Thursday 18 July 2013




                    నేడే పవిత్ర తొలి ఏకాదశి..  




ఆషాఢ మాసంలో వచ్చే ఈ మొదటి (శుద్ధ) ఏకాదశినే తొలి ఏకాదశనీ, ఈ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడు కనుక శయన ఏకాదశనీ అంటారు. నిజంగా దేవుడు నిద్ర పోతాడా? విష్ణువు అంటే సూర్యుడు అని ఒక అర్ధం ఉంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా తిరిగే సూర్యుడు ఈ రోజు మొదలుకుని దక్షిణ దిక్కుకు వాలినట్టు కనిపించడం వలన ఈ రోజు మొదలుకుని దక్షిణాయణం అని దానినే మామూలు పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. అయితే మనకి ఎక్కువగా పండగలన్నీ ఈ దక్షిణాయణంలోనే వస్తాయి. మరి దేవుడే నిద్రపోతుంటే పూజలు ఎవరికి చేయాలి? ఉపవాసాలు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి? అని మామూలు జనాలు అడగవచ్చు.
ఈయన నిద్రపోయే రోజులలో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అంటారు. ఈ నెలలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం సంతరించుకోవడం వలన, అనేక రోగాలు చుట్టుముడతాయి. "లంఖణం పరమౌషధం" అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు శుద్ధి పొందుతాయి. దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. వాటిని నివారించడం కోసమే ఉపవాసాలు, పూజలు ఏర్పాటయ్యాయి. ఇవే కాక కష్ట పరిస్థితులలోను, భయంకరమయిన రోగాలు వచ్చినప్పుడు, చరమాంకంలోను వచ్చే విపరీతమయిన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పాటయ్యాయి..
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట.
ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఆధ్యాత్మిక గురువులు,పిఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి నాలుగు మాసములు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు అ౦దువలన ఈ దీక్ష కాలమును చాతుర్మాస్య దీక్ష గా వాడుక.ఈ దీక్షా కాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు. మన ప్రాంతంలో "తొలి ఏకాదశి తో పండుగలన్నీ తోసుకు వస్తాయి" అనే నానుడి వున్నది.

No comments:

Post a Comment