Friday, 12 April 2013


అమ్ముడుబోతున్న పంచాంగ ప్రకండులు


చెక్క భజన చేసే విశ్లేషకులు


అమ్ముడుబోతున్న పంచాంగ ప్రకండులు, విలేఖరులగురించే నేను ఎప్పుడూ చెప్పేది. పండితులనండి, జ్యోతిషులనండి, సిద్ధాంతులనండి.. వారు ఉగాది ఒక్కరోజే సంభావనల కోసం కక్కుర్తిపడి ఘనంగా తాంబూలం ఇచ్చిన వారికి కీర్తనలు పాడతారు . కానీ వారినిమించి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళా పాళా లేకుండా 24 గంటలూ చెక్క భజన చేసే జాతి మా విలే"ఖరులు"అనబడే విశ్లేషకులది.

[చీరాల కళాశల తెలుగు అధ్యాపకులు, తెలుగు అకాడెమి ఉపాధ్యక్షులు, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు, ఈనాడు పాత్రికేయ బోధనాలయ ప్రధాన అధ్యాపకుడు (ప్రిన్సిపాల్) (దివంగత)డా:బూదరాజు రాధాకృష్ణ, 1978లో మా శిక్షణా తరగతుల్లో బోధిస్తూ-- "ఇప్పటివారికి అక్షరం ముక్క రాయడం రాదు. వీళ్ళు లే"కరులు" కాదు. ఓండ్రపెట్టి అరవడమే పని, అందుకే లే"ఖరులు"..--అని వాత పెట్టేవారు. పత్రికల్లొ "ఖరులు" వుండకూడదని, అందుకే విలేకరి అని రాయించేవారు] 

నిన్నటికి నిన్న చూడండి (మూడేళ్ళ క్రితం, మళ్ళీ మొన్న నేను రాశా -- "పంచాంగ ప్రకండులు" ) పార్టీ కార్యాలయాల్లో సిద్ధాంతులు క్యూలుకట్టి నాయకులను తెగపొగిడేసారు. నమస్తే తెలంగణా పత్రిక నిన్నటిరోజు ఉగాది పంచాంగం వార్తకు ఇవాల్టి సంచికలో "ఏ పార్టీ దగ్గర ఆ పాట"; ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికలు ఒకే శీర్షిక "ఎవరి పంచాంగం వారిదే" అని ప్రచురించాయి. 

అలాంటిదే.. టీవీ ప్రేక్షకులకు దైనందిన ఉచిత వినోదం,(విషాదం) వేడుక ఉదయం అన్ని చానళ్లలో నాటి పత్రికల వార్తలపై విశ్లేషణ అనే కార్యక్రమం. సాక్షి, టీవీ9, టిన్యూస్, హెచ్ఎం టీవి, మహా టీవి, వి6, ఎన్‌టీవి లాంటి ప్రధాన బుల్లిపెట్టెలు చూడండి. శ్రీకృష్ణ పరమాత్ములవలె ఎక్కడ పట్టినా వారే దర్శనమిస్తారు. రొటేషన్ విధానంలో చానళ్ళు పంచుకుంటారు. రోజుకొకరు, ఒక చానల్ లో ప్రత్యక్షం. అపార విషయ పరిజ్ఞానమున్న వారేమీకాదు. వేర్వేరు దినపత్రికల్లో "విలేఖరులు" గా పనిచెస్తున్న వారే. వారి పత్రికల్లో వారు రాసిన వార్త ఒక్కటీ ఎప్పుడూ వాస్తవరూపం దాల్చలేదు. ఊహాగానల పేరిట ఎవరిష్టం ఒచ్చినట్లు వారు రాయడమే. అవి కథలు, కథనాలు. వారిని ప్రశ్నించే యాజమాన్యాలు లేవు. 

ఒక విధానం (పాలసీ) ఉన్న పత్రికకు చెందిన ఉద్యోగి తద్విరుధ్ధ విధానం అనుసరిస్తున్న పత్రికలో, చానల్‌లో ఎలా భావ ప్రకటన చేస్తాడు? యాజమాన్యాలు ఎలా అనుమతిస్తున్నాయి? విశ్లేషకులలో ఒక్కరూ ఎడిటర్ స్థాయిలో వారు కాదు. అందునా అయిదారేళ్ల కిందట కలాలు కిందపడేసి ఇతర వ్యాపకాలు , వ్యాపారాలలో మునిగి తేలుతూ ప్రస్తుతం ఉబుసుపోని వారు కనిపిస్తారు. ఒకరిద్దరైతే అసలు ఎప్పుడూ పత్రికల్లో పని చేసిన పాపాన పోనివారే. కొందరైతే పత్రికా రంగం నుంచి కనుమరుగై చానళ్ళ పుణ్యమా అని ప్రవేశించినవారూ ఉన్నారు. నిజానికి అపార అనుభవం ఉన్న ఎడిటర్లు విశ్లేషణ చేస్తే ఒక విలువ. పదవీ విరమణ చేసిన ప్రముఖ పాత్రికేయులు చాలా అరుదుగా బుల్లి తెరపై కనిపిస్తారు. ఇప్పటి విశ్లేషకుల్లో పలువురు హైదరాబద్ నుంచి కాలు కదపని వారే. ఉదయాన్నే పత్రికలు చదివి పుక్కిట పట్టి వస్తారు. మరో విశేషమేమిటంటే ఇవ్వాళ ఒక చానల్‌లో ఒక విశ్లేషకుడు వెలువరించిన అభిప్రాయం రేపు మరో చానల్ కు మారుతుంది. ఏ చానల్ మాటా ఆ చానల్‌కే. (ఏ గూటి పక్షి ఆ గూటి పలుకు పలుకుతుంది) పగలల్లా ఉద్యోగ బాధ్యతలకు విరామం ఇచ్చి తెల్లవారుతూనే చానళ్లలో ప్రత్యక్షం..

ఈ విశ్లేషకుల సత్తా తెలిసినందునే మంచి కాని, చెడు కాని "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" చానళ్ళు విలేఖరులకు విశ్లేషకులుగా స్థానం కల్పించలేదు. విశ్లేషకులది గుడుగుడు గుంజం.. నేను చెప్పింది నిజమోకాదో మిత్రులు ఒక్క వారం రోజులు విసుగు భరించి, నన్ను శపిస్తూ విశ్లేషకులను గమనించండి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దు, హిందీ జాతీయ పత్రికల్లో, దేశంలో పలు కేంద్రాల్లో పని చేసి పదవీ విరమణ చేసిన ఉద్దండులు, ఎడిటర్లు, ప్రస్తుతమూ పనిచేస్తున్న పలువురు ప్రముఖులు ఉండగా వారికి ఎందుకు అవకాశం లభించడం లేదు? వారు రాజీపడరు గనుక, కీర్తించరు గనుక, భజన చేయరు గనుక.. విశ్లేషకుల్లో ఒకరిద్దరు అనుభవజ్ఞులున్నా వారికీ మసి అంటుతున్నది పాపం.

No comments:

Post a Comment