Thursday, 15 August 2013


"క్షత్రియప్రభ" ఆగస్ట్ సంచికలో నా వ్యాసం.
---------------------------------------- 


               సమస్త శుభకరం-శ్రావణ మాసంశ్రావణ మాసం అని ఎందుకు పేరు ? అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 'శ్రావయతి శ్రుణోతి ఇతి శ్రీ' మన మొరలను వింటుంది, ఆపై భగవంతుడిని వినేట్టు చేస్తుంది కనుక ఆమె పేరు శ్రీ. మనం ఆశ్రయించాలని అనుకుంటే ఆశ్రయించేట్టు చేసేది కనుక ఆమె శ్రీ. మనల్ని కాపాడాలని స్వామిని ఆశ్రయించేది కనుక ఆమె శ్రీ. 'శ్రీ' తో కూడుకున్నాడు కనుక ఆయన తప్పనిసరి రక్షణ చేసి తీరుతాడు కనుక ఆయన పేరు శ్రీపతి లేక శ్రీమన్నారాయణ. శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి. 

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. 
ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు . మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే . నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. వరాలిచ్చే తల్లి ... వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు. 

లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. లోభం, మోహం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమి లేని చల్లని చల్లని తల్లి ఆమె. సర్వ సస్యాలు ఆమె రూపాలే. వైకుంఠంలో మహాలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, రాజ్యంలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి. అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రద మాసమైన శ్రావణమాసం వచ్చేస్తోంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. 
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. మహిళలకు అత్యంత ముఖ్యమైన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. వీలుకాని వారు, శ్రావణ మాసంలోని ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు.
అనురాగ బంధాల ప్రతీక... రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది. పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అని అంటారు. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు.

No comments:

Post a Comment