Saturday, 20 July 2013


                                               గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. "గురు" అన్న పదం లో గల రెండు అక్షరాలలో "గు" అనగా "తమస్సు" లేదా "చీకటి",  "రు" అనగా "చీకటిని తొలగించే వాడు", వెరసి "గురువు" అనే వ్యక్తి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు అని వివరణ చెప్పవచ్చు. ఇదే "తమసోమా జ్యోతిర్గమయ", అంటే "తమస్సు లేదా చీకటి నుండి జ్యోతి లేదా వెలుగు లోనికి" అని.  గురువు త్రిమూర్త్యవతారం కూడా. ఎందుకంటే బ్రహ్మవలె మనలో జ్ఞాన బీజం సృష్టించి, విష్ణువువలె దాన్ని స్థితిని కొనసాగించి, మహేశ్వరుని వలె మనలోని అజ్ఞానతిమిరాన్ని నశింపజేస్తాడు.  అందుకే "గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః అన్నాం.  అటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, అటువంటి గురువుకు నమస్కరించెదము.

సమస్త ఆధ్యాత్మిక, ధార్మిక విద్య అంతా  వ్యాసుని నోటినుండి వెలువడిందే. 'వ్యాసోచ్చిష్టం జగత్సర్వం'. ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . వశిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి  మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టి, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన  వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు. ఈ ఏడాది జులై నెల 22వ తేదీ అతి పవిత్రమైన గురు పూర్ణిమ.  ఉత్కృష్ట పారమార్ధిక పర్వదినం ప్రశస్తమైన ప్రాచీనమునుండి వస్తున్న గురువులను సేవించుకునే ఆచార సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ, అనంతమైన వైదిక ధార్మిక ధర్మసత్యాలను  అందించిన వ్యాసమహర్షికి ప్రణామాలు. గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు.  సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.  దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలు అందించిన వారే వ్యాసమహర్షి.  

గురుపౌర్ణమినాడు వ్యాస మహర్షి రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వశిష్ఠులవారిని, శక్తిమునిని,  పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

 "గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.  పూర్వ కాలం లో గురుకులం లో శిక్షణ ఇచ్చేవారు. పూర్తి అయిన శిష్యులు గురు దక్షిణ సమర్పించుకోవటం, గురుపూజ చేయటం చేసేవారు.  ఫలం పుష్పం, తోయం, ధనం, ధ్యాన్యం  వస్త్రం ఇలా ఏదైనా గురువుకి సమర్పించుకోవచ్చు. ఈ రోజు గురువు వందనం చేసి ఆశీర్వాదాలు పొందాలి. మనకి విద్య నేర్పిన గురువు ఎవరైనా సరే భక్తితో నమస్కరించాలి. జ్ఞానం ఇచ్చిన వారెవరైనా సరే, వయసులో చిన్న అయిన సరే, జీవిత సోపానం లో మనకి తెలియంది తెలియ చెప్పిన గురువు ఎవరైనా సరే వందనం అర్పించాల్సిందే! గురువు అంటే అజ్ఞానంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దీపాలు వెలిగించేవాడు. శిష్యుని మదిలో భక్తిని ప్రేరేపించి, మానవత్యాన్ని మేల్కొలిపి, మానసిక అందోళనలని పోగొట్టి శిష్యుని మేలు కోరేవాడు గురువు.

ఈ రోజు గురు వ్యాస దేవుడు మహాభారతాన్ని రచించాడు. పద్దెనిమిది పురాణాలు, భగవత్ గీత, బ్రహ్మసుత్రాలు మీమాంస అనే వి కూడా రచించిన ఆది గురువు.  తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి  ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు.  విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు.  అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలచుకుంటారు. అటువంటి వేద వ్యాసుడు మనకు తొలి గురువు.   దాన్నే "గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురుశ్లోకం లో రెండవ పంక్తికి అర్ధం. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తరువాత చెప్పుకోవాలంటే తండ్రి, తదుపరి అధ్యాపకుడు.  అందువలనే "మాతృ దేవోభవ! పితృ దేవోభవ! ఆచార్య దేవోభవ! " అన్నారు. వేదాలలోను, జ్యోతిషశాస్త్రంలోను దేవతల గురువైన "బృహస్పతి" ని గురువుగా తలుస్తారు. అతనిని ఒక గ్రహం గా గణించి అతని పేర "బృహస్పతి వారం" లేదా "గురు వారం" ఏర్పరచుకున్నాం.

పరిపూర్ణ అవతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ కుచేలుడు (సుధాముడు) సహాధ్యాయుడుగా సాందీపని మహర్షి వద్ద శిష్యుడై గురు శుశ్రూష చేశాడు. అంతేకాక కురుక్షేత్ర సంగ్రామారంభంలో పార్థుడు శ్రీకృష్ణుని ప్రార్ధించి "భగవత్-గీతోపదేశం" పొందాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటాం. మనకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, లేదా బోధకులు అంతా గురువులే అయినా వీరందరు "సద్గురువులు" లేదా నిజమైన గురువులు కాలేరు.  "సద్గురువు" లకు ఒకే జేవిత పరమావధి, లక్ష్యం వుంటుంది. అదేంటంటే, శిష్యుడుగా ఉపాసన పొందినవానికి "ఆత్మశోధన" ద్వారా, అంటే తనను తాను తెలుసుకొని, తద్వారా భగవంతుని తెలుసుకొనేలా చేయగల పవిత్రమూర్తి "సద్గురువు".  ఈ సద్గురువు కూడ ఇదే పద్ధతిలో తనను, భగవంతుని తెలుసుకున్నవాడై ఉండాలి. జ్ఞాన సంపన్నుడైన సద్గురువు నామ స్మరణ వలన శిష్యులకు జీవన్ముక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. అందుచేత ఆశయ సాధనకు ప్రతివొక్కరూ సద్గురువును ఆశ్రయించాలి.  ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన గురు ముఖతః విషయాలను గ్రహించి స్వీకరించాలి.  మన భరతావనిలో ఎందరో సద్గురువులు మనకు జ్ఞానభిక్ష నొసగి ముముక్ష మార్గమును చూపిస్తున్నారు.  అయితే సద్గురువులైన వారు చీనాంబరాలను, అధికారాలను, ఆడంబరాలను ఆశించరు. పాదపూజలు, కానుకలు కోరరు. వారు కోరేది కేవలం శ్రద్ధ, సహనం, నిర్మలమైన భక్తి, అచంచల విశ్వాసం.  రైతన్నలకు ఈ మాసం లో పడి తొలకరి చినుకులు వారి భవిష్యత్తుకి పునాదులు. వరి నాట్లు నాటే సమయం. ముందుగ ఈ రోజు పుడమి తల్లిని పుజిస్తారు. నాగలి పట్టి పొలం పనులు చేపడుతారు.

No comments:

Post a Comment