Thursday 18 April 2013

  

భద్రాద్రివాసా! భక్త జనప్రియా!! 

సీతారాముల కల్యాణం చూతము రారండీ... 

అదిగో భద్రాద్రి, ఇదిగో గౌతమి చూడండీ.. అని గానం చేస్తూ పవిత్ర యాత్ర స్థలం భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా ఉవ్వెత్తున లేచే కడలి తరంగాల్లా కదలివస్తున్నారు.  తెల్లవారితే అభిజిత్ లగ్నాన సీతమ్మ, రామయ్యల పెళ్ళి వేడుకను కనులారా చూసి తరించేందుకు చీమల పుట్టలమాదిరి కదలి వస్తున్నారు. మండుటెండలను , వసతి సదుపాయాలను కూడా ఆలోచించకుండా   పల్లెలు, పట్టణలు తేడా లేకుండా  పిల్లాపాపలతో బస్సుల్లో, రైళ్ళ్లలో, ఇతర వాహనాల్లో రాష్ట్రం నలుమూలల నుంచే కాక రాష్ట్రేతర ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు.. పురాణ ఇతిహాసాల్లో  సీతారామకల్యాణం అత్యంత ప్రాశస్త్యం పొందింది.    గోదా కల్యాణం, రుక్మిణీ కల్య్యాణం, పార్వతీ కల్యాణం, శ్రీనివాస కల్యాణం.. ఇలా అనేక కల్యాణాలు ఉన్నా.. సీతా రామకల్యాణానికి ఉన్న ప్రత్యేకత వేరు. శ్రీ రామచంద్రుని జన్మదినానే కల్యాణం, పట్టాభిషేకం జరగడం  అన్నిటికీ మించిన విశేషం.

చైత్ర శుద్ధ నవమినాడు సీతారాముల కల్యాణం కమనీయంగా, అత్యంత రమణీయంగా, అంగరంగ వైభవంగా లక్షలాది భక్తుల సమక్షంలో జరుగుతుంది.   అసలు ఆయన అయోధ్యరాముడే. అయినా కల్యాణానికి భద్రాచలానికి అవినాభావ సంబంధం ఉంది. పవిత్ర గోదావరి తీరాన ఖమ్మం-తూర్పు గోదావరి  జిల్లాలను అనుసంధానం చేసే  అహ్లాద ప్రకృతి సౌందర్యం భద్రాద్రిది. కర్మభూమి అయిన భారతావనిలో నిత్య, దీప ధూప నైవేద్యాది పూజా కార్యకలాపాలతొ  భక్తజనకోటిని విశేషంగా ఆకర్షిస్తున్న 25 రామావతార పుణ్యక్షేత్రాలలో పావన గోదావరి జలాలతొ పునీతమైన భద్రగిరిది ప్రత్యేకత. ఇది ఖమ్మం  జిల్లాకు తూర్పున గోదావరి ఒడ్డున దండకారణ్యంలో నెలకొని ఉంది. పడమటి కనుమలలో పుట్టి, పవిత్ర గోదావరి భద్రాద్రి వరకూ  తూర్పుగా ప్రవహించి, అక్కడినుంచి దక్షిణ వాహినిగా ఉష్ణగుండములవరకూ సాగి పాపికొండల మధ్యగా తూర్పుదిశగా పరవళ్ళు తొక్కుతూ  బంగాళాఖాతం లో కలుస్తుంది. వియద్గంగ నుంచి నుంచి గౌతమి మహర్షి ఈ నదిని ఈ పుణ్యస్థలికి గొనితేవడం వలన ఇక్కడ గోదావరిని గౌతమిగా వ్యవహరిస్తారు.

బ్రహ్మాండపురాణంలో  భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యం వివరిస్తూ; పితృవాక్య పాలన నిమిత్తం రాముడు వనవాస సమయంలో దండకారణ్యంలో  ప్రవేశించి పర్ణశాలనొకటి నిర్మించుకుని వసిస్తూ ఒకనాడు వనమంతా పర్యటించి అలసి, సీతా లక్ష్మణ సహితుడై ఒక శిలాఫలకంపై సేద తీర్చుకునేందుకు ఉపక్రమిస్తాడు. రామ పాదస్పర్శతో  పర్వతుడు అసలు రూపం దాల్చి వారికి మ్రొక్కి సకల పూజాలు నిర్వహిస్తాడు. స్వామి  పర్వతుని  భక్తికి మెచ్చి రామావతార పరిసమాప్తి అనంతరం వైకుంఠమునకేగి తిరిగి చేతనోద్ధరణ నిమిత్తం భూలోకానికి వస్తానని, అప్పుడు అక్కడే స్థిర నివాసమేర్పరచుకుంటానని వరమిస్తాడు. మేరువు కుమారుడుగా భద్రనామంతో జన్మించే పర్వతునిపై తాను వసిస్తానని, పంచభూతములు ఉన్నంతవరకు భద్రుడు తనను సేవించి కల్పాంతమున దివ్యలోక ప్రాప్తి పొందుతాడని కరుణిస్తాడు. శ్రీరామచంద్రుని  వ్యాఖ్యానుసారం మేరు పర్వతుడు, మేరుదేవి దంపతులకు బ్రహ్మ ప్రత్యక్షమై పుత్ర సంతానం అనుగ్రహిస్తాడు. పెరిగి పెద్దయిన భద్రుడు శ్రీరామదర్శనార్ధం గొప్ప తపస్సు ఆచరిస్తాడు.  భద్రుని తపోదీక్షకు ముల్లోకాలు తల్లడిల్లగా  దేవతలు వైకుంఠవాసుని శరణుకోరతారు. శ్రీమహావిష్ణువు నిజసపరివార సమేతంగా సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాంచంద్ర రూప ధారియై శంఖ చక్ర ధనుర్బాణాలతో ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యానికి భద్రుడు ముగ్ధుడై పలు విధాల స్వామిని కీర్తించి  తన శిరస్సుపై సీతాలక్ష్మణ సమేతంగా శాశ్వతంగా  ఉండిపోవాలని ప్రార్ధిస్తాడు.

భద్రునికిచ్చిన మాట మేరకు స్వామి అక్కడే స్థిరపడిపోతాడు. రామావతారంలో పునరావిర్భవించిన విష్ణువు వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి రాముడని, భద్రగిరి నారాయణుడని ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముని వామ అంకమున ఉపవిష్ఠురాలైనందువల్ల లక్ష్మీదేవి ప్రత్యేకంగా నిజ స్వరూపంలో చతుర్భుజ కనకవల్లీ తాయారు పేరిట స్వామి సన్నిధి చేరుకుంది. విరజానది గౌతమి గర్భమున కలసి అంతర్వాహినిగా ఉండడం వలన  ఈ క్షేత్రమునకు కలియుగ వైకుంఠమనే పేరు సార్థకమైంది. అప్పటినుంచి స్వామిని మహర్షులు, దేవతలు అదృశ్యరూపములో నిత్యం నిశాసమయంలో పర్వదినాల్లో వచ్చి భక్తిప్రపత్తులతో కొలుస్తారని ప్రతీక.  గౌతమి ప్రభావం వలన, సీతారామ వ్రత విధానం వలన, స్వామికి కల్యాణం చేసే క్రమం వలన కలిగే ఫలితాలు అనంతమని, అన్ని దానములకంటే అన్నదానము మహిమ అత్యంత ఫలప్రదమని, పంచ మహాపాతకులుకూడ పాపములనుండి విముక్తులై శ్రీరామ సాన్నిధ్యం చేరుకుంటారని ప్రతీతి. సూతమహర్షి ఈ క్షేత్ర మహిమను శౌనకాదులకు ఇలా ఉపదేశించారు.

శృణ శౌనక భూయోపి భక్తకల్పవరోహరేః!
మహత్యం రామ భద్రస్య శిఖర స్థితే!!

దమ్మక్కకు దర్శనం..

శ్రీరామ భక్తురాలగు భద్రిరెడ్డిపాలెం వస్తవ్యురాలు పోకల దమ్మక్కకు శ్రీరామచంద్రుడు ఒక రాత్రి స్వప్నమున దర్శనమిచ్చి భద్రగిరిపై నివాసమేర్పరచుకున్న తనను మానవ మాత్రులు గుర్తించలేక పోవడంతో తనను సేవించి తరించలేక పోతున్నారని తెలపగా..మర్నాడు దమ్మక్క స్వప్న వృత్తాంతమును గ్రామస్తులకు తెలిపి స్వామికోసం వెదకులాట ప్రారంభంచగా దట్టంగా ఉన్న ఆకులు. తీగల మధ్య విగ్రహాలు సాక్షాత్కరించాయి.  గోదావరి పుణ్య జలాలతో స్వామి విగ్రహాలకు అభిషేకం చేయించి పందిరి నిర్మించి అనుదినం మహతాళ ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తుండేది. గ్రామాధికారి భద్రిరెడ్డి చొరవతీసుకుని మంటపం నిర్మించి ఏటా సీతారామకల్యాణం  జరిపించేవాడు.

ఆతరువాత భక్తరామదాసు ఉదంతం యావత్తు జగమెరిగినదే.. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణం అవుతుంది. కంచర్ల గోపన్నను కారాగార విముక్తుని చేసిన తానీషా ప్రభువు తన పొరబాటు గ్రహించి రాముని భక్తుడగుటచే గోపన్నను రామదాసుగా కీర్తించాడు. భద్రాద్రి, పాల్వంచ తాలూకాల ఆదాయాన్ని స్వామి కైంకర్యానికి సమర్పిస్తున్నట్లు తానీషా ప్రకటించాడు.  అంతేగాక ప్రతి ఏటా జరిపే సీతారామ కల్యాణానికి  మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు వంశ పారంపర్యంగా పంపే విధంగా  కట్టడి చేసాడు.  నేటికీ సీతారాముల కల్యాణంలో  ఆనాడు రామదాసు చేయించిన  మంగళసూత్రాలు, చింతాకు పతకం, పచ్చలపతకం, రత్నకిరీటం, వజ్రాలపోగులు, కలికి తురాయి, వజ్రాలవైరముడి.. మొదలైన దివ్య ఆభరణాలు అలంకరిస్తారు. వీటన్నింటినీ భక్తుల దర్శనార్ధం చిత్రకూట ప్రదర్శనలో భద్రపరచారు. రామదాసు కాలంలోనే కాశీ నుంచి శ్రీ విశ్వనాథ లింగాన్ని తెప్పించి ఆలయం దక్షిణభాగాన క్షేత్రపాలకునిగా  ప్రతిష్ఠించారు.

భద్రాద్రికి ఉత్తర దిశగా సుమారు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న పర్ణశాలలో ఆనాదు సీతారాములు నివసించారని, అక్కడినుంచే రావనుడు సీతాపహరణం చేశాడని  పురాణాలు వల్లిస్తున్నాయి. భద్రాద్రికి ఆగ్నేయంగా మూడు మైళ్ళ దూరంలో గోదావరి గర్భంలోని అగ్నిగుండంలో ఆదిశేషుడు హోమం చేసినట్లు పేర్కొంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఉష్ణగుండంగా వ్యవహరిస్తారు. ఈ గుండంలోని మధ్య ప్రాంతంలో నీరు ఉడుకెత్తుతూ, అంచులవెంట అతి చల్లగా ఉంటుంది. ఈ జల ఊత నిరంతరం. సమీపంలోని జటాయు పర్వతం, లక్ష్మణగుట్ట, శ్రీరామగిరి  తదితర ప్రాంతాలు పవిత్ర  దర్శనీయ క్షేత్రాలయ్యాయి. భద్రాద్రి కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుని  నిత్యం కళకళ లాడుతున్నది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు  భద్రాచలం కేంద్రం. అతవీ ఉత్పత్తుల విక్రయ స్థానాలు ఏర్పడ్డాయి. తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి  ప్రభుత్వాలు షెడ్యూల్డ్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి  సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. భద్రాద్రి ఆలయం, పరిసర ప్రాంతాలు శరవేగంతో కొత్తరూపం సంతరించుకుంటున్నాయి. ఉపాధికల్పనకు అనేక వనరులను వినియోగంలోకి తెస్తున్నారు. భద్రగిరి శ్రీరామచంద్రుని వేనోళ్ళ కీర్తిస్తూ కవులు అనేక కృతులు చేశారు. ఆలయ కర్తృత్వంలో  కాలానుగుణ్యంగా అనేక మార్పులు సంభవించాయి. 1883లో తూము నరసింహదాసు అనౌ మహా భక్తుడు నిజాం ప్రభుత్వానికి పరిస్థితి వివరించి దేవస్థానం పునరుద్ధరణకు పూనుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం ఆల్యం దేవాదాయ శాఖ అధీనమైంది. 1964లో అద్భుత శిల్ప సంపద ఉట్టిపడే కల్యాణ మంటపాన్ని నిర్మించారు. ప్రతి శ్రీరామనవమిన రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంతి స్వామికి స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తెస్తారు. శుక్రవారం కల్యాణానికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు, మంత్రివర్గ సభ్యులు  పలువురు ప్రముఖులు ఆయన వెంట వస్తున్నారు. శనివారం జరిపే పట్టాభిషేక శుభఘడియలకు రాష్ట్ర గవర్నరు నరసింహన్ సతీ సమేతంగా వస్తున్నారు.

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే!
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం!!

No comments:

Post a Comment