Monday, 14 January 2013


14-1-2013

నిత్య సత్యాన్వేష ప్రక్రియలో జిడ్డు కృష్ణమూర్తి ప్రయాణ  విశేషాలు...

అనుకోకుండా మహాతాత్వికుడు జిడ్డు కృష్ణ మూర్తి గారి గురించి నిన్న ఎందుకో నాకు ఆలోచనలు మొదలయ్యాయి. నాకు తెలిసినంతవరకు ఆయన మార్గంలో అడుగులు వేస్తే మిగిలిన తాత్విక ప్రయాణాన్ని శ్రీ శర్మ గారి వంటి గురువర్యుల వద్ద అభ్యసించాలని మనసైంది. అందులో నా మొదటి  అధ్యాయానికి సంక్రాంతి పర్వ దినాన శ్రీకారం చుట్టాను. మూడు భాగాలుగా వివరించే చిన్ని ప్రయత్నం మొదలెట్టాను. నా అడుగులు పొరబడితే పెద్దలు సరిదిద్దగలరన్న విశ్వాసంతో....

నిత్య సత్యాన్వేషి, తాత్విక విప్లవకారుడుగా విశ్వఖ్యాతి నొందిన జిడ్డు కృష్ణమూర్తిగారిని శ్రీకృష్ణునిగా  భావించడానికి కారణం ఆయనకూడా శ్రీకృష్ణ పరమాత్ముని వలె సంజీవమ్మ- నారాయణయ్య దంపతులకు అష్టమగర్భ సంజాతకుడు కావడం ఒక కారణమంటారు. చిత్తూరు జిల్లా  మదనపల్లెలో రెవిన్యూ అధికారిగా నారాయణయ్య పనిచేస్తున్నప్పుడు 1895 మే 11వ తేదీ స్వగృహం పూజామందిరంలొ ఆయన జన్మించారు. అనంతరం నారాయణయ్య పదవీవిరమణ చేసి మదరాసు(అడయారు)లోని దివ్యజ్ఞాన సమాజంలో కొత్త విధులనిర్వహణలో చేరడం వలన బిడ్డలు సహా కుటుంబం మొత్తాన్ని అక్కడికి మార్చారు. పరమ గురువు మైత్రేయ మహర్షి అగోచరంగా ఉండి ప్రపంచాన్ని  రక్షిస్తున్నాడని విశ్వసించే దివ్యజ్ఞాన సమాజం లొ కీలక  సభ్యుడైన సి డబ్ల్యు లెడ్ బీటర్ ఒక సాయంత్రం అడయారు ఇసుకతిన్నెలపై ఆడుకుంటున్న కృష్ణమూర్తి ముఖ వర్చస్సు గమనించి ఆకర్షితుడయ్యరట. మైత్రేయ ప్రభువు ప్రవేసించడానికి కృష్ణమూర్తి దేహం అనువైనదని భావించిన బీటర్ ఆ బాలుని దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు డాక్టర్ అనీబిసెంట్ వద్దకు తీసుకుపొయి తన భావాన్ని వ్యక్తీకరించాడట.

అప్పటికి కృష్ణ వయసు 12 సంవత్సరాలు. ఆమెకూడా అంగీకరించడంతో కృష్ణ. అతని కనిష్ట సోదరుడు నిత్యకు సమాజంలోనే భోజన నివాస సదుపాయాలు కల్పించారు. వారికి తమ విధానంలో శిక్షణ ఇస్తూ ప్రైవేటుగా విద్యాబోధన చేయించాడు.  సోదరులలో తేజస్సు గుర్తించి అనీబిసెంట్ వారిని దత్తత తీసుకుని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ పంపింది.ఇంగ్లండ్ లో సమాజ సభ్యురాలు లేడీ ఎమిలీ కృస్ణ సోదరులను పోషణ బాధ్యతలు చేపట్టింది. అనతికాలంలో శ్రీకృష్ణుని ఆనాడు యశోద లాలించి, పోషించిన విధంగా ఆదరించింది.  వారిరువురినీ అక్కడివారు ప్రేమగా చూసేవారు. ఆ వయసు నుంచే వారికి కృష్ణ ధర్మబోధలు చేస్త్రుండేవాడు. కనిష్టుడైన నిత్య చదువులో చురుకుగా మెట్లు ఎక్కుతూ మెట్రిక్ ఉత్తీర్ణుడై పిదప న్యాయశాస్త్ర విద్యాభ్యాసం మొదలెట్టాడు. కృష్ణ మాత్రం ముమ్మారు మెట్రిక్ లో డింకీలు కొట్టాడు. ఆ సమయంలో అనీబిసెంత్ సలహామేరకు కృష్ణ పారిస్ వెళ్ళి ఫ్రెంచ్ అధ్యయనం చేశాడు. ఆ తరుణంలో నిత్యకు క్షయ వ్యాధి సోకింది.

లెడ్ బీటర్ ఆసమయంలో ఆస్ట్రేలియా లోని సిడ్నీ పట్నంలో ఉంటూ సమాజ వార్షికోత్సవాలకు అన్నదమ్ములను పిలిపించాడు.నిత్య చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలొని ఓహై లోయకు వెళ్ళారు. కృష్ణ ధ్యాన సాధనలోను, నిత్య చికిత్సలోను ఉండేవారు. 1932 కాలంలో కృష్ణకు నూతన అనుభూతులు  మొదలయ్యాయి. వెన్నెముక, తల, మెడలో తీవ్ర నొప్పి వచ్చేది. కలవరింపులతొపాటు బాధ భరించలేక సేవనిమిత్తం హాజరయ్యేవారిపై విరుచుకు పడేవాడు. అతనికి సహాయకారిగా అమెరికన్ యువతి రోజలిండ్ ఉండేది. ఆగస్ట్ 17న ఆవేదన ఎక్కువయింది. కృష్ణ ఎదురుగావున్న పెప్పర్ చెట్టుకింద కూర్చున్నాడు. అపస్మారక స్థితిలొ కొంతసేపు గడిపి తెలివి రాగానే వణకుతూ, సణుగుతూ లేని ఓపిక తెచ్చుకుని ఏవో శ్లోకాలు చదివాడు. బాహ్యంగా ఆవేదనలు, అంతర్గత అనుభూతులు ఆవహించాయి.అతడు లేచి నెమ్మదిగా అడులేస్తూ వస్తుంటే, ఎదురుగా గమనిస్తున్న రోజలిండ్ పెద్దగా "అడుగో బుధ్ధుడు, బుధ్ధుడు.." అంటూ అరిచి కుర్చీలో కూలబడింది. ఆరోజే కృష్ణమూర్తి పరివర్తనకు నాందీ ప్రస్తావన అయింది. అతని అంతశ్చేతనం వికసించింది. అలా పగలనక, రేయనక అనేక అనుభవాలతో పరిణామ ప్రక్రియ సాగింది.    ( మిగతా విశేషాలు  మరో రెండ్రోజులపాటు .. రెండు భాగాలుగా ...)

No comments:

Post a Comment