Friday 24 May 2013

           

                కవితల కార్ఖానా!! చదువరులకు బందిఖానా!! 



కవిత్వం, సాహిత్యమంటే ఈ మధ్య మరీ చులకనైపోతున్నాయి. యువ, ఆధునిక కవివరేణ్యులు పుంఖాను పుంఖాలుగా రోజుకు పది, పదిహేను కవితలు రచనలు అలవోకగా గీసి (రాసి) అవతల పడేస్తున్నారు. దాంతో సాహిత్యపు విలువలు దిగజారి వీధిన పడుతున్నాయి. అందుకే కవులన్నా, కవిత్వ మన్నా, సాహిత్యమన్నా ఎక్కువమందికి వెగటేస్తున్నది. 

మొన్న జ్ఞానపీఠ పురస్కార విజేత రావూరి భరద్వాజగారి అభినందన సభలొ సాహితీ స్రష్టలు, రచయితలు, కవులు, ఆప్తులైన విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారులు ఇద్దరు కలసినప్పుడు నన్ను అడిగారు.. "ఏం రాధాకృష్ణా, ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళొచ్చి ఆర్నెల్లయ్యింది ఇంకా కవిత్వం రాయడంలేదేమిటి? కనీసం ఒక్క గాయం(గేయం) కూడా కనబడడంలేదు", అని. "నేను కవిని కాదండీ, రచయితను కూడా కాదండి. ఏదో వార్తలు రాయడంతోనే జీవితం వెళ్ళి పోయింది." అని సమాధాన మిస్తే, ఒక గురుతుల్యులన్నారు : అన్ని హల్లులు రాకపోయినా నువ్వు గొల్లుమంటే, ఒక పాతిక మంది ఫాలోయర్స్ ప్రచారం చేస్తే చాలు. నిన్ను కవిగా ముద్దరేసి "అచ్చోసి" ఒదిలేస్తారు. నువ్వే వేయించుకోవచ్చు కూడా! అక్షరాలు రానోళ్లేనయ్యా.. అకాడెమీలకు అధ్యక్షులు" అని చెణుకు విసిరారు అంత పెద్దాయన.

ఆసందర్భంలో కవిత్వం, సాహిత్యమంటే ఎలా ఉండాలో మాగ్జిం గోర్కీ, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, వంటివారి వ్యాఖ్యలు వారు వినిపించారు. అప్పటికప్పుడు రాసుకుని భద్రపరుచుకున్నా వాటిని. 


----------
*రచయితలు సదా తమ రచనా నైపుణ్యాన్ని, విధానాన్ని, పధ్ధతిని పదును పెట్టుకుంటూ ఉండాలి. నైపుణ్యం లేకుంటే చివరకు చెప్పులు కూడా కుట్టలేరు.(మాగ్జిం గోర్కి)
*మహా నినాదంలా లోకం నాలుక మీద నాట్యం చేసేదే కవిత్వం.
(మాగ్జిం గోర్కి)
*కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉందనుకుంటే, కవిత్వం తనకోసం కాక తన చుట్టూ ఉన్న ప్రజలకోసం రాయాలి. ఆత్మానందమే ధ్యేయమనుకుంటే, 'దైవ ప్రార్ధన" లాగా ఒక మూల కూర్చుని తనలో తానే సాగించుకోవచ్చు.
*కవికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. దాన్ని విస్మరించడమంటే సమాజానికే ద్రోహం చెయ్యడం.
*కవిత్వం జీవితానికి వ్యాఖ్యానమే కాదు, సమస్యలకు పరిష్కారం కూడా.
*కాలం కన్నా ముందుగా పరిగెత్తేదే కవిత్వం.
(శ్రీ శ్రీ)
*జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది.
(కొడవటిగంటి కుటుంబరావు)

No comments:

Post a Comment