Thursday, 4 September 2014

                               గురుభ్యోన్నమః 


                                     
                                       నేడు ఉపాధ్యాయ దినం. స్మరించుకుందాం. 

                 ఒక తత్వవేత్తను-మేధావిని- బహుముఖ   ప్రజ్ఞాశాలిని. 
---------------------------------------------------------------------------------------------
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బతుకుతెరువు చూసుకుంటూ సమాజం బతుకు బాటను సన్మార్గంలో పేట్టే ప్రతివ్యక్రీ ఉపాధ్యాయుడే!  పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

భారత దేశం గర్వించదగిన ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 ,సెప్టంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణి లో సామాన్య కుటుంబంలో జన్మించాడు. తండ్రి వీరాస్వామయ్య తహశీల్దార్. తల్లి సీతమ్మ. ఆయన పాఠశాల విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరులో సాగింది. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీనుండి ఏం.ఏ పట్టా పొందారు. బాల్యం నుండే అసాధారణ మైన తెలివితేటలు కల్గివుండేవారు. 16 సం. వయస్సులో 10 సం.ల బాలిక శివకామమ్మతో వివాహం జరిగింది. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో సీటు వచ్చినా,ఇంగ్లండ్ వెళ్ళి చదివేందుకు డబ్బులేక మానుకొన్నారు. 1909 లో 21 సం. వయస్సులో కుటుంబాన్ని పోషించేందుకు మద్రాస్  ప్రెసిడెన్సీ కళాశాలలో ఆసిస్టంట్ లెక్చరర్  గా ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అదే ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కాలంలో ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మ సూత్రాలు, బౌద్ధ,జైన మత గ్రంథాలు బాగా అధ్యయనం చేశారు. వీటితోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాలను , ఆంగ్లసాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి ఆంగ్లభాషపైన, తత్వశాస్త్రము పైన మంచి పట్టు సాధించారు.

ఈయన ప్రతిభను గుర్తించి మైసూరు విశ్వవిద్యాలయం 1918లో ప్రొఫెసర్ గా నియమించింది. రాధాకృష్ణన్ ప్రసంగాలు విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకొనేవి . విద్యార్ధుల పట్ల ప్రేమ,వాత్సల్యం కల్గి వుండేవారు. 1921 లో అశుతోష్ ముఖర్జీ , రవీంద్రనాథ్ ఠాగోర్ ఆహ్వానంపై కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరారు.  మైసూర్ యూనివర్సిటీ లో ఘనంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పడానికి విద్యార్ధులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన ఇంటిముందు గుర్రపు బండి సిద్ధంగావుంది. బండికి కట్టిన గుర్రాలను తొలగించి, రైల్వేస్టేషన్ దాకా బండిని విద్యార్ధులే లాక్కొని వెళ్లారు. అది విద్యార్ధులలో ఆయన పట్ల ఉన్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల అభిమానానికి రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనాడు గురుశిష్యుల హృదయాను బంధమం ఆవిధంగా ఉండేది.

కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉన్న రోజుల్లో ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం వ్రాసి పాశ్చాత్య పండితుల ప్రశంసలు పొందారు. దీనితో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిప్లేక్సన్, రికవరీ ఆఫ్ ఫేత్, కాన్సెప్ట్  ఆఫ్ లైఫ్,దిహిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈ స్టెర్న్  రెలిజిన్స్ అండ్ వెస్టర్న్ థాట్  ఆయన రచనలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పై వెళ్ళి ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలలో ప్రాచ్యతత్వ శాస్త్రం పై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయనకు అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ఇచ్చి సత్కరించాయి.

1931 లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలరర్‌గా  నియమితులయ్యారు. అదే సంవత్సరంలో లో నానాజాతి సమితి ఇంటలెక్చువల్ కొ ఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1946 లో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు.1949 లో ఉన్నతవిద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రాధాకృష్ణన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.  1952 నుండి 1962 వరకు భారత తొలి ఉపరాష్ట్రపతి గా పదవినలంకరించారు. బాబు రాజేంద్రప్రసాదు తర్వాత 1962 నుండి 1967 వరకు రెండవ భారత రాష్ట్రపతి గా పదవిని చేపట్టారు. 1954 లో  భారతరత్న పురస్కారం లభించింది. 1956 లో భార్య మరణించింది. వీరికి సంతానం 5 గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.శేష జీవితం మద్రాస్ లోని స్వంత ఇంట్లో గడుపుతూ 1975 ఏప్రిల్ 17 న పరమపదించారు.

చక్రవర్తి థార్మిక తత్త్వవేత్త అయి వుండాలన్నది గ్రీకు తత్త్వవేత్త ప్లాటో ఆశయం. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశానికి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్టప్రతి కావడంతో ప్లాటో ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. ఆచార్యుడుగా విద్యావేత్తగా రాయబారిగా రాజనీతిజ్ఞుడుగా రచయితగా అసమాన తత్త్వవేత్తగా ప్రపంచ ఖ్యాతినందిన మహాపురుషుడు రాధాకృష్ణన్. సర్వమానవ సౌభ్రాతృత్వంకోసం, స్వేచ్ఛా సమానత్వాలకోసం నిబద్ధతతో అంకితభావంతో ఆయన చేసిన విశిష్ఠ సేవలు సమున్నత వ్యక్తిత్వానికి దర్పణాలు. రాధాకృష్ణన్ ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదు. సంభాషణల్లో ఎవరినీ నొప్పించిన ఘటనలు లేవు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన గాంభీర్యం, హుందాతనం చూసి అపరిచితులు తొలుత ఆయనను పలకరించడానికి జంకేవారు. తదుపరి పసిబిడ్డవంటి మృదుమధుర స్వభావాన్ని చూసి విస్తుపోయేవారు.

ప్రపంచ దేశాల మత, సామాజిక సాంస్కృతిక రాజనీతి శాస్త్ర సాహిత్యాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న మహామేధావి రాధాకృష్ణన్. నేటి వైజ్ఞానిక యుగంలో, భౌతిక విజ్ఞానాన్నీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ సమన్వయపరుస్తూ దేశ విదేశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ మేధావుల ప్రశంసలను చూరగొన్నాయి. ప్రత్యేకించి వేద వాఙ్మయాన్ని మధించి శోధించి సాధించిన జ్ఞానామృతాన్ని తనదైన వ్యాఖ్యానాలతో పామరులకు సైతం అర్ధమయ్యేట్లు అందించారు. ఉపనిషత్తులపై, భగవద్గీతపై భారతీయ పురాణేతిహాసాలను తత్త్వశాస్త్ర సంపుటాలుగా ప్రచురించి ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు వివిధ భాషల్లోకి.

[2014 సెప్టెంబర్ నెల "క్షత్రియప్రభ" లో ప్రచురితమైన నా వ్యాసం. ]

No comments:

Post a Comment