Thursday, 13 December 2012

మిత్రులారా ఒక విన్నపం!

నేను ఇక్కడొక ముఖ్య విషయం ప్తస్తావించి, కొన్ని సూచన ప్రాయమైన అంశాలను ఫేస్ బుక్ లో వివిధ బృందాల నిర్వాహకుల దృష్టికి తేదలచుకున్నాను. దీనిలో నా వ్యక్తిగత ప్రయోజనం లేదని ముందుగా గమనించండి. ఎఫ్ బి లోఇటీవల కొందరు వ్యక్తులు "ఫేక్'' ఖాతాలను ప్రారంభించి కొన్ని వర్గాలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఈరోజు పోలీసు సమాచారం మేరకు, సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరిట అకౌంట్ ప్రారంభించారు. సి ఐ డి దర్యాప్తు మొదలైంది. ఇది మొదటి సంఘటన కాదు. ఇటీవల ఒక విద్యాధికుడైన యువకుడు ఒక పోలీసు ఉన్నతాధికారి ఫోటో ప్రొఫైల్ లో ఉపయోగించి బృందాల సభ్యులను తప్పు తోవ పాటించే ప్రయత్నం కాహ్సి దొరకిపోయాడు. ప్రొఫైల్ లో తన యజమాని "మేర భారత్ మహాన్" అని పేర్కొన్నాడు కూడా. అంటే భారత ప్రభుత్వమని స్ఫురించేలా. ఆ పోలీసు అధికారితో నా పరిచయం వలన నేను ఆ సంగతి బాహాటంగా అతని వాల్ మీద పోస్ట్ చేయడంతో, ఆ అధికారి అంటే తనకు ఇష్టమని, అందుకే ఆ ఫోటో పెట్టానని తప్పించుకున్నాడు.

ఆతరువాత అదే వ్యక్తి ఒక స్వచ్చంద సంస్థ పేరిట మరో అకౌంట్ మొదలెట్టి. తానేదో దేశాన్
ని ఉద్దరిస్తున్నానని, వ్యవస్థ అవినీతి మయమైందని, రాకీయం దిగజారిందని, దేశం ఏదో అయిపోతున్నదని కవిత్వ ధోరణిలో రాస్తూ పోయాడు. దాన్ని నేను ఖండించి, ఈ దేశానికి నువ్వేమి చేస్తున్నావ్, ఇంత మంది యువకులు కేవలం సంపాదన లక్ష్యంగా మాతృ దేశాన్ని వదలి విదేశాలకు నకిలీ పాస్ పోర్టులు, విఇసాలతో పోతుంటే మౌనం వహించడం భావ్యమా అని ప్రశ్నించగానే. నాబోటి వాళ్ళ వల్లనే, నాతరం పాపం వల్లనే ఇలా తయారైందని కొంత అభ్యంతకర భాషతో వ్యాఖ్యానించి, తాను నాకు జవాబు ఇవ్వబోనని, ఇవ్వవలసిన అవసరం లేదని నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది.తన సంస్థ ఎన్నో ఘన కార్యాలు చేసిందని, పోలీసుల సహకారంతో వ్యభిచార గృహాల పై దాడులు జరిపించామని, మరెందరో వ్యక్తుల ఆట కట్టించామని గొప్పలు పోయాడు. నాకు లభించిన సమాచారం మేరకు, అతను కొందరిని బ్లాక్ మెయిల్ చేశాడు. యువతుల అకౌంట్లకు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర హెచ్చరికలు అందుకున్నాడు. అతడు ఇప్పటికీ ఒక నిరుద్యోగ విద్యార్ధి మాత్రమే. ఇక అతనితో వాదనకు దిగకుండా ఆ వ్యక్తి ని పూర్తిగా బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని సంబంధిత బృంద నిర్వాహకుల దృష్టికి తీసుకు వెళ్లాను.గతంలో కూడా ఖమ్మం జిల్లాకు చెందినా ఒక సాధారణ పోలీసు ఒక సినిమా నటుని ఫోటోతో ఫేస్ బుక్ అకౌంట్ మొదలెట్టి మహిళల పట్ల అసహ్యకర వ్యాఖ్యలు చేసి బృందం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. పలువురు అతనిని బ్లాక్ చేశారు. కొందరు శ్రీల పేరిట ఎఫ్ బి లో ప్రత్యక్షమవుతూ ఎవరివి ఫోటోలు వాడుకుని, యువతులతో స్నేహం మొదలెట్టి కొన్నాళ్ళకు కించపరచే వ్యాక్యాలు చేసి మనస్తాపానికి గురిచేస్తున్నారు. ఈ సందర్భంగా మిత్రులందరికీ, ముఖ్యంగా యువతులు, మహిళలకు నా వినతి. గోముఖ వ్యాఘ్రాలున్నాయి జాగ్రత్త. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమున్డదు. బృందాలలో చేర్చుకునే ముందు నిర్వాహకులు తగిన జాగ్రత్త వహించాలని మనవి. కొత్త వారికి ప్రవేశం కల్పించే ముందు కొంత ప్రాధమిక విచారణ అవసరం. ఇది పది మంది మేలు కోసమే.. అనుమానమొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

1 comment:

  1. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కొందరు ఉబుసుపోని వ్యక్తులు, ఊరకుక్కల్లాంటి (అన్ని కుక్కలకూ వర్తించదు - కొన్ని చిత్తకార్తె కుర్కురాలకు మల్లె) వంకర సంకర జాతి మానవాకారులు ముఖపుస్తకం(Facebook)లో దూరి, తమ విసర్జితాలతో మన వాకిళ్ల(ఖాతా)ను, బృందము(గ్రూపు)ల ఆస్తికతను, పుట(పేజీ)ల పవిత్రతను పాడుచేస్తూనే వున్నాయి. మనలాంటి వారు అలాంటి గజ్జికుక్కలను గమనించి, గుర్తించి తరిమికొట్టినా (బ్లాక్ చేసినా), చాలా మంది అమయాకులు, ఆకర్షణలకు భ్రమసే బలహీనమనస్కులు ధనమానాలతోపాటు ప్రాణాలనూ పోగొట్టుకుంటున్నారు. కలంపేర్లతో లేక నచ్చిన పేర్లతో ఖాతాలు నడుపుకోవడం తప్పులేదు. స్వాగతనీయం కూడా. "ప్రియమైన జాబిల్లి" పేరుతో వున్న నా FB మిత్రుడి (యువకుడు) పోస్టింగ్స్ అందరినీ అలరిస్తాయి. ప్రయోజనకరంగా, ఆలోచనాయుక్తంగా, రసస్పోరకంగా వుంటాయి. 'వెన్నెల వెలుగులు' 'మనసుపలికే మౌనగీతం' 'నేస్తమా నువ్వే నా ప్రాణం' మన తెలుగు పదాలు' వాసంతి విరి తావులు' (నా శ్రీమతే) ఇలాంటి ఇష్ట నామధేయాలతో చాలా మంది మంచి మిత్రులు వున్నారు. సంస్థల పేరుతో నాలాంటి వారూ వున్నారు. అందరి మెప్పు పొందుతున్నారు లేదా తమ మానాన తాము ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరిస్తున్నారు. చిక్కల్లా దొంగకుక్కలతోనే ఇవి తలుపులు మూసుకున్నా ఏదో ఒక కన్నం చూసుకొనో, చేసుకునో దూరిపోతాయి. తరిమి కొడితే మరో త్రోవగుండా (మరో దొంగపేరుతో) దూరుతాయి. కాస్త అనుమానం కలిగినా ఇలాంటి దొంగ (ఫేక్) ఖాతాల వల్ల ఇబ్బంది ఏర్పడితే (థృవీకరణలతో) సైబర్ నేర విభాగానికి వెంటనే తెలియజేయడం మనందరి బాధ్యత.

    ReplyDelete