Friday 17 May 2013


                   పెద్దమనుషులంటేనే బుద్ధులన్ని వేరురా!!                       

                     


                         అక్రమార్జనలో అందరూ అందరే !


ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? ఉంటుందా? మనం నెత్తిన పెట్టుకుని పూజించి రోజూ అభిమానిస్తూ యువత భవితను పణంగా పెట్టి ఆరాధిస్తున్న, సినిమానటులు, నటీమణులు, క్రీడా కారులు చీకటి సామ్రాజ్యాదినేతలతో చేతులుకలిపి కోట్లు సంపాదిస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారు. కలెక్టర్లు, ఐ ఎ ఎస్ లు అక్రమార్జనకు పాలపడుతూ జైలు జీవితాలు గడుపుతున్నారు. కేంద్ర మంత్రులు ఐదుగురు జైళ్ళకు వెళ్లి పదవులు పోగొట్టుకున్నారు. మన రాష్ట్ర మంత్రులు ఆరుగురు సర్వోత్తమన్యాస్థానం అభిసంసలు అందుకున్నారు. చార్జిషీట్లు ఎదుర్కొంటున్నారు. ఒక మంత్రి(మోపిదేవి) జైల్లో స్థిరపడి పోయారు. సి బి ఐ కేసులో సాక్షాత్తు హోమ్ మంత్రి నిందితురాలయ్యారు. రాజీనామాలు చేసి కుర్చీ వదలని మంత్రి మరొకరు. మాజీ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ని సి ఐ డి అరెస్టు చేస్తే కోర్టుల ఎదుట లొంగి పోయారు. మంత్రులు సి ఎం ను లెక్కజేయడం లేదు. కాంగ్రెస్ ఎంపీలు పార్టీ రాష్ట్ర విభజనకోసం అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. సమైక్యం పేరిట మరికొందరు తిట్లపురాణం వల్లిస్తున్నారు. సాక్షాత్తు డిజిపి పైనే అదేస్థాయి పోలీసు ఉద్యోగి అవినీతి ఆరోపణలు చేసి ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సయోధ్య లేదు. పిసిసి కి ముఖ్య మంత్రికి మధ్య అవగాహన లేదు. కొత్తగా కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తి పార్టీలో కులాల చిచ్చు లేపుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి అయిదేళ్లుగా దిక్కు లేదు. పిసిసి పునర్ వ్యవస్థీకరణకు రెండున్నరేళ్లుగా ముహూర్తం కుదరలేదు. ప్రాంతీయ, మత, కుల వివాదాలతో నాలుగేళ్ళుగా రాష్ట్రం రగులుతున్నది. పదేళ్ళవుతున్నాతెలంగాణ పీటముడి వీడ లేదు. డబ్బు చుట్టూ అధికారం, రాజకీయం, పాలన ప్రదక్షిణలు చేస్తున్నాయి. నేటి, నిజాయితీ, విలువలు నశించాయి. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగు దేశం, తెలంగాణ రాష్ట్ర సమితి ..అన్ని రాజకీయ పార్టీల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి. పార్టీ మార్పిడులు మత మార్పిడులకంటే వేగం పుంజు కున్నది. రోజూ గోడ దూకుళ్ళే! పార్టీ సమావేశాల్లో అను నిత్యం ముష్టి యుద్ధాలు, కర్ర సాములు. యాత్రా స్పెషళ్ళు ఇంకా ఆగలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అదుపూ అడ్డూ లేదు. సినిమా రంగం, క్రీడా రంగం విష తుల్యం అయ్యాయి. చివరకు ప్రసార మాధ్యమాలూ నగ్న నాట్యం చేస్తున్నాయి. విలువల వలువలు వదలి సంపాదనలో మునిగి పోటీపడి మరీ నిలువునా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. వివిధ నేరాల కింద పత్రికా సంస్థల యజమానులే జైలుపాలయ్యారు. ప్రముఖ తెలుగు పత్రిక ఆస్తుల విషయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఒక తెలుగు, ఇంగ్లీషు గొలుసుకట్టు పత్రిక ఆస్తులు జప్తు మొదలయ్యాయి. పలువురు పత్రికా సిబ్బంది నేరపూరిత ప్రవర్తనలతో నిందితులుగా బోనులో నిల్చున్నారు. స్వాతంత్ర సమరానికి శంఖము పూరించిన ఖ్యాతి ఉన్న పత్రికలు ఇప్పుడు వ్యక్తులకు, పార్టీలకు అమ్ముడుబోయి పరస్పరం దూషణ,నిందారోపణలతో పేజీలు నింపుతున్నాయి. పులిమీద పుట్రలా దాదాపు 15 తెలుగు టీవీ చానళ్ళు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ఏలుతున్నాయి.అనేక చానళ్ళు, పత్రికలు బ్లాక్ మయిల్ కు పాల్పడుతున్నాయి. వ్యవస్థ, మతం, విశ్వాసం. ఆలయాలను, ప్రార్ధనా స్థలాలను కించపరుస్తున్నాయి. అక్రమసంపాదనతో పుట్టగొడుగుల్లా చానల్లు వెలుస్తున్నాయి. పార్టీలకు కొమ్ము కాసి పబ్బం గడుపు కుంటున్నాయి. డబ్బు సంపాదిస్తున్నాయి. కొత్త కొత్త కథనాలు వండి వడ్డిస్తూ వాస్తవాలను, ప్రజా సమస్యలను ప్రసార మాధ్యమాలు మరుగున పడేస్తున్నాయి. శాసన సభ, శాసన మండలి సమావేసాలకే దిక్కూ దివాణం లేదు. నాయకులు పదవీలాలసులై ప్రజా స్వామ్య వ్యవస్థనే నేరుకారుస్తున్నారు. ఇనతలి దౌర్భాగ్యం ఈ దేశంలో ఎప్పుడూ, ఏ రాష్ట్రం లోనూ, చివరకు ఈ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడడంలో భగవంతుడు కూడా అశక్తుడే!!

No comments:

Post a Comment