Tuesday, 19 March 2013


                               చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!


                             గతమెంతో ఘనకీర్తి కలవోడా!!
వేములపల్లి శ్రీకృష్ణ ఎవరో తెలుసా..? వామపక్ష రాజకీయ వాసనలున్న కొందరికైతే ఆయన కమ్యూనిస్టు గా తెలుసు. మరికొందరికి ప్రజాప్రతినిధిగా ఎరుక. బాపట్ల, మంగళగిరి నియోజక వర్గాలనుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బహుకొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలంధ్ర ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రికా పాఠకులకు తెలిసుండచ్చు. ఆయన గొప్ప కవి అని చాలామందికి తెలీక పోవచ్చు. 

అందులోనూ ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గలం వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగుజిలుగులను వేనోళ్ళ కొనియాడారు. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంలో ఈ పాకు ఎంతో విలువ ఉంది. 50 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ గేయం గుర్తుండకపోవచ్చు. గతంలో వినిపించిన దేశభక్తిపూరిత గేయాలలో ఇది ప్రముఖంగా ఉండేది. శ్రీకృష్ణ  ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి; తలపండి, చేయితిరిగిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు.  

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!! అనే  ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రొజుల్లో. ఆ దేదీప్య  దివ్య గీతిక ఇప్పుడు రాష్ట్రంలో  కంచుకాగడా పెట్టివెతికినా ఎక్కడా కాగితాల్లో (పాఠ్యపుస్తకాల్లో) కలాల్లో, గళాల్లో కనిపించదు, వినిపించదు. ఒక్క సారి ఆ గీతాన్ని మననం చేసుకుందామా!! 

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!

సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి|| 

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల 
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే 
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్తరా తెలుగోడా! 
నావ దరిచేర్చరా మొనగాడా!!

!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

No comments:

Post a Comment