Monday 30 December 2013


పాత్రికేయునిగా తిరుమల రామచంద్ర.. 
------------------------------------

(శత జయంతి పురస్కరించుకుని "ఆంధ్రజ్యోతి" దినపత్రిక 21-12-2013(శనివారం సంచిక)న ప్రచురితమైన సాహితీ వ్యాసం )


తెలుగు సాహిత్యం, పత్రికా రంగాలలో ప్రాతఃస్మరణీయులు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సారస్వతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు.  తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న తిరుమల రామచంద్ర విధ్వాన్, విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరంజ్ ఢిల్లీ వచ్చి "డెయిలీ టెలిగ్రాఫ్" ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశారు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేశారు. తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు.  ఆరోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి , బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక లలో వివిధ హోదాలలో పనిచేశారు. "భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురింఛిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశారు. నార్ల తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నారు.  డైలీ టెలిగ్రాఫ్‌లో చేరిన వెంటనే దాని సంపాదకులు వెంకట్రామన్‌ రామచంద్రగారికి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ప్రఖ్యాత పరిశోధకుడు, బహుభాషా వేత్త అయిన రాహుల్‌ సాంకృత్యాయన్‌గారి ఉపన్యాసాన్ని కవర్‌ చేయడం. తర్వాత హైదరాబాద్‌లో సంగెం లక్ష్మీబాయిగారిని కలిసి తెలుగు పత్రికా జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి పత్రికా రంగంలోనే స్థిరంగా ఉన్నారు.  రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్ధించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

ప్రొఫెసర్‌అప్పాజోస్యుల సత్యనారాయణగారన్నట్లు ఆయన పనిచేసిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, భారతి మొదలైన పత్రికల్లో ఏ ఒక్క పత్రికల్లో స్ధిరంగా ఉండినా దానికి సంపాదకుడు అయి ఉండేవారే. అందరు పత్రికా సంపాదకులను తనకన్న చిన్నవారుగాకాక మిన్నవారుగా అంగీకరించి, వారి కింద పనిచేసిన వినయశీలి తిరుమల.  డా. అక్కిరాజు రమాపతి రావు   'తిరుమల రామచంద్ర మనసుతోనే, మనస్విగానే బతి కారు. ఆయన నిరాడంబర వచస్వి, 60 ఏళ్లకు షష్టిపూర్తి చేయించుకోలేదు. 70 ఏళ్లకు సప్తతి జరగలేదు. 80 ఏళ్లకు అశీతి అసలేలేదు. 84 ఏళ్ల సహస్రచంద్ర దర్శనం సమ కూరలేదు. ఆయనది ఏమీ పట్టించుకోని మనస్తత్వమన్నారు. ఆయన గురించి ఆయన  'హంపి నుంచి హరప్పాదాకా'  రాసుకున్న ఆత్మకథలో 'ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు, నేను సామాన్యమానవుడ్ని, కానీ నాలో వైచిత్య్రం, వైవిధ్యం ఉన్న మాట నిజం. ఎవరి జీవితంలో లేవు గనుక. ప్రతి మనిషి ఒకే మూసలో పోసినట్టుంటాడా? అయినప్పుడు వైవిధ్యం తప్పదు.  పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. "హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.  'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు'అన్న రామచంద్ర రచన భాషాచరిత్రకే తలమానికమంటూ ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదన్న విశ్వాసాన్ని 'ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు'గారు ప్రకటించటం రామచంద్ర అలుపెరుగని పరిశోధకుడు అనడానికి నిదర్శనం. ప్రచారానికి ఆయన ఏనాడు అంగలార్చిన వాడుకాడు. నిరాడంబరత, నిండు మనసు, ఓరిమి వారి వ్యక్తిత్వంలో ఇమిడిపోయాయి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు.  లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు. దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

ఏడు దశాబ్దాల కిందటే  తెలంగాణ  అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు. ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రస్తావనకు రాలేదు. ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీకరించారు. . ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో,  తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు  కమలాపురం నుంచి క్వెట్టాదాకా  లేదా  హంపీ నుంచి హరప్పా దాకా  అని ఉంటే బాగుంటుందని ఆయన ముందుగానే అభిప్రాయపడ్డారు. జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు,  ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని ఆరాతీస్తే,  మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి  అని తేలింది.  అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు. తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇది ఆయన శతజయంతి వత్సరం కావడం విశేషం. .

ఆయన గ్రంథాలు  మన లిపి, పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండేదని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ, ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని రెండు ఇంటర్య్వూల్లో  రామచంద్ర  చెప్పారు.  తిరుమల రామచంద్ర జీవితంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు.

బ్రిటీష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాలలో పనిచేసినప్పుడు, అచ్ఛర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సర్సవతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిలీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన వీరే మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామావిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమాస్తాగా, కాన్పూర్‌లో మరి కొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచంద్ర జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచుకున్న రచనలు మొదలైన వివరాలు మిత్రులకు లభ్యమయ్యాయి.  ఆయన  మూడు వాఞ్మయ శిఖరాలు  అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.  అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రాఘవపల్లె లో జన్మించిన రామచంద్ర తెలుగు, సంస్కృతాలలో విధ్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు. ఆయన నిత్య పాత్రికేయుడు, రచయిత, అధ్యయన శీలి, విద్యార్థి కూడా.. ఆయనకు శతకోటి  వందనాలు..

---నందిరాజు రాధాకృష్ణ,

No comments:

Post a Comment