Monday 25 February 2013




మరో మెట్టుపైకి సోదరి భావరాజు పద్మిని..

సోదరి పద్మిని రచనా సామర్థ్యానికి మరో వారపత్రిక ప్రోత్సాహం లభించింది. తెలుగు సాహిత్యం పై పట్టు సాధించి అనెక చోట్ల గుర్తింపు పొందిన సోదరి అంతర్జాల వేదికపై ఏడాది కిందట "అచ్చంగా తెలుగు" బృందానికి శ్రీకారం చుట్టి తన రచనా పాటవం పెంచుకోవడంతోపాటు మరికొందరు ఔత్సాహిక రచయితలు, రచయిత్రులను ప్రోత్సహించింది. పండుగలకు రెండు పర్యాయాలు రచనల పోటీలు నిర్వహించి విజేతలకు సాహితీమూర్తులు, ప్రముఖ పత్రికా సంపాదకుల ద్వారా బహుమతి ప్రదానం చేయించింది. బ్లాగుల నిర్వహణ సహా, అనేక నెట్ పత్రికలకు వ్యంగ్య, హాస్య, సాహితీ అంశాలు సహా ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన రచనలు చేసి గుర్తింపు పొందింది. తరువాత నాలుగో ప్రపంచ తెలుగు మాహా సభలు, ప్రపంచ మాతృభాషా దినోత్సవాల సందర్భంగా తెలుగు సాహిత్య సంబంధ అంశాలపై ఆకాశవాణిలో ప్రసంగించింది. 


మరో మెట్టు ఎక్కి "క్షత్రియ ప్రభ"మాస పత్రికలో వేర్వేరు అంశాలపై రచనలు మొదలెట్టింది. గత 16 సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని నుంచి తెలంగాణా ప్రాంత సంపూర్ణ స్వతంత్ర వారపత్రికగా ప్రచురితమవుతున్న "ప్రజాతంత్ర"లో రచయిత్రిగా మరో అడుగు ముందుకేసింది. వారపత్రిక తాజా సంచికలో స్వీయ అనుభవాలను "అంతర్జాలపు మాయాజాలంలో రచయిత్రులు" శీర్షికన ఆవిష్కరించింది. తాజాగా మొదలైన "రాజకీయ మాయాజాలం" గ్రూపులో కూడా రాజకీయాలపై చురకలు అంటించడం మొదలెట్టి అక్కడ కూడా తన ప్రతిభ నిరూపించ్కుంటున్నది. 






ఇప్పటికే ఆమె అనేక ఆధ్యాత్మిక రచనలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసి గురువరేణ్యులు, పలువురు పెద్దల ప్రశంసలు అందుకుంది. మా ఆడపడుచు పద్మిని ఇలా ఒక్కొక్క సోపానం అధిష్ఠిస్తూ, భగవత్ కృప, గురువరేణ్యుని ఆశీస్సులతో, సాహితీ రచనల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని, ఒక మంచి గుర్తింపు పొందాలని మనసారా కోరుకుంటూ ఆమెకు అన్నీ విజయాలు కలగాలని అన్నయ్యగా ఆకాంక్షిస్తున్నా..

1 comment:

  1. ఇలా మిమ్మల్ని చూచే భాగ్యం, మీ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రతిభకు అభినందనలు.

    ReplyDelete