Friday 25 October 2013

          ఈ వారం [గరం మసాలా] మాటల ఈటెలు..
                                                 -----------------------------------------

25-10-13

**చిత్తం మెత్తనైతే చిత్తరువులన్నీ మొత్తం ఉత్తమమే.. కుంచె మంచిది కదా! ఎవరినీ ముంచదు. 'మధురా'నురాగాల మన(సు)ముఖ చిత్రాలు బహుసుందరం.. మీ మది బృందావనం .. నందనవనం. మీ శ్రమైక జీవన సౌందార్యారాధన (పరి)శ్రమకు మరో సారి వందనం.

**రాజకీయాలన్నా, అంతకు మించి సోషలిజమన్నా..రామ్ మనోహర్ లోహియా, మధులిమాయే, మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెజ్, బద్రివిశాల్ పిత్తి, సంజీవదేవ్, స్నేహలతారెడ్డి వంటి ఉద్దండుల పట్ల ఆసక్తి కలగడానికి సోమయ్యగారే దిక్సూచి. కళాశాల విద్యార్ధిదశలోనే(1965-68) లిమాయే, జార్జ్, పిత్తి వంటి కొందరు సోషలిస్టు నాయకులతో ప్రత్యక్ష పరిచయం, లేఖాబాంధవ్య  భాగ్యం అరుణక్క, సోమయ్య (బావయ్య)గార్ల ఫలమే. సామాజిక అలోచనలు, రాజకీయాల పట్ల, రచనా వ్యాసంగం పట్ల ఉత్సుకత పెరగడానికి వారే మార్గదర్శకులు. 1967 ఎన్నికల్లో సోమయ్యగారు తాడికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎస్.ఎస్.పి.(సంయుక్త సోషలిస్ట్ పార్టీ) అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొనడమే కాక ఎన్నికల ఏజెంటుగా కూడా పనిచేసే అవకాశం నాకు లభించింది...అప్పుడెలాగో ఇప్పటికీ ఆ అనురాగ మూర్తులిరువురిదీ సైద్ధాంతిక నిబద్ధ నిరాడంబర జీవనమే. వారితో నాది ఐదు దశాబ్దాల ఆప్యాయతాబంధం.

**ప్రజలను పట్టించుకోనివాళ్ళు, వాళ్ళ ప్రాణాలను కాపాడలేని వాళ్ళు, ప్రాంతాల ప్రయోజనాలను ఎలా పరిరక్షిస్తారు? అందరిదీ పదవీకాంక్ష, స్వార్ధమే!! గల్లీలు మునిగిపోతుంటే నేతలు డిల్లీలో దాగుడుమూతలు.. నాయకులకు ప్రజలే కీలెరిగి వాత పెట్టాలి..

**మళ్ళీ తీన్ తేరా, ఆఠ్ అఠారా! ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు పదమూడు కలసిరాదని తెలిసినా..అంతే..
13 మంది ఎంపీలు ఘనంగా రాజీనామాలు చేస్తే స్పీకర్ "కుదరదు ఫోండి" అని ముఖం మీద గిరాటేశారు.
ఈ సారి మరొక బృందం నేరుగా రాష్ట్రపతి వద్దకు (రాష్ట్ర భేరానికి) రాయబేరానికి వెళ్ళారు. లెక్క చూసుకోలేదో, ఇది ఎట్లాగూ తేలని యెవ్వారమనుకున్నారేమో! మళ్ళీ 13 మంది రాష్ట్రపతిభవన్ లో ఎడమకాళ్ళు పెట్టారు. ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు..వెరసి 13. ఈ 13 కి వెన్నుగా ఎమ్మెల్యేలు కూడ వెళ్ళారు ఈ సారి. (రాష్ట్రపతి భవన్ ను చూసినట్లుంటుంది కూడా..) అదేమి చిత్రమో వాళ్ళు కూడ పదముగ్గురే!
మంత్రులు:శైలజానాథ్, టిజి వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, తోట నరసింహం, అహ్మదుల్లా, పితాని.
ఎంపీలు: కెవిపి, లగడపాటి, రాయపాటి, మాగుంట, అనంత, కనుమూరి, సాయిప్రతాప్.
ఎమ్మెల్యేలు: కె కన్నబాబు, కె సుధాకర్,వంగా గీత, ఉగ్రనరసింహ, బిఎన్ విజయకుమార్, ఎన్ శేషారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, సిహెచ్ వెంకట్రామయ్య, కెవి నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఈలి నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు..(వీళ్ళకుతోడుగా [ఆటలో అరటిపండ్లు] ఎక్‌స్ట్రాలు ఆ నలుగురు.. ఎమ్మెల్సీలు)
మరో ముఖ్య విషయం..భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన అభాగ్యులు కూడా 13 మంది. మృతుల కుటుంబాలకు మనమైనా సంతాపం తెలుపుదాం. (ప్రజాప్రతినిధులు పాపం బిజీ కదా!)

**ప్రతి దానికి ఒక లెక్కుంటుంది.. లేకుంటే తిక్కెక్కుతుంది..
మరో ఆచ్చెర్ర్యం ఏమిటో గమనించారా? సమైక్య్యాంధ్ర కోరుతున్న సీమాంధ్రలో మిగిలినవి 13 జిల్లాలు. మళ్ళీ మరోసారి తీన్ తేరా..అదే వాళ్ళ మల్ల గుల్లాలు. గ్రహ అనుగ్రహాలు తెలిసిన గోదారి ఘనాపాటి కదా ఉండవల్లి.. అందుకేనేమో ఖమ్మం జిల్లాను అటువైపు తరలించాలట..కొత్త మాట మొదలెట్టాడు. అప్పుడు కూడా పవర్‌ఫుల్ ఇక్కడ మిగిలే నవగ్రహాలని(తొమ్మిది జిల్లాలు) ఆయన లెక్కేసుకోలేదు.. పాపం పెద్దమ్మ ఆ(వ)(గ్ర)హిస్తే ఏ గ్రహం అనుగ్రహం చూపదు..ఇక గృహమే కదా స్వర్గ"సీమ"!!

24-10-13
**"సూర్య" అనే ఈ పత్రిక ఒక్కటి చాలు.. పత్రికా ప్రపంచాన్ని భ్రష్టు పట్టించేందుకు. సమాజాన్ని నాశనం చేసేందుకు..పత్రిక పుట్టుక నుంచి నేటి వరకు నడచిన అధ్యాయాలు గమనిస్తే ఎన్ని అపభ్రంశపు అడుగులో...

23-10-13
** రాజకీయ జోక్యాల వలన పోలీసింగ్ రాష్ట్రంలో నిర్వీర్యమై అయిదేళ్ళయింది. నగ్జలైటలతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు "అన్నలకు" మన పోలీసు ప్రబుద్ధులు వినతిపత్రాలిచ్చారు గుర్తుందా అందరికీ. ఇక మనం ఈ పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం గొంగట్లో తింటున్నామని గుర్తుంచుకోవాలి. అధికారానికి ఖాకీలు దాసోహమంటున్నంతకాలం ఇంతే! జంటనగరాల్లో నేరస్తులను ఎటూ అదుపుచేయలేరు.. కనీసం ఆటొడ్రైవర్లను కూడా నియంత్రించలేని పరిస్థితి. వసూళ్ళలో మునిగిపోతున్నారు మరి.

**కారాగారాల్లో ఉండవలసినవాళ్ళు సచివాలయాలకు ఎగబడుతున్నారు.. పాపులు పాలకులు కావాలని ఆత్రుత, కంత్రీలు మంత్రిపదవులకు గాలం వేస్తున్నారు.

21-10-13
**కాపీ(నం)హక్కు దారులు ఎక్కాల బుక్కులు అచ్చేయించుకుని అవార్డులకోసం వెంపర్లాడుతున్నారు తెలుసా మీకు. రాతగాళ్ళు, కూతగాళ్ళు (కలాలు, గొట్టాలు)భావచౌర్యం సొంతం చేసుకుని చిల్లి గవ్వకు చెల్లని సత్తు ముఖాలు సమాజంలో మేధావులుగా చెలామణి అవుతున్నారు....

**నా వార్తలు నా ఇష్టం - అంటే ఇదే!! (My news.. my views.. my will..)See a blatant distortion of news. All print media carried the news item stating that CM had stated that he would stop the "division cyclone" with the help of people. What he really said was different even according to "The Hans India" which carried a distorted version..Hans carries the rejoinder on its first page (22-10-13).

**కొత్త కులాలు అందలం ఎక్కుతాయో లేదో తెలీదుకాని మన పాత కలాలు, గొట్టాలు తమ ప్రవృత్తిని తాకట్టు పెట్టుకోవడమే కాకుండా బానిసలై వృత్తిని పణంగాపెట్టి గెలిపించడానికి నానా యాతన పడుతున్నారు. ప్రేమ ప్రాంతం మీద, కులం మీద కాకపోవచ్చు .. పైసా మే పరమాత్మా హైన్!

**
**పొరబాటున బాబు సి ఎం అయితే మొదత సాష్టాంగ పాద ప్రణామం చేసేది కలంకుల కార్లే..


20-10-13
**అశోకుడి ఉద్యమ ప్యాకేజ్ విలువ అక్షరాల "కోటి" రూపాయలట..తిలాపాపం తలా పిడికెడు..ప్రసార సాధనాలవెప్పుడూ స్తోత్రపాఠాలు లేదా తిట్ల పురాణం..కొత్తేముంది.. ప్యాకేజీ ప్రభావం..

**కమ్యూనిజమంటే కాదుకానీ కొందరు కమ్యూనిస్టులంటే నిజంగా నాకు గిట్టదు. కాని కేర్ ఆస్పత్రిలో నిన్న రాత్రి కన్ను మూసిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి(వైఆర్కే)కు నేను అభిమానిని. ఆయన ఒక ప్రజావైద్యుడు. ఒక శ్నేహ శీలి. కుండబద్దలుకొట్టినట్లు చెప్పే వాదాలను ఆయన మెచ్చకున్నా మనసారా అహ్వానిస్తారు. ఆయన ఒక సైధ్ధాంతిక ఉపన్యాసకుడే కాదు. ఒక ఉత్తమ శ్రోత. నిగర్వి. ఒక కమ్యూనిస్టునాయకుడిగ-ఒక పాత్రికేయుడిగా మా ఇరువురికి 15 సంవత్సరాలకు పైబడి మంచి స్నేహబంధం...రాజ్యసభకు అర్హుడైన నిజమైన మేధావి. రాష్ట్రానికి ఖమ్మం జిల్లా ప్రసాదించిన అరుదైన విశిష్ట వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన మరణం మిత్రకోటికి బాధాకరం. మా ఇరువురి పేర్లు ఒకటి కావడం కాకతాళీయమైన అనుబంధం.. ఒక మంచి వ్యక్తి శాశ్వతంగా అదృశ్యమైపోయారు. ఆయన మంచితనం అజరామరం..

**మనం పాదాక్రాంతమై, దెయ్యాలైన కఠిన శిలలకు మొక్కుతున్నంతకాలం తప్పకుండా మనది డెమొనాక్రసీనే.. ఏమాత్రం అనుమానంలేదు. శిరసు వంచడం మినహా బానిసబతుకులకు మరో మార్గం లేదు. కమండలం ఇప్పించనంతకాలకాలం దండాధారులదే కమాండ్..

18-10-13

**గళం మూగవోయింది, కలం ఇంకిపోయింది, రాత ఆగిపోయింది.. ఊపిరి నిలిచిపోయింది..రావూరి వెళ్ళిపోయారు....చలం దగ్గరకు పాకుడురాళ్ళ మీదుగా  నడుచుకుంటూ.... 'జ్ఞానపీఠ్' విజేతకు అక్షరాంజలి.. అశృతర్పణం..

**తీన్ తేరా ఆఠ్ అఠారా.. అంటారు.. అంటే ఇక అంతే సంగతి అని అనుకుంటా..
మన సీ(చీ)మ ఎంపీల పని అంతే. ఫట్..పదముగ్గురు ఎంపీల రాజీనామ స్పీకర్ తిరస్కరణ..ఇక మిగిలింది ప్రజా తిరస్కరణ.. డ్రాజీనామా బాగుంది..
తేరీ మన్‌కే తెలంగాణా.. మేరీ మన్‌కే సమైక్యాంధ్ర.. బోల్ సోనియా బోల్ సమైక్యం హొగాకే నహీ...
నహీ... కబీ నహి...
**రాజీనామాలు సాధించలేనివాళ్ళు ఇక సమైక్యాన్ని ఏం సాధిస్తారు..
**నవ సమా(జ)ధి నిర్మాతలు మన నేతలు.. రానున్న ఎన్నికల గుర్తు : సమాధి
**కొందరు కారణ జన్ములు..వారు సాకారులు. మరి కొందరు అకా"రణ" జన్ములు.. వారు నిరాకారులు.. మరింత వికారులు..
17-10-13
**ఆంధ్రా "అశోకుడు" చెట్లు పీకించెను, రోడ్లు తవ్వించెను, చెరువులు పూడ్పించెను, స్కూళ్ళు మూయించెను, బస్సులను ఆపెను, కార్యాలయములకు తాళము వేయించెను, ప్రజలను కష్టముల పాల్జేసెను, యుద్ధము మాన్పించెను(సమ్మె ఉపసంహరించుకొనెను..). ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా పొందెను.. రాష్ట్రపతిపాలన హెచ్చరిక ప్రభావమా?

**మూడురాష్ట్రాల ఏర్పాటప్పుడు అక్కడ ఎన్జీవోలు సమ్మెలు చేయలేదే, మంత్రులు ముఖ్యమంత్రులను  తూర్పారబట్టలేదే.. ఎంపీలు రాజీనామా డ్రామాలాడలేదే, రాష్ట్ర మంత్రులు సచివాలయాలు వదలి డిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే, చానళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే.. 

1 comment:

  1. బాగున్నాయి మీ గరం మసాలాలు.

    ReplyDelete