Saturday 17 August 2013

                                                    

                                                    విష్ణుసహస్రనామం:
                                                      (తృతీయ భాగం)




శ్లో)56:అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
తా: పుట్టుకలేనివాడు,అసుర సంహారి, త్రిలోక విజేత, పూజార్హుడు ఆయన. సత్యస్వరూపుదై, సమృద్ధుడై, ఆనంద స్వరూపుడై, భక్తులకు పరమానందము నిచ్చువాడు ఆయనే.
శ్లో)57:మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః|
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగకృతాన్తకృత్||
తా: వామనస్వరూపుడు, మస్త్యావతారమున గొప్ప శృంగముగలవాడు, వరాహవతారమున భూమికి పతి, జాగృత్, స్వప్న, సుషుప్తులను అవస్థలకు అధిపతి అయినవాడు, కపిలమహాముని స్వరూపుడై సాంఖ్య యోదము బోధించినవాడు ఆ పరమాత్ముడే. ఆత్మజ్ఞాని, దుష్కర్మలను నాశనముచేయువాడు,కృతజ్ఞుడై  భక్తులకు ఫలమునిచ్చువాడు ఆయనయే.
శ్లో)58:మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః||
తా: ఆది వరాహ స్వరూపుడు, స్వర్న భుజకీర్తులు, సుదర్శన చక్రము, కౌమోదకియను గదను ధరించినవాడు, గొప్ప సేనలు గలవాడు ఆయన. ఊహకందని లోతైన జ్ఞాన సక్తి సంపదలు గలిగి సులభముగ తెలియరాని తత్వముగలవాడు, ప్రార్ధనల ద్వారా మాత్రమే చేరగలిగిన వాడు ఆయన.  
శ్లో)59:వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః||
తా:సృష్టికరత, ప్రళయకాలమున తనలో సర్వమును లయమొనర్చుకొనువాడు, అజేయుడు, అచంచలుడు, మహావృక్షము వలె స్థిరుడై,తన కర్మలకు తానే సాధనముగ ఉండువాడు ఆయన. మనస్సంకల్ప సిద్ధిగలవాడు, కమలాక్షుడు, కృష్ణుడు, సూర్య స్వరూపుడు, వరుణుని పుత్రులైన వశిష్ఠ, అగస్త్యుల స్వరూపుడు ఆయనయే.
శ్లో)60:భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః|
ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః||
తా: షడ్విధ  ఐశ్వర్య సంపన్నుడై, సంహారకాలమున ఈ ఐశ్వర్యములను తిరిగి తనలో కలుపుకొనువాడు,భాస్కరుడు, తేజోమూర్తి ఆయన. ఆనందస్వరూపుడై, ఓర్పుగలవాడై, బలరాముని రూపమున నాగలిని, కృష్ణుని రూపమున వనమాలను ధరించి భక్తులకు పరమ గమ్యమై భాసిల్లువాడు ఆయనయే..
శ్లో)61:సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||
తా: రామావతారమున ధనస్సును, పరశురామావతారమున పరశువును ధరించి దుష్టులను చీల్చినవాడు,వామనావతారమున స్వర్గలోము నంటినవాడు, వ్యాసుని రూపమున జ్ఞానమును, వేదసారమును అందించినవాడు, సమస్త విద్యలకు అధిపతియై భక్తులకు జన్మరాహిత్యవిద్యను, సర్వ సంపదలను అనుగ్రహించువాడు ఆ పరమాత్మయే.
శ్లో)62:త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్|
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్||
తా: సామవేదస్వరూపుడై, మూడు సామవేద మంత్రములచే కీర్తింపబడెడివాఉ, సామవేదగానము చేయువాడు, సర్వ దుఃఖములకు సంసారమనెడి రోగమునకు వైద్యుడు, మందుతానై సమస్త జీవులకు శాంతిని ప్రసాదించువాడు, ఆయన. శాంత స్వరూపుడై, ఇంద్రియాతీతుడై, ంజోక్షసాధనకు సన్యాసాశ్రమమును నిర్దేశించినవాడు, మోక్షగాములకు పరమ గమ్యమైనవాడు ఆ పరంధాముడే.  
శ్లో63:)శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||
తా: ఆ మహానుభావుడు సృష్టికర్త, శుభలక్షణ సమన్వితుడు, ఆదిసేషునిపై శయనించి ఉన్నవాడు, భూమిని భరించుచు,భూమినుండి ఆనందమును పొందువాడు, గోవులను జగత్తును రక్షించువాడు. శాంతిని ప్రసాదించువాడు, ధర్మదృష్టికలిగి ధర్మమును ప్రేమించువాడు ఆయనయే.    
శ్లో)64:అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||
తా: ఆయన కాలచక్ర స్వరూపుదై వెనుకకు మరలని వాడు,బ్రహ్మకన్న ఉత్తముడు, సంసార బంధములు లేకుండ ప్రళయకాలమున సర్వమును సంక్షేపించి హరించువాడు. క్షేమమును, శుభమును కలుగజేయువాడు, శ్రీవత్సమను చ్హ్నము వక్షస్థలమున గలిగి, లక్ష్మీపతియై, లక్ష్మికి నివాస స్థానమై శొభిల్లువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)65:శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః|
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||
తా: ఆ మహాపురుషుడు లక్ష్మీదేవికి పతి, లక్ష్మిని ధరించినవాడు, లక్ష్మికి నివాసస్థానమై ఉండి లక్ష్మికి మాన్యుడైనవాడు. భక్తులకు సంపదలిచ్చువాడు. జనుల కర్మానుసారముగ సంపదను విభజించువాడు, ముల్లోకములకు ఆశ్రయమై ఉన్నవాడు.
శ్లో)66:స్వక్ష స్స్వంగ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః|
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః||
తా:శుభప్రదమైన అంగములు, శుభదృష్టి గలిగి, పరమానందస్వరూపుదై, శతవిధములుగ జీవులకు ఆనందము నిచ్చువాడు ఆయన. పరిపూర్ణజ్ఞానియై, సత్కీర్తి గలిగి, విజితాత్ముదై, సమస్త జీవాత్మలను విధేయులుగ ఉంచుకొన్నవాడు, సూర్యాది సమస్త జ్యోతిర్వర్గములకు అధిపతియు ఆయనయే.
శ్లో)67:ఉదీర్ణస్సరతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః|
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః||
తా:సర్వబంధములకు, కర్మలకు అతీతుడై, సర్వసాక్షియై, సమస్త విభూతులు గలిగి స్థిరుడై, తనపై మరెవ్వరూ అధిపతిలేకుండ తానే సర్వాధిపతియై నిలిచిన వాడు ఆయన. సమస్త ప్రపంచమునకు భూషణమై, శోకరహితుడై, భక్తుల దుఃఖమును పోగొట్టువాడు, సేతునిర్మాణమునకు పూర్వము  శ్రీరామునిరూపమున భూమిపై శయనించినవాడు ఆయనే.
శ్లో)68:అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః||
తా: సమస్త బ్రహ్మాండమును కుంభమువలె తనలో ఇముడ్చుకున్న వాడు, సూర్యాది జ్యోతిర్వర్గములకు కాంతి నొసగువాడు, పరిశుద్ధాత్ముడైన వాడు, పూజనీయుడు, భక్తులపాపములను నిర్మూలించువాడు ఆయన. తేజోరూపుడు, శతృవులు నిరోధించలేనివాడు, అమిత పరాక్రమవంతుడు, సంగ్రామమున ఎదురులేనివాడు ఆయనయే.
శ్లో)69:కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః||
తా:కాలనేమి, కేశియను రాక్షసులను సంహరించినవాడు, గొప్ప విక్రమము గలవాడు, శూరజనులందరికీ ప్రభువు, శూరసేన వంశమున పుట్టిన శ్రీకృష్ణుడు ఆయన. త్రిలోకములకు ప్రభువై, అంతర్యామియై, ప్రళయకాలమున సర్వమూ హరించువాడు, తన కాంతికిరణములచే సర్వమును తేజోవంతమొనర్చువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)70: కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః||
తా: మన్మధ స్వరూపుడై సృష్టిచేయువాడు, అన్ని కోరికలు సిద్ధించినవాడు, భక్తులకోర్కెలు తీర్చువాడు, సుందరరూపుడు ఆ పరమాత్మ. నిర్దేశించుటకు వీలుగాని తత్వము గలవాడై, సర్వవ్యాపియై, గొప్ప వేగము, అనంత జ్ఞానములతో శోభిల్లువాడు, ఆగమములను సృష్టించినవాడు అగ్నిదేవుని స్వరూపుడు ఆయన.
శ్లో)71:బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః||
తా:బ్రహ్మను, సర్వ జగత్తును సృష్టించినవాడు, బ్రహ్మ విదుడు, సత్య, జ్ఞాన స్వరూపుడు, వేదములను బోధించువాడు, బ్రహ్మకు మాన్యుడై బ్రహ్మజ్ఞులచే కోరబడువాడు ఆయనయే.
శ్లో)72:మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః||
తా: మూడడుగులతో విశ్వమంతయు ఆక్రమించినవాడు, సృష్టి, స్థితి, లయములను మహాకర్మలు చేయువాడు, మహా తేజోస్వరూపుడు, క్షీరసాగర మథనమప్పుడు  వాసుకి యను మహా సర్పరూపమున ఉన్నవాడు ఆ మహాపురుషుడే. మహా క్రతువైన అశ్వమేధము, మహా యజ్ఞమైన జపయజ్ఞము తానై ఉండి, గొప్ప యజ్ఞములు నిర్వర్తించుచు, హవిస్సులలో గొప్ప భాగమును స్వీకరించువాడు ఆయనయే.  
శ్లో)73:స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః||
తా: స్తోత్రము తానై, స్తోత్రమును ప్రేరేపించుచు, స్తోత్రములవలన ప్రసన్నమగువాడు, ఋషులచే, వేదములచే స్తుతింపబడువాడు ఆయనయే. రణప్రియుడు, కర్మబంధములనెడి ఋగ్మతలు లేనివాడు, పరిపూర్ణస్వరూపుడు, పుణ్యాత్ముడై, పుణ్యమునిచ్చువాడు, భక్తుల కోరికలు పూరించువాడు ఆయనయే.
శ్లో)74:మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః||
తా: మనోవేగము గలవాడు, పుణ్యతీర్ఠములను, బ్రహ్మాండమును సృష్టించినవాడు, సంపదలను, మోక్షము నిచ్చువాడు, వాసుదేవుడైన శ్రీకృష్ణుడు ఆయన. సర్వ ప్రాణులకు నివాస స్థానమై ఉండి, బంగారు వంటి చక్కని మనస్తత్వము గలిగినవాడు, బ్రహ్మమే హవిస్సుగా స్వీకరించువాడు ఆ పరంధాముడు.
శ్లో)75:సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః|
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః||
తా:ఏకైక సత్యమై ఉండి, సత్య సంపదలైన తపోజ్ఞానాదులు తానై, సద్బుద్ధిగలిగి, సత్పురుషులలో నివసించుచు, వారికి మోక్షస్థానమై ఉన్నవాడు ఆయన. గొప్ప శూరులతో గూడిన సైన్యము గలిగినవాడు, యాదవకుల తిలకుడై, యమునా తీరమున  విహరించిన శ్రీకృష్ణపరమాత్మ ఆయనే.
శ్లో)76:భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః|
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః||
తా: సర్వ భూతములకు, సర్వ ప్రాణుల అసువులకు నివాస స్థానమై ఉండి,ప్రపంచమును తన మాయతో కప్పినవాడు, అగ్నిస్వరూపుడు, పరాజయమునొందనివాడై దురాత్ముల దర్పము నణచువాడు, ఆ పరమాత్ముడు. నిరంతరము తృప్తుడై, సజ్జనులకు విశ్వాసము నిచ్చువాడు, ఆయనపై చిత్తము నిలుపుట అసాధ్యమైనవాడు.
శ్లో)77:విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః||
తా:విశ్వమే తనరూపముగ గలిగిన విరాట్ స్వరూపుడు, తేజో మూర్తి, విశ్వరూపమున అనేక ముఖములు గలవాడు, దుష్టశిక్షణ కొరకై దశావతారముల నెత్తినవాడు ఆయనయే. బహురూపి యైనను ఇంద్రియములకు గోచరము కానివాడు, నిరాకారుడు ఆయన.
శ్లో)78:ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః||
తా:ఏకైక సత్యస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సోమయజ్ఞ స్వరూపుడు, భక్తులకు వారు కోరిన రూపములలో దర్శనమిచ్చువాడు, మోక్షపదమై ఉన్నవాడు ఆ పరమాత్మ. సమస్తలోకములకు ప్రభువు, హితుడు, మాధవుడు, భక్తవత్సలుడు ఆయనయే.
శ్లో)79:సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||
తా:బంగారము వంటి శరీరము, తేజస్సు కలిగి,శుభలక్షణ సమన్వితుడై, చందనచర్చితమైన శరీరముతో శోభిల్లువాడు, తనతో సమానమైనవడు లేనివాడు ఆయన. ఆశలేనివాడు, నిర్గుణుడు, స్తిరత్వము గలవాడు, ప్రపంచమును నడుపువాడు, వీరులైన శత్రువులను వధించువాడునూ ఆయనయే.
శ్లో)80:అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||
తా: లోకమాన్యుడు, త్రిలోకములను ధరించి, పాలించువాడు, అనాత్మ వస్తువులందు ఆసక్తిలేనివాడు, భక్తులకు గౌరవమిచ్చువాడు ఆయన. గొప్ప మేథాశక్తి, అమోఘమైన ప్రజ్ఞ గలిగి భక్తుల మేధస్సులో నుత్పన్నమగువాడు, ధన్యుడు, ఆదిశేషస్వరూపుడు ఆ పరంధాముడు.


No comments:

Post a Comment