Wednesday, 21 August 2013

              విష్ణుసహస్రనామం నాలుగో(చివరి)భాగం: 

                                                         [సంపూర్ణం]

శ్లో)81:తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః|
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః||
తా:సమస్త తేజములను ధరించినవాడు,ఆదిత్యరూపమున వర్షించ్వాడు, ఆయుధధారులలో ఉత్తముడై దుష్టుల నణచ్వాడు, శ్రీకృష్ణుడు ఆయనయే! భక్తులొసగు పూజాద్రవ్యములను గ్రహించి వారి కోర్కెలను మన్నించువాడు, చతుర్వేద స్వరూపుడై మంత్రములను తన అధీనములో ఉంచుకున్నవాడు  ఆయనయే.
శ్లో)82:చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః|
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్||
తా:ఆ మహా పురుషుడు నాలుగు బాహువులు కలిగి నాలుగు రూపములుగా, నాలుగు వ్యూహములుగా, నాలుగు భాగములుగా ప్రవర్తిల్లువాడు, ఒక్కొక్క పాదముతో ఒక్కొక్క లోకమును కొలిచినవాడు. ఆయన నాలుగు వేదములను క్షుణ్ణముగ నెరిగిఉండి, నాలుగు ఆశ్రమములుగా దారి చూపుచూ, నాలుగు పురుషార్ధములను ఉద్భవింపజేసినవాడు.
శ్లో)83:సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా||
తా:ఆయన కాల్చక్ర స్వరూపుడగుటవలన వెనుకకు మరలని స్వభావము గలవాడు, అతిక్రమించుటకు వీలుగాని వాడ్ద్. అజేయుడై దురాత్ములను సంహరించువాడు, దుర్లభుడు, చేరుటకు సాధ్యము కాని వాడు,మనసున నిలుపుటకు అసాధ్యుడు  ఆయనయె.
శ్లో)84:శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః||
తా:శోభనమగు రూపముతో నొప్పుచూ, జనులలో భక్తిని గ్రోలువాడు, భక్తులతొ చక్కని బంధము గలవాడు, మాయచే సంసార బంధములను పెంచువాడు ఆయన. దేవేంద్రుని రూపమున హవిస్సుల నారగించువాడు, దశావతారములనెత్తి మహాకర్మల నాచరించినవాడు, ఇక సాధింపవలసిన కార్యములు లేనివాడు, ఆగమములను సృష్టించినవాడు ఆయనయే.
శ్లో)85:ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|
అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||
తా:సర్వ జీవులను ఉద్భవింప జేసి, ఆహారమునిచ్చి పోషించువాడు, తేజోస్వరూపుదై నిత్యమూ విజయము పొందువాడు, మత్స్యావతారమున శృంగము గలవాడు ఆ మహాపురుషుడు. రత్నమువలె శోభించు నాభితో, కృపారసము వెదజల్లు  కన్నులతో, దయాగుణముతో, విశ్వమును అతిశయింపజేయు సౌందర్యముతో అలరారువాడు ఆయనయే

శ్లో)86:సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః|
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః||
తా: సు"వర్న"మైన ఓంకారస్వరూపుడు, నిశ్చలుడు, వాగీశ్వరులైన బ్రహ్మాది దేవతలకు ఈశ్వరుడు, పంచభూతములను ధరించిన మహాస్వరూపుడు, మానస సరోవరరూపమున నుండువాడు ఆయన. అగాధమైన మాయగలవాడు, జ్ఞాన తపస్సులనెడి తరగని నిధులు గలవాడు ఆయనే.
శ్లో)87:కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనో నిలః|
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః||
తా:హిరాణ్యక్షుని వధించి భూమికి ఆనందమును గలుగజేసినవాడు, పరశురామావతారమున భూమిని దానమిచ్చినవాడు, మేఘరూపుడై వర్షించి మేలుచేయువాడు ఆ మహానుభావుడు. సర్వజ్ఞుడు, సర్వ ప్రదేశములు చూద గలిగినవాడు, వాయుస్వరూపుడు, అమృతమయమైన శరీరము గలిగి ఆనందామృతమును గ్రోలువాడు ఆయనయే.
శ్లో)88:సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః|
న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః||
తా:భక్తజన సులభుడై, భక్తుల కోరికలను సిద్ధింపజేయువాడు, ధర్మ రక్షణయను మంచి వ్రతము గలిగి అధర్మపరులగు అసురులను, శత్రువులను, తపింపజేసి జయించువాడు ఆయన. అట్లే కృష్ణావతారమున  దుష్టుదగు చాణూరుని సమ్హరించిన వాడు, మర్రిచెట్టు వలే తన మాయను విస్తరింపజేసినవాడు, ఉదుంబర వృక్ష స్వరూపుడు, అశ్వత్థ నారాయణుడు ఆయనయే.  
శ్లో)89:సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః|
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః||
తా:అనంత కిరణములతో ప్రకాశించుచు,  సప్త యను అశ్వము వాహనముగా గల సూర్య స్వరూపుడు, అగ్నిస్వరూపుడై అగ్నివలె పాపమంటనివాడు ఆయన. దుష్టులకు భయము గొల్పుచు, సజ్జనులభయమును పోగొట్టువాడు, పాపరహితుడు, ఊహకందని స్వభావము స్వరూపము గలవాదు ఆయనయే.
శ్లో)90:అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||
తా:అణువు వలె సూక్ష్మస్వరూపుడు, ప్రళయకాలమున సర్వమును కృశింపజేసి సూక్ష్మస్థితికి తెచ్చువాడు, అట్లే విశ్వమునాక్రమించిన విరాట్ పురుషుడు ఆయనయే. తానుతప్ప ఇతరులు భరింపరాని వాడైనందున తననుతానే భరించువాడు, అర్వగుణ స్వరూపుడైనను నిర్గుణుడు, సర్వోత్తముడు, మహాజ్ఞాన స్వరూపుడై  తేజోమయమైన ముఖము గలవాడు, సర్వ వంశములకు మూలపురుషుదై, వంశములను వర్ధిల్ల జేయువాడు  ఆ పరంధాముడే..

శ్లో)91:భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః|
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః||
తా: ఆదిసేషుని రూపమున భూభారమును వహించ్చు, సర్వజీవులను కాలక్రమేణ క్షీణింపజేసి, నసింపజేయువాడు,వాయురూపమున జీవులలో ప్రాణసక్తిని ప్రవహింపజేయువాడు ఆయన. విశ్వవృక్షమునకు వేదములనెడి చక్కని ఆకులు సృష్టించి, వేద శాస్త్రములచే, ఋషులచే చెప్పబడినవాడు ఆయనయే. యోగీశ్వరుడై యోగముచే త్ర్లియబడుచు సర్వకర్మలకు ఫలముల నిచ్చువాడు, భక్తులకు విశ్రాంతి, అజ్ఞానులకు దుఃఖము కలిగించువాడు ఆయనయే.
శ్లో)92:ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో  దమయితా దమః|
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః||
తా:ఆ మహాపురుషుడు ధనుర్ధారి,ధనుర్వేద్స్వరూపుడు,దండించువాడు, దందనీతి తానైనవాడు. ఆయన పరాజయము, మృత్యువు లేనివాడు.
సర్వకర్మలయందు గొప్ప ప్రజ్ఞాశాలియై సర్వ జగత్తుకు నియమములను విధించిన వాడు, నియంతవలె సర్వమును పరిధులు దాటనీయనివాడు ఆయనయే.
శ్లో)93:సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః|
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః||
తా: ఆయ్న మహా బలవంతుడు, సత్వగుణప్రధానుడు, సత్యధర్మములు తానై పురుషార్ధ సాధకులచే కోరబడువాడు.పూజార్హుడు,జనులు ప్రియమైనవి అర్పించుటకు యోగ్యతగలవాడు ఆయన. భక్తులకు ప్రియమును చేయువాడు, తనపై ప్రేమను వర్ధిల్ల జేయువాడునూ ఆయనయే.
శ్లో)94:విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః|
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః||
తా:సూర్యుని రూపమున ఆకాశమున సంచరించువాడు, సూర్యుదే నేత్రముగాగలిగి సర్వలోకములను వీక్షించువాడు, సర్వవిభుడై, జ్యోతిస్వరూపుడై, సద్భావ శీలుడై, వివిధ రూపములలో దర్శన మిచ్చువాడు ఆయన. ప్రాణికోతిని ఉద్భవింపజేయువాడు, యజ్ఞమునందు హవిస్సులను  స్వీకరించి సంపదలిచ్చువాడు ఆ పరమాత్ముదే.
శ్లో)95:అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః|
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః||
తా:అనంతుడు, యజ్ఞములందు ఆహుతులను భుజించువాడు, పాలకునిగా విశ్వమును రక్షించువాడు ఆ పరమాత్మ. ఆయన నిరాధారుడయ్యూ సర్వలోకములను ధరించుచు, అనెకపర్యాయములు ధర్మ రక్షణార్ధమై జన్మించినవాడు, హిరణ్యగర్భుని రూపమున సర్వులకు అగ్రజుడు. అద్భుతమైన గుణైశ్వర్య ప్రకృతిగలవాడు, విచార రహితుడు, భక్తులపట్ల క్షమాగుణము ప్రదర్శించువాదు ఆయనయే.

శ్లో)96:సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః|
స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః||
తా:సనాతనుడు, బ్రహ్మకన్న ప్రాచీనుడు, కపిలమహర్షి స్వరూపుడు, సూర్య రూపమున నీటిని గ్రహించి, వర్షించువాడు, పృఅళయకాలమున సర్వమును తన యందు లయమొనర్చుకొనువాడు ఆయన. భక్తులకు శుభమును చేకూర్చు మంగళస్వరూపుడు, పరమానంద స్వరూపుడు ఆ పరంధాముడే.
శ్లో)97:అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః|
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః||
తా:రౌద్రమునకు అతీతుడు, సాంఖ్యయోగాత్మకమగు కుందలములు, మనస్తత్వాత్మకమగు చక్రము ధరించిన వాడు ఆయన. గొప్ప విక్రమము, వర్ణనాతీతమగు ప్రవృత్తిగలిగి ఉల్లంఘించుటకు వీలుగాని శాసనములు చేసినవాడు, ఓంకార శబ్దముతో కూడి యుండినవాడు, చంద్రునివలే చల్లని వాడు, విశ్రాంతినిచ్చువాదు ఆ పరమాత్ముడే.
శ్లో)98:అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః|
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః||
తా: సర్వావయవ సౌందర్య వంతుడై, సర్వసమర్ధుడై, క్రూరత్వము లేక గొప్ప క్షమాగునము కలిగినవాడు ఆ పరమాత్మ. విద్వద్వరేణ్యుడు, నామస్మరణ శ్రవనమాత్రముననే శుభముల నొసగు వాడు, భక్తుల భయమును పోగొట్టి సత్ఫలములు ప్రసాదించువాడు ఆయనే.
శ్లో)99:ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః|
వీరహా రక్షణ స్సన్తో జీవనం పర్యవస్ధితః||
తా: సంసారమనెడి ఆపదనుండి భక్తులనుద్ధరించువాడు, స్మరణమాత్రము చేతనే పుణ్యమునిచ్చువాడు, పాపములను దుఃస్వప్న ఫలితములను నశింపజేయువాడు, శిష్టజన రక్షకుడు, సజ్జన స్వరూపుడు ఆయన. ప్రపంచమంతయు పరివేష్ఠించి యుండి ప్రాణులకు జీవనాధారమై, భక్తుల దుర్గతులను జ్ఞాన ప్రదానముచే పోగొట్టువాడు ఆయనయే.  
శ్లో)100:అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః||
తా: అనంత రూపములు, అనంత సంపద, నిఘూడమైన స్వభావము గలిగి అన్ని దిక్కులలో సంచరించుచు, దిక్పాలకులను అజ్ఞానువర్తులుగ చేయువాడు ఆయన. క్రోధమును జయించి, జనులకు కర్మానుసారముగ, ఫలముల నిచ్చుచు, భక్తుల సంసార భయమును పోగొట్టువాడు ఆయన.

శ్లో)101:అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః||
తా:తనకు ఆదిలేకున్నను సర్వజీవుల జన్మలకు మూల కారణమైన జీవులను ఉద్భవింపజేసినవాడు, భూమిని భరించుచు జగత్తునకు శోభనిచ్చువాడు,ఆయన.శోభాయమానమైన భుజకీర్తులు గలిగి గొప్పవీరుడై భయంకరమగు పరాక్రమముతో నొప్పుచూ దుష్టులకు భయమును కలిగించువాడు ఆయనయే.
శ్లో)102:ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః||
బ్ర్హ్మాది దేవతలకు ఆధారస్థానమై, తాను మాత్రము ఏ ఆధారము లేక యుండినవాడు,జీవులకు ప్రాణమిచ్చి కర్మలయందు ప్రేరేపించువాడు,ఓంకార స్వరూపుడు ఆ పరమాత్మ. తానే విశ్వమనెడి పుష్పముగా వికసించి, సదా జాగరూకతతో మెలగుచూ,సత్కర్మల నాచరించుచు,భక్తులకు ముక్తిమార్గము చూపువాడు ఆయన.
శ్లో)103:ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః|
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||
తా: తనకు తానే ప్రమాణమైన జ్ఞాన, సత్య స్వరూపుడై, జనన మరణములకతీతమైన ఆత్మ స్వరూపుడై, బ్రహ్మవిదుడై,"తత్" సబ్దముచే తెలియబడుమహాపురుషుడాయన. సర్వజీవులలో ఒకే ఆత్మగా వెలుగొందుచూ, జీవులకు ప్రాణమిచ్చి, ఆహారముద్వారా ప్రాణశక్తినిచ్చి పోషించువాడు ఆయనే.
శ్లో)104:భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః||
తా:భూ,భువర్, సువర్లోకములలో ఒకే మహావృక్షమువలె వ్యాపించి యున్నవాడు, లోకముల నుద్భవింప జేసినవాడు,పితామహుడైన బ్రహ్మకు తండ్రియైనవాడు,సంసార సాగరమును తరించుటకు సహాయము చేయువాడు ఆయనయే. యజ్ఞములకు పతియై,యజ్ఞ కర్మలను ప్రేరేపించుచు, యజమానిగ యజ్ఞములు చేయించుచు, యజ్ఞాంగములుగల యజ్ఞపురుషుడై, యజ్ఞ ఫలములనిచ్చువాడు ఆ పరంధాముడే.
శ్లో)105:యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|
యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ||
తా:యజ్ఞరక్షణ చేయువాడు, యజ్ఞములు చేయించువాడు,యజ్ఞమేతానై, యజ్ఞముద్వారా పొందబడుచు, యజ్ఞ హవిస్సులనారగించుచు, యజ్ఞాంతమున యజ్ఞఫలముల నిచ్చువాడు, జ్ఞ్నన యజ్ఞ స్వరూపుడు ఆపరమాత్మ. అన్నస్వరూపుడు,జీవునిరూపమున అన్నమును భుజించువాడు ఆయనయే.
శ్లో)106:ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః||
తా:సర్వ జగత్తును తానే జనింపజేయుచు, ధర్మసంస్థాపనకై తానే అవతరించుచు, శ్రీరాముని రూపమున భూమిని ప్పాలైంచినవాడు, వరాహరూపమున భూమిని త్రవ్వి హిరాణ్యాక్షుని వధించినవాదు ఆ మహనీయుడే. సామవేదమును బోధించిన వాడు, సృష్టికర్త, దేవకీసుతుడగు శ్రీకృష్ణుని రూపమున అవతరించినవాడు, స్మరణమాత్రముననే  పాపములను నశింపజేయువాడు ఆ పరమాత్మయే.
శ్లో)107:శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
తా:"పాంచజన్యమను శంఖమును, నందకమను ఖడ్గమును, సుదర్శన చక్రమును, శారంగ్‌మను ధనస్సును, కౌమోదకి యను గదను, సర్వవిధములగు ఆయుధములను ధరించినవాడు, రథ చక్రమ్నుకూద ఆయుధముగ చేతబట్టినవాడు, ఎట్టి పరిస్థితులలోను చలింపని స్వభావము గలవాడు అయిన శ్రీమన్నారాయణునికి ప్రణామము చేయుచున్నానను" అని  భీష్ముడు  పలికెను.

ఓం తత్సత్||

[భగవదనుగ్రహము, గురు కృప, పెద్దల ఆశీస్సులు, సోదరీ సోదరుల ప్రొత్సాహంతో తాత్పర్య సహితంగా విష్ణుసహస్రనామ యజ్ఞం నిరాటంకంగా నేటితో ముగిసింది. ఇంతకు ముందే విష్ణుసహస్రనామం పంచుకునే మహద్భాగ్యం కలిగినప్పటికి, భక్తులకు, మిత్రులకు, హితైషులకు మరొక పర్యాయం విష్ణుసహస్రనామం పరిచయం చేయవలసిందిగా అమెరికా సందర్శనలోఉన్న సర్వజ్ఞులు, పెద్దలు, సోదరులు శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తి గారి కోరిక మేరకు పునఃపఠనం చేయగలిగాను. శ్రావణమాసం  ముందు మొదలైన ఆ క్రతువు ముగిసింది. నాకు మరో పర్యాయం శ్రీమన్నారాయణుని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు శ్రీ వడ్డాది వారికి నమస్సుమాంజలులు.]

No comments:

Post a Comment