Wednesday 16 January 2013

16-1-2013


జి కె లో అనూహ్య మార్పు
బవబంధాలను తెంచుకున్నారు..


(జిడ్డు కృష్ణమూర్తి -2)







అలా ఆగస్ట్ 17న పరివర్తన పొందిన జికె (జిడ్డు కృష్ణమూర్తి) కొంత కాలానికి మిత్రులతొ కలసి ఆస్ట్రియాలోని ఎర్వాల్డ్ కు వెళ్ళారు. అక్కడ రెండునెలలపాటు ఆయనలొ పరివేదన కొనసాగింది.ఒక రోజు ఆ పరివేదన పరాకాష్ఠకు చేరుకుని స్పృహకొల్పోయారు. నాటినుంచి జికె లో నిశ్చలత, గాంభీర్యం, తేజస్సు, దీక్ష, విశాలత, స్వేచ్ఛ,శక్తి స్పష్టంగా కనిపించ సాగాయి. అనుయాయులు, అభిమానులు మిత్రులు ఆయనను 'కృష్ణజీ' అని పిలవసాగారు. ఓహైలో ఉంటున్న భవనాలు కొనుగోలు చేసి "సోదరుల ట్రస్ట్"కు దఖలు పరచి -ఆర్యవిహార్- గా వ్యవహరించారు. ఇలా ఉండగా, అడయార్ లో స్వర్ణోత్సవ మహాసదస్సుకు హాజరు కావాలని సోదరులకు అనీబిసెంట్ నుంచి పిలుపు వచ్చింది. అయితే నిత్యకు అనారోగ్యం తార స్థాయిలొ ఉండడంతో  జి కె ఏదీ చెప్పలేక పోయారు. నిత్యకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదని పరమ గురువులు హామీ ఇచ్చారని  స్వయంగా అనీబిసెంట్ చెప్పడంతో కాదనలేక జి కె అడయారుకు బయలుదేరారు. మద్రాసు ప్రయాణం మార్గమధ్యంలో ఉండగా నిత్య మరణ సమాచారం జి కె కు తంతి ద్వారా తెలిసి ఖిన్నులయ్యారు. దాంతో గురువులపై ఆయనకు విశ్వాసం సడలింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎలాగో దిగమింగుకుని గుండె దిటవు చేసుకుని  జీవితాన్ని ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు . నిత్య తనలో  ఐక్యమైనట్లుగా తాను ద్విగుణీకృత శక్తిమంతుడైనట్లు ప్రకటించారు.

అడయారు చేరుకుని స్వర్ణోత్సవ సభలో అధునాతన భావాలను ప్రస్ఫుటింపజేస్తూ ప్రసంగించారు. అప్పటి వరకు ఆయనకున్న ఆధ్యాత్మిక భావాలకు, విధానాలకు మార్పు కోరుకున్నారు. ఆ సభల్లో 'ఒక ప్రపంచ బోధకుడు ఉదయించాడని" అనీబిసెంట్ ప్రకటించింది. అంతేకాక తాను కృష్ణజీకి భక్తి తత్పరతతోకూడిన శిష్యురాలిగా ప్రకటించుకుంది. అనీబిసెంట్, లెడ్ బీటర్ ఆశించినట్లు జి కె విశ్వగురువు కాలేదు. సమస్త విశ్వాసాలను, సర్వ విధానాలను, సకల సంస్థలను ప్రశ్నించారు. ఆ విధానాలు, విశ్వాసాలవలన సత్యదర్శనం కలగదని స్పష్టంగా చెప్పారు. 18సంవత్సరాలపాటు ఆదరించి, పెంచి పెద్దచేసి, తన అధ్యక్ష స్థానంలొ తనకై ప్రచారం చేసిన "ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్" సంస్థను అనీబిసెంట్ సమక్షంలోనే రద్దుచేసి, దానికి సంబంధించిన కోటానుకోట్ల రూపాయల విలువైన ఆస్తులను దాతలకు తిరిగి ఇచ్చేశారు. దివ్యజ్ఞాన  సమాజాన్నే వదలి, బవబంధాలనుండి, సంస్థలనుండి, విశ్వాసాలనుంచి, నిబధ్ధత నుంచి వైదొలగారు. సంపూర్ణ స్వేచ్ఛతో సర్వ స్వతంత్రుడయ్యారు.

సత్యానికి మార్గం లేదని, ఏ మార్గం ద్వారా కాని, ఏ మతం ద్వారాగాని, ఏ శాఖ ద్వారాకాని, సత్యాన్ని పొందలేరని ప్రవచించారు కృష్ణజీ. సత్యం హద్దుకు, నిబద్ధతకు లోనుకానిదని కనుక సంస్థాగతం చేయరాదని స్పష్టం చేసి.. అలా బద్ధత చేస్తే శవసదృశమేనని ప్రకటించారు. ఒక ప్రత్యేక సంస్థ, మార్గం వెంట మార్గంలో వెళ్ళాలని ఏ ఒక్క సంఘమూ ప్రజలను వొత్తిడి చేయవద్దని కోరారు. దేవుని పట్ల నమ్మకమే మతమనుకొంటామని, నమ్మకపోతే సంఘం నాస్తికుడుగా ముద్ర వేస్తుందని , నమ్మితే ఒక సంఘం లేదా సంస్థ తిట్టిపోస్తుందని నమ్మక పోతే మరో సంస్థ తిరస్కరిస్తుందని  చెప్పారు. ఏ  మత విశ్వాసమైనా మనుష్యులను విభజిస్తుందని, విశ్వాసం కేవలం వ్యక్తిగతమైనదని కృస్ణజీ బోధించారు... (మిగతా.. తర్వాతి భాగంలో...)                                          

No comments:

Post a Comment