Monday 22 July 2013

               నేడు దాశరథి కృష్ణమాచార్య  88వ జయంతి 



                                          తీగలను తెంపి అగ్నిలో దింపినావు                                                                                       నా తెలంగాణ కోటి రత్నాల వీణ..  





అని అవేదనా గళం విప్పిన దాశరథి కృష్ణమాచార్య  88వ జయంతి నేడు. ఈ నేలపై అక్షరాల పంటలు పండిస్తున్న పత్రికలు ఒక్కటీ ఆయన ను గుర్తుకు తచ్చే ప్రయత్నం చేయలేదు. దాశరథి జయంతికి ఒక్క నమస్తే తెలంగాణ మినహా ఏ తెలుగు పత్రికా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు దాశరథి గురించి ఒక్క వ్యాసంకూడా పత్రికలు ప్రచురించలేదు .

"అగ్నిధార" ఖండకావ్య సంపుటికి దేవులపల్లి రామానుజ రావు తొలిపలుకులు రాస్తూ, (15-8-1949) "....నేడు తెలంగాణాలో కవులెందరో యున్నారు. కాని పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత యిచ్చి గొంతెత్తి చెప్పగల కవి వాణి దాశరథియే. జన సామాన్యము యొక్క హృదయాలలోని ఆకాంక్షలను గట్టిగా, శక్తివంతముగా వ్యక్తీకరించిన ఆంధ్రావని యువకుడు మరొక్కడు లేడని చెప్పిన అతిశయొక్తి కాజాలదు. దౌర్జన్యము, అన్యాయము అక్రమముల మీద తిరుగుబాటే ఒక మాటలో దాశరథి కవిత్వము.. " అన్నారు. తొలి పలుఇకుల్లోనే.." గత సంవత్సరము తెలంగాణమంతయును కుంపటిలో పడి నిప్పులలో మాడిపోయినదని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. ఆనాటి ప్రజల కష్టాలు దాశరథిని కాల రుద్రుని జేసెను. కావుననే :వ్రణాలకు,రణాలకు, మరణాలకు, మాన ప్రాణ హరణాలకు, హద్దూ పద్దూ వుండని కరకునృపతి రాజ్యములో చిరఖేదం విరమించుక బ్రతికేమో! కడుపు నిండ గంజినీళ్ళు గతికేమో..." అని దీర్ఘ నిస్వాసము విడిచినారు.."" అని దేవులల్లి ఆవేదన వెలిబుచ్చారు.

ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిహైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి “ రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్” అని నిజామును సూటిగా గర్జించాడు. ఆయన కవితా సంపుటాలు:

అగ్నిధార
మహాంధ్రోదయం
రుద్రవీణ
మార్పు నా తీర్పు
ఆలోచనాలోచనాలు
ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం: [ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత]
తిమిరంతో సమరం: [కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత]

దాశరధి విరచిత "అగ్నిధార" లొ 49,రుద్రవీనలో 17,మహాంధ్రోదయం లో 15, పునర్నవం లో 24, అమృతాభిషకంలో 16, కవితాపుష్పకంలో 40 గేయాలను (రచనలను) గుదిగుచ్చారు. రుద్రవీణను తెలంగాణకే అంకితం చేశారు.

ఇందులో వీర తెలంగాణం పద్యఖండికలో

ఓ తెలంగాణ! నీ పెదవు లొత్తిన శంఖ మహారవమ్ము లీ
భూతలమెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె; ఓ
హో ; తెలవార్చి వేసినవి ఒక్కొక దిక్కు నవోదయార్కరుక్
ప్రీత జలేజ సూన తరళీక్ర్త దేవనదీ తరంగముల్..

అన్నారు.. ఆ సుకవికి, జనకవికి నేడు నివాళులేవీ? తెలంగాణ లో ఆయనను నేడు స్మరించుకున్న వారేరీ!!

2 comments: