుని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ పంపింది.ఇంగ్లండ్ లో సమాజ సభ్యురాలు లేడీ ఎమిలీ కృస్ణ సోదరులను పోషణ బాధ్యతలు చేపట్టింది. అనతికాలంలో శ్రీకృష్ణుని ఆనాడు యశోద లాలించి, పోషించిన విధంగా ఆదరించింది.  వారిరువురినీ అక్కడివారు ప్రేమగా చూసేవారు. ఆ వయసు నుంచే వారికి కృష్ణ ధర్మబోధలు చేస్త్రుండేవాడు. కనిష్టుడైన నిత్య చదువులో చురుకుగా మెట్లు ఎక్కుతూ మెట్రిక్ ఉత్తీర్ణుడై పిదప న్యాయశాస్త్ర విద్యాభ్యాసం మొదలెట్టాడు. కృష్ణ మాత్రం ముమ్మారు మెట్రిక్ లో డింకీలు కొట్టాడు. ఆ సమయంలో అనీబిసెంత్ సలహామేరకు కృష్ణ పారిస్ వెళ్ళి ఫ్రెంచ్ అధ్యయనం చేశాడు. ఆ తరుణంలో నిత్యకు క్షయ వ్యాధి సోకింది.

లెడ్ బీటర్ ఆసమయంలో ఆస్ట్రేలియా లోని సిడ్నీ పట్నంలో ఉంటూ సమాజ వార్షికోత్సవాలకు అన్నదమ్ములను పిలిపించాడు.నిత్య చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలొని ఓహై లోయకు వెళ్ళారు. కృష్ణ ధ్యాన సాధనలోను, నిత్య చికిత్సలోను ఉండేవారు. 1932 కాలంలో కృష్ణకు నూతన అనుభూతులు  మొదలయ్యాయి. వెన్నెముక, తల, మెడలో తీవ్ర నొప్పి వచ్చేది. కలవరింపులతొపాటు బాధ భరించలేక సేవనిమిత్తం హాజరయ్యేవారిపై విరుచుకు పడేవాడు. అతనికి సహాయకారిగా అమెరికన్ యువతి రోజలిండ్ ఉండేది. ఆగస్ట్ 17న ఆవేదన ఎక్కువయింది. కృష్ణ ఎదురుగావున్న పెప్పర్ చెట్టుకింద కూర్చున్నాడు. అపస్మారక స్థితిలొ కొంతసేపు గడిపి తెలివి రాగానే వణకుతూ, సణుగుతూ లేని ఓపిక తెచ్చుకుని ఏవో శ్లోకాలు చదివాడు. బాహ్యంగా ఆవేదనలు, అంతర్గత అనుభూతులు ఆవహించాయి.అతడు లేచి నెమ్మదిగా అడులేస్తూ వస్తుంటే, ఎదురుగా గమనిస్తున్న రోజలిండ్ పెద్దగా "అడుగో బుధ్ధుడు, బుధ్ధుడు.." అంటూ అరిచి కుర్చీలో కూలబడింది. ఆరోజే కృష్ణమూర్తి పరివర్తనకు నాందీ ప్రస్తావన అయింది. అతని అంతశ్చేతనం వికసించింది. అలా పగలనక, రేయనక అనేక అనుభవాలతో పరిణామ ప్రక్రియ సాగింది.    ( మిగతా విశేషాలు  మరో రెండ్రోజులపాటు .. రెండు భాగాలుగా ...)

Sunday, 13 January 2013మరో ఆధ్యాత్మిక మహోన్నతుడు జిడ్డు కృష్ణమూర్తి:

మనకు లభించిన అరుదైన ఆధ్యాత్మిక మహా పురుషులలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఆయన మనిషిగా మహోన్నతి చెందిన వారు. ఒక కుసుమంలా వికసించారు. దైవం పేరుతోనో,అతీత శక్తుల ముసుగులోనో పెరిగి పేరు సంపాదించ లేదు.ఆయనొక విజ్ఞాన ఖని.మానవ జీవితానికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించారు.పరీక్షకు నిలిచిన అంశాన్నే స్వీకరించారు. జీవిత తత్వాన్ని లోతుగా పరిశీలించారు. తానూ చెప్పినది ఆలోచించి అవగాహన చేసుకోమన్నారు. జగత్తులో మానవ సంక్షేమకోసం తహ తహ లాడారు. బాల్యం నుంచే మహోన్నత భావ,గుణ, లక్షణ,లక్షితుడైన పరిపూర్ణ మానవతా మూర్తి జిడ్డు కృష్ణమూర్తి..నిశిత పరిశీలన,.సూక్ష్మ అవగాహనల సమ్మిళితమే ఆయన జీవితం. సంపూర్ణ స్వేచ్ఛ ఆయన వికాసానికి ఊపిరి.సమస్త మానసిక, భౌతిక నిబద్ధతకు లోను గాకున్దాఉన్దదమ్ ఆ స్వేచ్ఛకు జీవం.ఆయన మేధా సంపత్తి, విశాల హృదయం సమపాళ్ళలో వృద్ది చెందాయి.అందుకే సామాన్య వ్యక్తిగా జన్మించి అనన్య సామాన్య, విశ్వ మానవునిగా శిఖరాలను ఆరోహించారు.. ఆయన గురించి ఈ తరానికి తెలియాల్సింది ఎంతో ఉంది.


90 సంవత్సరాల 9 నెల లకు పైగా జీవించారు.1986 జనవరి 4 న మద్రాసులో "మరణము-ధ్యానము" అంశంపై ప్రసంగిస్తూ అది తన చివరి అభిభాషణమని చెప్పారు. అదే నెల 10 వ తేదీ కాలిఫోర్నియా వెళ్ళారు.లివర్  కాన్సర్ కు చికిత్సపొంది ఓహై పర్ణశాలలో విశ్రాంతి తీసుకున్నారు. ఫిబ్రవరి 16 వ తేదీ చైతన్య వృక్షమైన 'పెప్పర్ ట్రీ' కింద పద్మాశీనులై ధ్యానంలోకి జారుకున్నారు. అంతకు ముందు సన్న్హితుఅలను పిలచి "ఇది నా అంతిమ దర్శనం. నన్నొక దైవాంశ సంభూతినిగా చేయకండి.నాకెవరూ భక్తులు లేరు. నాకు స్మారక మందిరాలు, ఆలయాలు వద్దు. భౌతిక దేహాన్ని శుభ్ర పరచి అగ్నికి అర్పించండి. ప్రార్ధనలు, ఆరాధనలు, ప్రసంగాలు, ప్రజా దర్శనాలు వద్దు."  అని స్పష్టం చేశారు.అర్ధ రాత్రి గడచిన పిమ్మట నిశ్చల,నిరీహ, నిర్మల,నిరంజన,తురీయ స్థితి పొందారు.ఆయన పాంచ బౌతిక పార్ధివ దేహం విద్యుద్దహన సాధనకు ఆహుతి అయిపోయింది. ఆమహనీయుడు కనుమరుగైనా ప్రవచనాల ద్వారా లోకావగాహణలో వెలుగై నేటికీ విలసిల్లుతున్నారు.

అయన 91 సంవత్సరాల నవయువకుదు, నవయుగ వైతాళికుడు. తాను బోధకుడనో, గురువునో కాదన్నారు. పదిమందితోబాటు విషయ చర్చచేస్తూ స్వస్వరూప జ్ఞానంద్వారా సత్యాన్ని తెలుసుకోవాలన్నరు. తాను చెప్పిన అంశాలను సాధికారికంగా తీసుకుని వల్లెవేయడం తగదని, జాగ్రత్తగా పరిశీలించి ఎవరికివారు నిగ్గుతేల్చుకోవాలని ఒకటికి పది సార్లు చెప్పే వారాయన.. అందుకే ఆయన గురించి ... 

భారతీయులు కన్న బిడ్డ 
అంగ్లేయుల ముద్దుబిడ్డ 
అమెరికనుల గారాబుబిడ్డ 
ప్రపంచపు దొడ్డ బిడ్డ!

జీవన దర్శన స్ఫూర్తి
వసుధైక కుటుంబ దీప్తి 
తాత్విక యుగ చక్రవర్తి 
అతడే జిడ్డు కృష్ణ మూర్తి! 

అని ప్రస్తుతించారు..

Saturday, 12 January 2013

మన వేమన పద్యం విశ్వజనీన వేదం 


1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో ద్వితీయ ముద్రణ చేశారు. మనకు తెలిసిన శతక పద్యాలు చాలా తక్కువ. వేమన మొత్తం ఎన్ని పద్యాలు రాశాడన్నది ఇప్పటివరకు ఇతమిధ్థంగా లెక్కతేలలేదు. 1166 పద్యాలు మించి ఉన్నాయని ఒక వాదన. 1839 నాటి ప్రచురణ గ్రంధం దేశంలొ ఎక్కడా లభ్యంకాక పోవడంతొ, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతొ 1980లో పునర్ముద్రణకు పూనుకుని మూడు అశ్వాశాలుగా 417+467+279 మొత్తం 1163 పద్యాలతో ఒక సంకలనాన్ని తీసుకు వచ్చారు.
1980 జులై మాసంలొ ముద్రించిన పుస్తకం వెల కేవలం రెండున్నర రూపాయలు మాత్రమే. చెన్నారెడ్డి హయాం లోనే "యోగి వేమన తెలుగు విజ్ఞాన కేంద్రం" ఆధ్వర్యంలో ఆ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఆ పుస్తకానికి చెన్నారెడ్డి పంపిన సందేశంలొ, " వేమన వంటి కవి మనకు మరొకరు లేరు. తెలుగు కవుల్లో ఇంత పుష్కలంగా ప్రజాభిమానాన్ని పొందిన వారుకూడాలేరు. నేటి విశాల ప్రపంచానికి ఎరుక పరచేందుకు అర్హత కలిగిన కవికూడా మరొకరు లేరేమో. ఆ అర్హత సత్తా ఉన్నందునే తమిళం, కన్నడం వంటి పొరుగు భాషల్లోనే కాకుండా, ఇంగ్లీషు, లాటిన్, ఫ్రెంచ్ వంటి పాశ్చ్యాత్త్య భాషల్లోకి కూడా వేమన పద్యాలు పరివర్తన పొందాయి. పర్యాప్తమయ్యాయి. ఆయన పద్యం విశ్వజనీనమైన వేదంలా, వాదంలా ధ్వనిస్తుంది, భాసిస్తుంది".. అని పేర్కొనారు. అంతే కాదు.. ".. వేమన కవిత్వం ఎన్నొ విధాలుగా విలక్షణమైనది.భ్హావంలో, భాషలో, శైలిలో, శిల్పంలో, చిత్తవృత్తిలో, అన్నింటా... ఆయన పద్యాలు నిత్యం ప్రజల నాలుకలపై నర్తించే సామెతలైపోయాయి. స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారన్నట్లు ..అజంతా గుహల్లోని ఆంధ్రుల శిల్ప సంపద, ఎట్లో వేమన ఆటవెలదుల్లోని హృదయాకర్షక శక్తి, చైతన్య స్ఫూర్తి అట్లా ఉంటాయి." అని చెన్నారెడ్డి అభిప్రాయ పడ్డారు. పుస్తక ప్రచురణ సమయంలో దేవాదాయ శాఖ కమిషనర్ గా యం చంద్రమౌళి రెడ్డి వ్యవహరించేవారు.  అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా   పి వి ఆర్ కె ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ ఈ పుస్తక ప్రచురణకు ఎంతో తోడ్పాటు నిచ్చింది. 

శివకవులకు, నవ కవులకు
శివభక్తికి తత్వమునకు, చింతామణికిన్
శివలోక ప్రమథులకును,
శివునకు గురువునకు శరణు సేయు వేమా..

అని పునర్ముద్రణ ప్రథమ భాగం మొదలవుతుంది.సాధారణ శతకాలలొ మనకు కంపించని పద్యాలెన్నొ దీనిలొ ఉండడం గమనార్హం..

17వ శతాబ్దానికి చెందిన యోగి వేమన కు గౌరవ పురస్కారంగా భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపు ముద్రించింది.

Thursday, 3 January 2013


సూర్యతెలుగు దినపత్రిక సంపాదక సలహా దారు శ్రీ జి. శ్రీరామమూర్తి గారి అభ్యర్ధనకు  ఆ పత్రిక  (సూర్య”) సంపాదకీయ పుటలో   ప్రచురణకు  గత సంవత్సరం అక్టోబర్ 21 వతేదీ ఈ రాజకీయ రచనను పంపగా ఇంత సూటిగా, ముక్కు మీద గుద్దినట్లున్న రచనను తాము ప్రచురించలేమని, తమ యాజమాన్య అవసరం మేరకు తగినట్లుగా మార్పులు చేసుకుంటామని  సమాధానమొచ్చింది. అందుకు అంగీకరించక పోవడంతో ఇది ప్రచురణకు నోచుకోలేదు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా రోజుకొక విధానంఅవలంబించే పత్రికకు నేను భవిష్యత్తులో రాయబోననై నిష్కర్ష గా చెప్పాల్సి వచ్చింది.  ఒక వ్యక్తి పై రాజకీయ క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిస్సహాయతను ప్రతిబింబించే ఆ వ్యాసాన్ని  నా మిత్రుల కోసం ఈ బ్లాగులో ఉంచుతున్నాను.
____________________________________________________________________________________________________________________
కాంగ్రెస్ కళ్ళకు ఆరేళ్ళ గంతల ఫలితమీ గందరగోళం....
(నందిరాజు రాధాకృష్ణ )

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యకాలంలో తళుక్కున నక్షత్రమై వెలిగి స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులు పోసి  ప్రపంచంలోకెల్లా అక్షరాలా 128 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ నేడు పశ్చిమ సంద్రంలోకుంగుతున్న దశకు చేరుకుంది.  నాటి ఘన చరిత్ర ఈ రోజు ద్రవమై, క్రమేపీ ఆవిరై పోతున్నది. ఒకనాడు త్యాగధనులకు నెలవైన కాంగ్రెస్ ఇప్పుడు స్కాం స్వాముల నిలయమైపోయిందన్న అపకీర్తిని నెత్తికి ఎత్తుకున్నది. "ఆకాశంభున నుంచి శంభుని శిరంబు, అందుండి శీతాద్రి ....గంగా కూలంకష  వివేక భ్రష్ట సంపాతకుల్.." మాదిరి  పరువు ప్రతిష్ట పూర్తిగా కోల్పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎహురవేసిన ఆ పార్టీ నేడు మొత్తం  30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు గాను కేవలం 12 ప్రాంతాలకే అధికారానికి పరిమితమయింది. అందులోనూ పెద్ధరాష్ట్రాలు అంధ్రప్రదేశ్, డిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర  మాత్రమే. అందులోనూ మహారాష్ట్రలో నాలుగే. మిగిలినవి చిన్న రాష్ట్రాలు కావడం సంకీర్ణ ప్రభుత్వమే కావడం గమనార్హం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ చివరకు రాహుల్ గాంధీ లతో పార్టీ శకం ముగిసిపోయే ప్రమాదం ఏర్పడింది. పి  వి నరసింహారావు వంటి సమర్ధులు రాజకీయ చతురులకు సముచిత స్థానం, గౌరవం కల్పించక పక్కన పెట్టడంతో మొదలైన  పార్టీ క్రమేపి వందిమాగధ దళాలతో నిండిపోవడం మరొక కీలకాంశం. ఇప్పుడైతే చెప్పేపనే లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమర్ధుడైన జనామోదిత నాయకత్వం లేక పార్టీలో  భోగ భాగస్వాములకు తావు ఏర్పడడం తోడు, వ్యవస్థ, సంస్థ పక్కకు పోయి వ్యక్తి పూజ ఎక్కువ కావడం పార్టీకి చేటు కలిగిస్తున్నదన్న అందోళన  ఎక్కువయింది. జాతీయ స్థాయిలో శక్తిమంతమైన నాయకత్వం లేనందువల్ల ఆ ప్రభావం రాష్ట్రాలపై పడింది.  అందులో మన రాష్ట్రంలో ప్రధానంగా  కాంగ్రెస్ బక్కచిక్కి వ్యక్తి అధీనంలోకి చేరుకున్నది. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి ఉద్దండ ముఖ్యమంత్రులు కనుమరుగయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటి పాలనాదక్షులు మాయమయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి వంటి అనుభవజ్ఞులు అదృశ్యమయ్యారు.కాంగ్రెస్ పార్టీ పరంగా 1946నాటి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాధుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య వంటి ధీరోదాత్త అధ్యక్షులూ లేకుండాపోయారు.  స్వాతంత్ర్యానంతరం ఎన్ జి రంగా, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి వంటి దిగ్ధంతలు రాష్ట్ర పార్టీకి సారధ్యం వహించారు.1946 నుంచి నేటివరకు 37 మంది పిసిసి అధ్యక్షులు  పార్టీకి నాయకత్వం వహించారు. 1982 నుంచి పతనస్థాయిలో పయనమై 2004 నాటికి కోలుకున్నట్లు కనిపించినా నిజానికి భూస్తాపితమార్గంలోకి కాలు పెట్టింది. వై ఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగా నాయకునిగా ఎదిగి పార్టీని దిగాజార్చారన్న అభియోగాలున్నాయి. పార్టీ పూర్తిగా ఒక వ్యక్తి అధీనంలోకి వెళ్లిపోయింది. నిజానికి 1983 నుంచి కాంగ్రెస్ అధికారం కోల్పోయినా  పార్టీ అస్తిత్వం విలువ పెంచుకుంది. 2004, 2009 లో అధికారం నిలబెట్టుకున్నా అస్తిత్వం పోగొట్టుకున్నదన్నది నిజం. పార్టీ మటుమాయమై నాయకుని వ్యక్తిత్వం మిగిలింది. వై ఎస్ పార్టీ గెలుపునకు ఎంతముఖ్య పాత్ర పోషించారో పార్టీని బలహీనపరచడంలో అంతకంటే ఎక్కువ  పాత్ర నిర్వహించారు. వాస్తవాలు కటువుగా వుంటాయి, జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పతాకం నీడన, ఇందిర, రాజీవ్, సోనియా, చివరకు రాహుల్ స్మరణతో ఎదిగి 2009 నాటికి ఆ పార్టీని తన నీడకు తీసు కొచ్చుకున్నారు. పార్టీకి జీవం పోసిన కీర్తి, అధిక సంఖ్యలో ఎం పి లను గెలిపించిన ఘనత వలన కేంద్రంలో యు పి ఏ ప్రభుత్వ నిర్మాణం కావడంతో అధిష్టానం ఆయనను సర్వసత్తాధికారిగా పట్టం కట్టింది. దక్షిణాదిన ఆశ్రయం కల్పించినందుకు నాయకత్వం ఆయనను తలకెత్తుకున్నది. వచ్చిన అవకాశాన్ని చేజారనీయక స్థానం పదిలపరచుకున్నారు. సంక్షేమం, అభివృద్ది ముసుగువేసి రాష్ట్ర భవిష్యత్తు, ఆర్ధిక స్థితిగతులను ఆలోచించకుండా జనాకర్షణ కార్యక్రమాలు భుజానికి ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే  సుస్థిర స్థానం కోసం ప్రణాళికలు మొదలెట్టారు. నిత్య అసమ్మతి వాదిగా పేరొంది,  ప్రధానులను ముఖ్య మంత్రులను సైతం ఎదిరించిన వై ఎస్ ఆర్ అదను చూసి రాజకీయ శత్రువులను ఒక్కరినే బలహీన పరచారు. అన్ని జిల్లాల్లో తన అనుయాయులను ప్రోత్సహించి ప్రత్యర్ధులను దూరంగా పెట్టడంలో విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి మొత్తం 23 జిల్లాలను తన బృందంతో నింపుకున్నారు. గొర్లె హరిబాబు నాయుడు, పెనుమత్స సాంబశివరాజు, ద్రోణంరాజు, ముద్రగడ, హరిరామజోగయ్య, మాగంటి, మింటే, పిన్నమనేని, చనుమోలు, కాసు బ్రహ్మానందరెడ్డి బృందం, నేదురుమల్లి అనుయాయులు, ఆర్ చెంగారెడ్డి వర్గం, జే సి దివాకరరెడ్డి, మైసూరారెడ్డి, డి ఎల్ రవీంద్రారెడ్డి, శివరామకృష్ణయ్యలను ఏరివేశారు. అదే మాదిరి ఇతర సీనియర్లైన జి వెంకటస్వామి, ఉప్పునూతల, పరిగి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, సంతోష్ రెడ్డి, కోదండరెడ్డిపి  జనార్ధనరెడ్డి, మర్రి శశిధర రెడ్డిపి శివశంకర్మధుయాష్కి, వి హనుమంతరావు, కే కేశవరావు వంటి వారిని అడ్డు తొలగించుకున్నారు. మాజీలైన జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి అనుచరులను రంగంలో లేకుండా చేసుకున్నారు. అయిదారు పర్యాయాలు ఎన్నికవుతూ వచ్చిన అనుభవజ్ఞులను తప్పించారు. ఒక సమయంలో తనకు అండగా నిలిచిన ఎమ్మెస్సార్ ను కూడా గాలిలో పెట్టారు. కౌన్సిల్ పునరుద్ధరణ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తును రచించుకుని మద్దతుదారులకు రాజకీయ నిరుద్యోగ సమస్య తీర్చారు. నామినేటెడ్ పోస్టుల్లో తనవారిని నింపేశారు. మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, జిల్లాపరిషద్లు, ఆలయ కమిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలను ఇష్టానుసారం నింపేశారు. మంత్రివర్గంలో తనవారే. గల్లీనుంచి డిల్లీ వరకు తనదే పెత్తనం. రాయలసీమ కోస్తా, తెలంగాణలోనూ ఆయనదే ఆధిపత్యం సాగించుకున్నారు. ప్రత్యర్దులనే కాక, ప్రతిపక్షాలనూ నీరుకార్చారు. వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తెలుగు దేశం, ప్రజారాజ్యం లనూ నిలివునా చీల్చగాలిగారు. తెలంగాణలోని అధికార పక్షం సభ్యులలో కొందరిని ఆకట్టుకుని సెంటిమెంట్ బలహీనపరచారు. ఉభయ కమ్యూనిస్టులనూ ప్రలోభపరచారు. ప్రసార మాధ్యమాలను, అధికార గణాలను వశంచేసుకుని ప్రత్యర్ధులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. అధిష్టానం అవసరాలకూ  సాయంచేశారు. పార్టీ మార్పిడులను ప్రోత్సహించి కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన కీర్తి పొందారు. తన వ్యతిరేకులను సాగనంపి, అనుకూల గణాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నాటకీయంగా  కాంగ్రెస్ సీనియర్లను కకావికలం చేశారు. రెండుపర్యాయాలు పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ  సహచరుడు, ఫై సి సి  అధ్యక్షుడు డి శ్రీనివాసను ముఖ్య మంత్రి పదవికి తనకు పోటీ రాకుండా తప్పించగలిగారు. ఎమ్మెస్సార్ వంటి వారిని ఆర్టిసికి పరిమితం చేశారు. ప్రభుత్వంలో, పార్టీలో తన కోవర్టులను నింపుకున్నారు.సొంత వ్యక్తులను ప్రోత్సహించి సలహాదారులుగా నియమించి వారికి సాయపడి తనకు లబ్ది చేకూర్చుకోగాలిగారు. 2014 తరువాత తన  అనువంశిక పాలన సాగేలా  చేసి తన వ్యక్తిగత బలం పెంచుకున్నారు. పార్టీని ప్రభుత్వాన్ని చేతల్లోకి తీసుకుని తన ప్రతినిధులతో నింపేసి ఇతరులకు రిక్త హస్తాలుచూపారు. నామినేటెడ్ పోస్టుల కాలపరిమితి పూర్తయినా 2009 ఎన్నికల బూచిని చూపి నియామకాలు దాటవేశారు. పదవుల పందేరంలో  తనవారికి పట్టం కట్టి   మిగిలిన వారిని నిరాశకు గురిచేసారు. కడపజిల్లా రాజకీయాలను  పునాది చేసి జిల్లాలో పదవులను బంధుగణానికి పందేరం చేశారు. సన్నిహితులకు, కుటుంబానికి రాజకీయాలు వ్యాపారాల్లో  భాగస్వామ్యం కలిపించారు. గనులు,  స్థలాలు, భూములు, సెజ్ లు, కాంట్రాక్టులు, ఇళ్లు అన్నీ తనవారికి దక్కించుకున్నారు. రెండోసారి మంత్రివర్గంలో తన వ్యతిరేకులకు స్థానం  జాగ్రత్త పడ్డారు. ప్రస్తావించవలసి వచిందంటే తాను తప్ప నాయకుడు లేకుండా చేశారని వివరించడానికి మాత్రమే. ఆకస్మాత్తుగా అనూహ్యంగా వై ఎస్ ఆర్ మరణించడంతో రాష్ట్రం నాయకుడు లేని రాజ్యమయింది. మూడేళ్ళుగా అంతా గందరగోళం. వై ఎస్ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి సింహాసనం అధిష్టించడానికి అప్పటికే అన్ని పనులు పూర్తయినా కాలం కలసిరాకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. వై ఎస్ ఆర్ అనుయాయులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరుకు ఎంపి లు కాంగ్రెస్ తో కాపురం చేయడంలేదు. అధిష్టానినికి వ్యతిరేకం. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అశక్తులు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, జగన్ వైపు చూస్తుండడమే. జగన్ ఓదార్పు సాగించినా, కాంగ్రెస్ విడిచిపెట్టి సొంత దుకాణం పెట్టి కాంగ్రస్ ను దుయ్యబట్టి సోనియాను, కేంద్రాన్ని చెండాడినా, ఎమ్మెల్యే లను, ఎంపిలను చీల్చి రాజీనామాచేయించి  ఎన్నికలు తెచ్చి కాంగ్రెస్ ను ఘోరంగా ఓడించినా, అక్రమ ఆస్తుల ఆర్జన కేసుల్లో పలువురు మంత్రులు,   ఎస్ లు, జైలుకు వెళ్ళినా, జగన్ బయట ఉన్నాజైల్లో ఉన్నా అందరూ ఆయనవెంట ఉండడానికి కాంగ్రెస్ లో కోవర్తులే కారణం. కిరణ్ కుమార్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి చూడడానికి అధిష్టానానికి అడ్డంకి ఏమిటో అని డిల్లీ నాయకుల్లో చర్చ సాగుతున్నది. మంత్రి మండలి విస్తరణకు,పోస్టుల భర్తీకి, పిసిసి కొత్త కార్యవర్గానికి ముహూర్తం నిర్ణయం కాకపోవడంతో కార్యకర్తల్లో, నాయకులలో, ప్రజాప్రతినిధులలో అసహనం పెరుగుతున్నది. అగ్నికి ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ బెదరింపులు తోడయ్యాయి. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు , కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులుపార్టీలోవారికి  కీలక పదవులు  ఇవ్వాలని  బ్లాక్  మెయిలింగ్  మొదలయింది.  కాంగ్రెస్ పార్టీ వారికి పోస్టులు కట్టపెట్టకపోతే  జగన్ వైపు వెళతారని మరొక భయం. సి ఎంపిసిసి అధ్యక్షుల మధ్య సయోధ్య లేకపోవడం మరొక తలనెప్పి గా మారింది. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు మరొక పెద్ద పరీక్ష. కే సి ఆర్, కోదండరాం, బి జే పి తెలంగాణను తలకేత్తుకున్నాయి. తెలుగు దేశం కూడా ఇబ్బంది పెడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపి  మధ్య సయోధ్య సున్నా. పాలన పడకేసింది. యాత్ర జాతర సాగుతున్నది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపిలు, ముఖ్యమంత్రిపై ప్రత్యక్ష దండయాత్ర, ఆరోపణలకు దిగడం ఇంకో సమస్య.. తెలంగాణ తేల్చకపోతే అయోమయం. మంత్రులు ఎంపి లు డిల్లీలో, ముఖ్యమంత్రి జిల్లాల్లో. అధికారులు జైల్లో. సచివాలయంలో, అసెంబ్లీ ఆవరణలో, కాంగ్రెస్ కార్యాలయం లో, పరస్పర విమర్శనలు. ఆపేవారు, అడ్డుకునే వారు లేరు. క్రమశిక్షణ   కాగడా పెట్టి వెదకినా కనబడడం లేదు. కాంగ్రేస్  భవిష్యత్ అగమ్యగోచరం..పదవులకోసం ఎదురుచూపులే. కళ్ళు కాయలు కాస్తున్నాయి. పెదవులు తడి ఆరుతున్నాయి. అంతా  టెన్షన్. కాదంటే  గోడ దూకుడే. 2014 సంగతి దేవుడెరుగు. మిగిలి ఉన్న ఏడాదిన్నర ఎలా అన్నదే ప్రశ్న.