Tuesday 1 January 2013


01-01-2013

ప్రపంచ తెలుగు మహా సభలు- ఒక సింహావలోకనం 

తిరుపతి మహాసభల్లో పాల్గొని, అనీ ప్రత్యక్షంగా అనుభవించిన అనుభవంతో రాసిన ఒక సమీక్ష ఇది. ఒకే రోజులో పూర్తి చేస్తే చాలా సుదీర్ఘంగా చదవడానికి విసుగు కలిగిస్తుందన్న కారణంగా మూడు రోజులపాటు అక్కడి వివరాలు అందించే ప్రయత్నం..
కలియుగ వైకుంఠం తిరుపతి  పుణ్య క్షేత్రంలో గత నెల 27, 28 29 మూడు రోజులపాటు "నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల"నే  తిరునాళ్ళ గడచిన శనివారంతో ఒక జాతరగా ముగిసింది. ఆ చారిత్రాత్మక ఘట్టం కోటప్పకొండ, మంగళగిరి తిరునాళ్ళను మరపింప జేశాయనడంలొ  ఏమాత్రం సందేహం లేదు. తెలుగు మహాసభల వార్తా  ప్రచురణ, సమాచార సేకరణలో నిష్పాక్షికంగా, ముక్కుసూటిగా వ్యవహరించి  అగ్రస్ఠానంలొ నిలిచింది "ఈనాడు" పత్రిక  ఒక్కటి మాత్రమే అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. రెండు రోజుల ముందుగానే వైఫల్యాలు కొట్టొచినట్లు కనిపించగానే  ఎత్తి చూపింది. సందర్భానుసారంగా ఎక్కడికక్కడ సమర్థులైన సిబ్బందిని నిలిపి తెలుగు భాష ఒరవడిని కాచి వడపోసి చక్కని వార్తాహారాన్ని పాఠకుని మెడలో అలంకరించింది ఆ ఒకే ఒక పత్రిక మాత్రమే!! తెలుగు సభల ప్రారంభానికి వారం ముందుగానే మొదటి, రెండో,  మూడో ప్రపంచ తెలుగు మహాసభల విశేషాలను ప్రత్యేక వ్యాసాలుగా విందు భోజనం లా వడ్డించింది. ఆనాటి సభల పాత చిత్రాల మాలికను తయారు చేసి కనువిందు చేసింది. దాదాపు అన్ని పత్రికలు తమ పబ్బం  గడుపుకునే రీతిలొ వ్యవహరించాయి. అక్కడి యదార్ధాలను 26వ తేదీ రాత్రే హైదరాబాద్ లొని కొందరు పాత్రికేయ మిత్రులకు ఫోన్ లో తెలిపినా ఎవ్వరూ వాటిని లక్ష్యపెట్టలేదు. మహాసభలు కేవలం ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచేందుకే దోహదపడ్డాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఖర్చు భారీగా చేసినా, సదుపాయాల లోటుపాట్లు సరిదిద్దలేకపొయారు. 26 సాయంత్రానికి తిరుపతి చేరుకున్న ప్రతినిధులకు, మరుసటి రోజు కార్యక్రమ పాస్ లు, వసతి వివరాలు అందజేయలేక పోయారు. మహాసభల సాధికార కమిటీ సభ్యులకు కూడా పాస్ లు అందలేదు. ప్రతినిధులుగా హాజరయ్యే వారికి కిట్ బ్యాగ్ లు, అందులొ సభల వివరాలు, నిర్వాహకులు ముందుగా పేర్కొన్నట్లు బ్యాగ్ లో వెంకన్న లడ్డు, కొండపల్లి బొమ్మ, మూడురోజులకు సరిపడా భోజన, ఉపాహార చీట్లు కనిపించలేదు. ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు కళ్ళు చెదిరిపొయాయనడంలో సందేహం లేదు.     సభలలొ మంత్రుల భాగస్వామ్యం కలికం వేసి చూసినా కనిపించలేదు. స్థానిక అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ప్రధాన అతిధిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరైనందువల్ల భద్రతా ఏర్పాట్లలొ భాగంగా ప్రాంగణానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలొనే వాహన రాకపోకలను నియంత్రించడంతో వృధ్ధులు,మహిళలు అనేక పాట్లు పడవలసి వచ్చింది. అసలు వేదికను చివరి క్షణంలో అవిలాల చెరువు నుంచి శ్రీ వేంకటేశ్వర పశు   విశ్వవిద్యాలయం ప్రాంగణానికి మార్చడంతో  ఏర్పాట్లలో గందరగోళం చోటు చేసుకుంది. చివరి నిముషం వరకు తుదిమెరుగులు సాగుతునే ఉన్నాయి.  తిరుపతి చెరుకున్న ప్రతినిధులు ప్రాంగణంలొ ప్రవేశించడానికి  ఇబ్బందులు పడ్డారు.  జిల్లాల నుంచి వచ్చిన వారికి, ప్రవేశ పత్రాలు, కిట్ బ్యాగులు ఇచ్చే కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. కొందరు పత్రాలు అందక నిరాశగా వెనుదిరిగారు. వేదిక పెద్దదిగా వున్నా భద్రతాకారణాల వల్ల అహూతులకు వెదికపై ప్రముఖులు కనబడలేదు. ప్రధాన వేదిక వద్ద విశాల ప్రాంగణంలొ  పది సి సి కెమేరా స్క్రీన్ లు పెట్టినా దర్శనకు వీలు కలగలేదు. ఒక్క సంగీత సాహిత్య వేదిక మినహా మిగిలిన ఉప వేదికలు దూరంగా విసిరేసినట్లుండడంతొ అహ్వానితులు దూరం నడవ వలసి ఇబ్బందుల పాలయ్యారు.  భోజన శిబిరం వద్ద సభల ప్రారంభదినాన గందరగోళం   చోటుచేసుకుంది.  మైక్ సౌండ్ సిస్టం బాగాలేక ప్రసంగాలు వినబడక అసౌకర్యానికి గురయ్యారు. మధ్య మధ్యలో స్క్రీన్ ల పై బొమ్మలు మాయమై వేదికపై ఏమి జరుగుతున్నదో తెలీక ఆహ్వానితులు అయోమయంలొ పడ్డారు.         
  

-

No comments:

Post a Comment