Thursday, 3 January 2013


సూర్యతెలుగు దినపత్రిక సంపాదక సలహా దారు శ్రీ జి. శ్రీరామమూర్తి గారి అభ్యర్ధనకు  ఆ పత్రిక  (సూర్య”) సంపాదకీయ పుటలో   ప్రచురణకు  గత సంవత్సరం అక్టోబర్ 21 వతేదీ ఈ రాజకీయ రచనను పంపగా ఇంత సూటిగా, ముక్కు మీద గుద్దినట్లున్న రచనను తాము ప్రచురించలేమని, తమ యాజమాన్య అవసరం మేరకు తగినట్లుగా మార్పులు చేసుకుంటామని  సమాధానమొచ్చింది. అందుకు అంగీకరించక పోవడంతో ఇది ప్రచురణకు నోచుకోలేదు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా రోజుకొక విధానంఅవలంబించే పత్రికకు నేను భవిష్యత్తులో రాయబోననై నిష్కర్ష గా చెప్పాల్సి వచ్చింది.  ఒక వ్యక్తి పై రాజకీయ క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిస్సహాయతను ప్రతిబింబించే ఆ వ్యాసాన్ని  నా మిత్రుల కోసం ఈ బ్లాగులో ఉంచుతున్నాను.
____________________________________________________________________________________________________________________
కాంగ్రెస్ కళ్ళకు ఆరేళ్ళ గంతల ఫలితమీ గందరగోళం....
(నందిరాజు రాధాకృష్ణ )

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యకాలంలో తళుక్కున నక్షత్రమై వెలిగి స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులు పోసి  ప్రపంచంలోకెల్లా అక్షరాలా 128 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ నేడు పశ్చిమ సంద్రంలోకుంగుతున్న దశకు చేరుకుంది.  నాటి ఘన చరిత్ర ఈ రోజు ద్రవమై, క్రమేపీ ఆవిరై పోతున్నది. ఒకనాడు త్యాగధనులకు నెలవైన కాంగ్రెస్ ఇప్పుడు స్కాం స్వాముల నిలయమైపోయిందన్న అపకీర్తిని నెత్తికి ఎత్తుకున్నది. "ఆకాశంభున నుంచి శంభుని శిరంబు, అందుండి శీతాద్రి ....గంగా కూలంకష  వివేక భ్రష్ట సంపాతకుల్.." మాదిరి  పరువు ప్రతిష్ట పూర్తిగా కోల్పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎహురవేసిన ఆ పార్టీ నేడు మొత్తం  30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు గాను కేవలం 12 ప్రాంతాలకే అధికారానికి పరిమితమయింది. అందులోనూ పెద్ధరాష్ట్రాలు అంధ్రప్రదేశ్, డిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర  మాత్రమే. అందులోనూ మహారాష్ట్రలో నాలుగే. మిగిలినవి చిన్న రాష్ట్రాలు కావడం సంకీర్ణ ప్రభుత్వమే కావడం గమనార్హం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ చివరకు రాహుల్ గాంధీ లతో పార్టీ శకం ముగిసిపోయే ప్రమాదం ఏర్పడింది. పి  వి నరసింహారావు వంటి సమర్ధులు రాజకీయ చతురులకు సముచిత స్థానం, గౌరవం కల్పించక పక్కన పెట్టడంతో మొదలైన  పార్టీ క్రమేపి వందిమాగధ దళాలతో నిండిపోవడం మరొక కీలకాంశం. ఇప్పుడైతే చెప్పేపనే లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమర్ధుడైన జనామోదిత నాయకత్వం లేక పార్టీలో  భోగ భాగస్వాములకు తావు ఏర్పడడం తోడు, వ్యవస్థ, సంస్థ పక్కకు పోయి వ్యక్తి పూజ ఎక్కువ కావడం పార్టీకి చేటు కలిగిస్తున్నదన్న అందోళన  ఎక్కువయింది. జాతీయ స్థాయిలో శక్తిమంతమైన నాయకత్వం లేనందువల్ల ఆ ప్రభావం రాష్ట్రాలపై పడింది.  అందులో మన రాష్ట్రంలో ప్రధానంగా  కాంగ్రెస్ బక్కచిక్కి వ్యక్తి అధీనంలోకి చేరుకున్నది. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి ఉద్దండ ముఖ్యమంత్రులు కనుమరుగయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటి పాలనాదక్షులు మాయమయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి వంటి అనుభవజ్ఞులు అదృశ్యమయ్యారు.కాంగ్రెస్ పార్టీ పరంగా 1946నాటి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాధుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య వంటి ధీరోదాత్త అధ్యక్షులూ లేకుండాపోయారు.  స్వాతంత్ర్యానంతరం ఎన్ జి రంగా, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి వంటి దిగ్ధంతలు రాష్ట్ర పార్టీకి సారధ్యం వహించారు.1946 నుంచి నేటివరకు 37 మంది పిసిసి అధ్యక్షులు  పార్టీకి నాయకత్వం వహించారు. 1982 నుంచి పతనస్థాయిలో పయనమై 2004 నాటికి కోలుకున్నట్లు కనిపించినా నిజానికి భూస్తాపితమార్గంలోకి కాలు పెట్టింది. వై ఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగా నాయకునిగా ఎదిగి పార్టీని దిగాజార్చారన్న అభియోగాలున్నాయి. పార్టీ పూర్తిగా ఒక వ్యక్తి అధీనంలోకి వెళ్లిపోయింది. నిజానికి 1983 నుంచి కాంగ్రెస్ అధికారం కోల్పోయినా  పార్టీ అస్తిత్వం విలువ పెంచుకుంది. 2004, 2009 లో అధికారం నిలబెట్టుకున్నా అస్తిత్వం పోగొట్టుకున్నదన్నది నిజం. పార్టీ మటుమాయమై నాయకుని వ్యక్తిత్వం మిగిలింది. వై ఎస్ పార్టీ గెలుపునకు ఎంతముఖ్య పాత్ర పోషించారో పార్టీని బలహీనపరచడంలో అంతకంటే ఎక్కువ  పాత్ర నిర్వహించారు. వాస్తవాలు కటువుగా వుంటాయి, జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పతాకం నీడన, ఇందిర, రాజీవ్, సోనియా, చివరకు రాహుల్ స్మరణతో ఎదిగి 2009 నాటికి ఆ పార్టీని తన నీడకు తీసు కొచ్చుకున్నారు. పార్టీకి జీవం పోసిన కీర్తి, అధిక సంఖ్యలో ఎం పి లను గెలిపించిన ఘనత వలన కేంద్రంలో యు పి ఏ ప్రభుత్వ నిర్మాణం కావడంతో అధిష్టానం ఆయనను సర్వసత్తాధికారిగా పట్టం కట్టింది. దక్షిణాదిన ఆశ్రయం కల్పించినందుకు నాయకత్వం ఆయనను తలకెత్తుకున్నది. వచ్చిన అవకాశాన్ని చేజారనీయక స్థానం పదిలపరచుకున్నారు. సంక్షేమం, అభివృద్ది ముసుగువేసి రాష్ట్ర భవిష్యత్తు, ఆర్ధిక స్థితిగతులను ఆలోచించకుండా జనాకర్షణ కార్యక్రమాలు భుజానికి ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే  సుస్థిర స్థానం కోసం ప్రణాళికలు మొదలెట్టారు. నిత్య అసమ్మతి వాదిగా పేరొంది,  ప్రధానులను ముఖ్య మంత్రులను సైతం ఎదిరించిన వై ఎస్ ఆర్ అదను చూసి రాజకీయ శత్రువులను ఒక్కరినే బలహీన పరచారు. అన్ని జిల్లాల్లో తన అనుయాయులను ప్రోత్సహించి ప్రత్యర్ధులను దూరంగా పెట్టడంలో విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి మొత్తం 23 జిల్లాలను తన బృందంతో నింపుకున్నారు. గొర్లె హరిబాబు నాయుడు, పెనుమత్స సాంబశివరాజు, ద్రోణంరాజు, ముద్రగడ, హరిరామజోగయ్య, మాగంటి, మింటే, పిన్నమనేని, చనుమోలు, కాసు బ్రహ్మానందరెడ్డి బృందం, నేదురుమల్లి అనుయాయులు, ఆర్ చెంగారెడ్డి వర్గం, జే సి దివాకరరెడ్డి, మైసూరారెడ్డి, డి ఎల్ రవీంద్రారెడ్డి, శివరామకృష్ణయ్యలను ఏరివేశారు. అదే మాదిరి ఇతర సీనియర్లైన జి వెంకటస్వామి, ఉప్పునూతల, పరిగి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, సంతోష్ రెడ్డి, కోదండరెడ్డిపి  జనార్ధనరెడ్డి, మర్రి శశిధర రెడ్డిపి శివశంకర్మధుయాష్కి, వి హనుమంతరావు, కే కేశవరావు వంటి వారిని అడ్డు తొలగించుకున్నారు. మాజీలైన జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి అనుచరులను రంగంలో లేకుండా చేసుకున్నారు. అయిదారు పర్యాయాలు ఎన్నికవుతూ వచ్చిన అనుభవజ్ఞులను తప్పించారు. ఒక సమయంలో తనకు అండగా నిలిచిన ఎమ్మెస్సార్ ను కూడా గాలిలో పెట్టారు. కౌన్సిల్ పునరుద్ధరణ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తును రచించుకుని మద్దతుదారులకు రాజకీయ నిరుద్యోగ సమస్య తీర్చారు. నామినేటెడ్ పోస్టుల్లో తనవారిని నింపేశారు. మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, జిల్లాపరిషద్లు, ఆలయ కమిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలను ఇష్టానుసారం నింపేశారు. మంత్రివర్గంలో తనవారే. గల్లీనుంచి డిల్లీ వరకు తనదే పెత్తనం. రాయలసీమ కోస్తా, తెలంగాణలోనూ ఆయనదే ఆధిపత్యం సాగించుకున్నారు. ప్రత్యర్దులనే కాక, ప్రతిపక్షాలనూ నీరుకార్చారు. వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తెలుగు దేశం, ప్రజారాజ్యం లనూ నిలివునా చీల్చగాలిగారు. తెలంగాణలోని అధికార పక్షం సభ్యులలో కొందరిని ఆకట్టుకుని సెంటిమెంట్ బలహీనపరచారు. ఉభయ కమ్యూనిస్టులనూ ప్రలోభపరచారు. ప్రసార మాధ్యమాలను, అధికార గణాలను వశంచేసుకుని ప్రత్యర్ధులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. అధిష్టానం అవసరాలకూ  సాయంచేశారు. పార్టీ మార్పిడులను ప్రోత్సహించి కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన కీర్తి పొందారు. తన వ్యతిరేకులను సాగనంపి, అనుకూల గణాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నాటకీయంగా  కాంగ్రెస్ సీనియర్లను కకావికలం చేశారు. రెండుపర్యాయాలు పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ  సహచరుడు, ఫై సి సి  అధ్యక్షుడు డి శ్రీనివాసను ముఖ్య మంత్రి పదవికి తనకు పోటీ రాకుండా తప్పించగలిగారు. ఎమ్మెస్సార్ వంటి వారిని ఆర్టిసికి పరిమితం చేశారు. ప్రభుత్వంలో, పార్టీలో తన కోవర్టులను నింపుకున్నారు.సొంత వ్యక్తులను ప్రోత్సహించి సలహాదారులుగా నియమించి వారికి సాయపడి తనకు లబ్ది చేకూర్చుకోగాలిగారు. 2014 తరువాత తన  అనువంశిక పాలన సాగేలా  చేసి తన వ్యక్తిగత బలం పెంచుకున్నారు. పార్టీని ప్రభుత్వాన్ని చేతల్లోకి తీసుకుని తన ప్రతినిధులతో నింపేసి ఇతరులకు రిక్త హస్తాలుచూపారు. నామినేటెడ్ పోస్టుల కాలపరిమితి పూర్తయినా 2009 ఎన్నికల బూచిని చూపి నియామకాలు దాటవేశారు. పదవుల పందేరంలో  తనవారికి పట్టం కట్టి   మిగిలిన వారిని నిరాశకు గురిచేసారు. కడపజిల్లా రాజకీయాలను  పునాది చేసి జిల్లాలో పదవులను బంధుగణానికి పందేరం చేశారు. సన్నిహితులకు, కుటుంబానికి రాజకీయాలు వ్యాపారాల్లో  భాగస్వామ్యం కలిపించారు. గనులు,  స్థలాలు, భూములు, సెజ్ లు, కాంట్రాక్టులు, ఇళ్లు అన్నీ తనవారికి దక్కించుకున్నారు. రెండోసారి మంత్రివర్గంలో తన వ్యతిరేకులకు స్థానం  జాగ్రత్త పడ్డారు. ప్రస్తావించవలసి వచిందంటే తాను తప్ప నాయకుడు లేకుండా చేశారని వివరించడానికి మాత్రమే. ఆకస్మాత్తుగా అనూహ్యంగా వై ఎస్ ఆర్ మరణించడంతో రాష్ట్రం నాయకుడు లేని రాజ్యమయింది. మూడేళ్ళుగా అంతా గందరగోళం. వై ఎస్ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి సింహాసనం అధిష్టించడానికి అప్పటికే అన్ని పనులు పూర్తయినా కాలం కలసిరాకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. వై ఎస్ ఆర్ అనుయాయులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరుకు ఎంపి లు కాంగ్రెస్ తో కాపురం చేయడంలేదు. అధిష్టానినికి వ్యతిరేకం. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అశక్తులు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, జగన్ వైపు చూస్తుండడమే. జగన్ ఓదార్పు సాగించినా, కాంగ్రెస్ విడిచిపెట్టి సొంత దుకాణం పెట్టి కాంగ్రస్ ను దుయ్యబట్టి సోనియాను, కేంద్రాన్ని చెండాడినా, ఎమ్మెల్యే లను, ఎంపిలను చీల్చి రాజీనామాచేయించి  ఎన్నికలు తెచ్చి కాంగ్రెస్ ను ఘోరంగా ఓడించినా, అక్రమ ఆస్తుల ఆర్జన కేసుల్లో పలువురు మంత్రులు,   ఎస్ లు, జైలుకు వెళ్ళినా, జగన్ బయట ఉన్నాజైల్లో ఉన్నా అందరూ ఆయనవెంట ఉండడానికి కాంగ్రెస్ లో కోవర్తులే కారణం. కిరణ్ కుమార్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి చూడడానికి అధిష్టానానికి అడ్డంకి ఏమిటో అని డిల్లీ నాయకుల్లో చర్చ సాగుతున్నది. మంత్రి మండలి విస్తరణకు,పోస్టుల భర్తీకి, పిసిసి కొత్త కార్యవర్గానికి ముహూర్తం నిర్ణయం కాకపోవడంతో కార్యకర్తల్లో, నాయకులలో, ప్రజాప్రతినిధులలో అసహనం పెరుగుతున్నది. అగ్నికి ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ బెదరింపులు తోడయ్యాయి. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు , కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులుపార్టీలోవారికి  కీలక పదవులు  ఇవ్వాలని  బ్లాక్  మెయిలింగ్  మొదలయింది.  కాంగ్రెస్ పార్టీ వారికి పోస్టులు కట్టపెట్టకపోతే  జగన్ వైపు వెళతారని మరొక భయం. సి ఎంపిసిసి అధ్యక్షుల మధ్య సయోధ్య లేకపోవడం మరొక తలనెప్పి గా మారింది. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు మరొక పెద్ద పరీక్ష. కే సి ఆర్, కోదండరాం, బి జే పి తెలంగాణను తలకేత్తుకున్నాయి. తెలుగు దేశం కూడా ఇబ్బంది పెడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపి  మధ్య సయోధ్య సున్నా. పాలన పడకేసింది. యాత్ర జాతర సాగుతున్నది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపిలు, ముఖ్యమంత్రిపై ప్రత్యక్ష దండయాత్ర, ఆరోపణలకు దిగడం ఇంకో సమస్య.. తెలంగాణ తేల్చకపోతే అయోమయం. మంత్రులు ఎంపి లు డిల్లీలో, ముఖ్యమంత్రి జిల్లాల్లో. అధికారులు జైల్లో. సచివాలయంలో, అసెంబ్లీ ఆవరణలో, కాంగ్రెస్ కార్యాలయం లో, పరస్పర విమర్శనలు. ఆపేవారు, అడ్డుకునే వారు లేరు. క్రమశిక్షణ   కాగడా పెట్టి వెదకినా కనబడడం లేదు. కాంగ్రేస్  భవిష్యత్ అగమ్యగోచరం..పదవులకోసం ఎదురుచూపులే. కళ్ళు కాయలు కాస్తున్నాయి. పెదవులు తడి ఆరుతున్నాయి. అంతా  టెన్షన్. కాదంటే  గోడ దూకుడే. 2014 సంగతి దేవుడెరుగు. మిగిలి ఉన్న ఏడాదిన్నర ఎలా అన్నదే ప్రశ్న.

No comments:

Post a Comment