Tuesday 20 August 2013



రక్షాబంధన్ , జంధ్యాల పౌర్ణమి 

దైవిక శక్తులతో కూడిన తిథి శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధనాన్ని, జంధ్యాల పౌర్ణమి ఆచరించడం భారతీయ సాంప్రదాయం, హైందవ ఆచారం.

స్ర్తిలకు రక్షణగా పురుషులు ఉండాలనే పరమార్థం రాఖీ కట్టడంలో రాఖీపూర్ణిమ ప్రసిద్ధి ఇమిడి ఉంది. సోదర ప్రేమకు చిహ్నంగా రక్షాబంధనం ప్రాచుర్యం పొందింది. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో మధురమైన గుర్తు. వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఇది సృష్టిస్తుంది. దీనికి సంబంధించి మన పురాణాల్లో ప్రస్తావన ఉంది.

యేన బద్దో బలి రాజా దానవేంద్రో మహాబలః
తేనాత్వ మభి బద్నామి రక్షేమా చల మాచల

మహాబలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా? నీవు స్థిరత్వంలో ఉండగలవు-అని దీని అర్థం. తన సోదరుని క్షేమం కాంక్షించే ప్రతి సోదరి పవిత్ర రక్షను అతని మణికట్టుకు ముడి వేస్తుంది. ఈ రక్ష ఏ ఆపద సమయంలోనైనా తన సోదరుడిని రక్షించాలని ఆమె ఆకాంక్ష. సోదరి ప్రేమకు సంకేతంగా ఉండే ఈ సూత్రం సోదరుడికి తన అక్కా లేదా చెల్లెలి విషయంలో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సోదరి సుఖసౌభాగ్యాల కోసం అతను ఎలాంటి త్యాగాలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహం కల్గిస్తుంది.





                  

ఓ పళ్లెంలో రాఖీలు, కుంకుమ, అక్షతలు, కర్పూరం, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలను ఉంచుతారు. శ్రావణ పౌర్ణమి నాడు స్ర్తిలు ముందుగా కులదైవాన్ని ప్రార్థించి, ప్రసాదాన్ని నివేదిస్తారు. అనంతరం ఈ ప్రసాదాన్ని రాఖీలను ఉంచిన పళ్లెంలో ఉంచుతారు. అన్నదమ్ములకు తిలకం దిద్ది, పన్నీరు జల్లి, గంధం పూసి, వారు సురక్షితంగా ఉండాలని హారతి ఇచ్చి తూర్పు ముఖంగా కూర్చోబెడతారు. సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీని కడతారు. రాఖీ కట్టాక సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరిస్తారు. అక్కా చెలెళ్ళు అడిగిన బహుమతిని సోదరులు అందించి ఆనందాన్ని పొందుతారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతి నికేతన్‌లో రాఖీ మహోత్సవాలు నిర్వహించి ప్రపంచ శాంతిని నెలకొల్పాడు.       .                                                                      
పూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుంది. జన్మతః సోదరులు కాని వారందరినీ ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ‘రక్షాబంధన్’లో ఇమిడి ఉంది. శ్రావణ మాస పౌర్ణమి రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి దైవపూజ కావించుకుని సోదరుల నుదుట తిలకం దిద్ది, మంగళహారతిచ్ఛి  నోరు తీపి చేసి సప్తవర్ణాలను తలపించే రంగురంగుల దారాలతో రాఖీ కట్టి  వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అదే తమ్ముడైతే అక్క ఆశీర్వదిస్తుంది. ఈ రోజు బ్రాహ్మణులు పాత యజ్ఞోపవీతాలను విసర్జించి నూతన యజ్ఞోపవీతాలు ధరించి, వేదపఠనం చేస్తారు. అందువల్ల "జంధ్యాల పౌర్ణమీ" అని కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.                                    

 రక్షాబంధన్ వల్ల సోదరులకు అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సిరిసంపదలు రెట్టింపవుతాయి. శ్రావణ పౌర్ణమిరోజున కట్టే రక్షాబంధన సూత్రం వ్యక్తికి జీవితంలో విజయ సాఫల్యం కలిగిస్తుంది. దీనికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవదానవులకు పుష్కర కాలం పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయాడు. దీనినే ‘దేవాసుర సంగ్రామం’ అంటారు. ధర్మనాశనం జరిగింది. దేవగురువైన బృహస్పతి దగ్గరకు ఇంద్రుడు వెళ్లి సలహా అడిగాడు. శ్రావణపూర్ణిమ నాడు ‘రక్షాసూత్రం’ కట్టించుకోవాలని బృహస్పతి ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ విధంగానే ఇంద్రుడు పూర్ణిమ నాడు తన భార్య శచీదేవి చేత రక్షాసూత్రం కట్టించుకుని మరోసారి దానవులపై యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ యుద్ధంలో భూలోకంలోని రాజులు దేవతల పక్షాన పాల్గొన్నారు. రక్షా మంత్రం, రక్షాబంధనం మహిమ వారికి తెలియగానే ఆ అనుష్ఠానాన్ని భూమి మీదకు తెచ్చారు. ఆ విధంగా భూలోకంలో ప్రచారం వచ్చింది. ముఖ్యమైన మార్పు ఏమంటే- దేవలోకంలో శచీదేవి భర్తకు రక్షాబంధనం కట్టింది కానీ భూలోకంలో అక్కా చెలెళ్లు తమ సోదరులకు రక్షాబంధనాన్ని కట్టే ఆచారంగా పరిణమించింది.

మరో కథ:

మహాభారతంలో ఓ సందర్భంగా చేతికి గాయమైన కృష్ణుడికి రక్తం కారకుండా తన చీర చెంగు నుంచి ఒక ముక్కను తెంపి ద్రౌపది కడుతుంది. ఆ రుణం తీర్చుకోవడానికా అన్నట్లు కృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది మాన సంరక్షణ చేయడమే కాకుండా, ఎన్నో సందర్భాల్లో అన్నగా ఆమెకు మానసిక ధైర్యమిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పటినుంచే రక్షాబంధనం మొదలైందని పెద్దలు చెబుతారు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాండవులకు విజయం చేకూరాలని కోరుకుంటూ రక్షా కంకణాన్ని కట్టమని కుంతీదేవికి, ద్రౌపదికి సూచించాడు. ఆ సూచనల మేరకు కుంతీదేవి, ద్రౌపది పాండవులకు విజయం చేకూరాలని కోరుతూ శ్రీకృష్ణుడిని ప్రార్థించి రక్షా కంకణాలను పాండవులకు కట్టారు. ఆ రక్షా కంకణమే రక్షాబంధనంగా మారింది. అయితే, కాలప్రవాహంలో అక్కచెల్లెళ్లు సోదరులకు కంకణం కట్టటమే ఆనవాయితీగా మారింది.

యముడి సోదరియైన యమున అతడికి రాఖీ కడుతూ చిరంజీవిగా ఉండాలని అభిలషించేదట. సోదరి ప్రేమకు విచలితుడైన యముడు భూమండలంలో రక్షాబంధన్ పాటించేవారిని ముఖ్యంగా సోదరి చేత రాఖీ కట్టించుకున్న వారందరికీ సకల శుభాలు కలుగుతాయని ప్రకటించాడట. కృతయుగంలో వామనుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కగా, అతని మనవి మేరకు రాజ్యానికి రక్షగా అక్కడే ఉన్నాడట. లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని బ్రహ్మణ స్ర్తి రూపంలో పాతాళానికి వెళ్లి శ్రావణ పౌర్ణమి రోజునే బలికి రక్ష కట్టి, కానుకగా తన భర్తను తిరిగి అప్పగించమని కోరిందట. అందుకు సంతసించిన బలి విష్ణువును లక్ష్మీదేవికి ఇచ్చివేసిన రోజు పూర్ణిమ రోజేనట. ఆనాటి నుంచి స్ర్తిలు ఎవరికైతే రక్షాబంధనం కడతారో వారు పదికాలాలపాటు చల్లగా వర్థిల్లుతారని, రక్షాబంధనం చేసిన స్ర్తిలకు కోరుకున్న బహుమతులు ఇచ్చే ఆచారం వెలుగు చూసిందట.

ఇక మన చరిత్ర ప్రస్తావించుకుంటే, ఉదయ్‌పూర్ రాణి కర్ణావతి భర్త రాణా మరణించగా గుజరాత్ పాలకుడు బహదుర్ షాతో ఉపద్రవం ఏర్పడింది. హుమాయున్ చక్రవర్తికి ఆమె రాఖీ పంపి రక్షణ కోరగా అతడు బహదుర్‌షాను తరిమివేసినట్టు కథనం. హిందూ ధర్మ స్వరాజ్య ప్రతిష్టాత్మకుడైన ఛత్రపతి శివాజీ భవానీదేవి కృపాలబ్దియైన ఖడ్గాన్ని, రక్షాకంకణాన్ని ధరించాడు. గ్రీకువీరుడు అలెగ్జాండర్ భారత్‌పై దండెత్తినపుడు, పురుషోత్తముడు అనే రాజు చేతిలో తన భర్త ఓడిపోతాడని తెలుసుకున్న అలెగ్జాండరు భార్య రుక్సానా బేగం పురుషోత్తమునికి రాఖీ కట్టింది. ఆమెను తన సోదరిగా భావించి, ఆ భావనను యుద్ధరంగంలో జ్ఞప్తికి ఉంచుకుని అలెగ్జాండరును పురుషోత్తముడు విడిచి పెట్టాడని ప్రతీక.

No comments:

Post a Comment