Saturday, 9 November 2013

నవరస భరితం..నవంబరు నవనవోన్మేషం.. 
బయటి గోడు పాటు జర్నలిస్టుల గూడు కూడా... 

9-11-13
**12 గంటల వ్యవధిలో జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్) ఎన్నికలు
-------------------------------------------------------------------------------------------
కూడు కోసం రోజూ పాట్లు పడుతున్నాం.. ఇది జీవితకాలం జరిపే ఒంటరి పోరు... గూడుకోసం మన గోడును ఎవరూ పట్టించుకోరు. మనకోసం మనమే నడుము బిగించాలి. ఇది కలసికట్టుగా చేయవలసిన కార్యక్రమం.. ఏమి జరుగుతున్నదీ.. ఎలా జరుగుతున్నదీ స్ఫటికసదృశంగా చూపే ప్రాతినిధ్యం అవసరం. ప్రతి జర్నలిస్టు రక్తం ధారపోసి గడించి కూడబెట్టిన రెండులక్షల రూపాయల నగదుకు రక్షణ కావాలి. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (హైదరాబాద్)కి కేవలం 12 గంటల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు విలువను గురించి మనం నిత్యం ప్రజలకు బోధలు చేస్తాం. మరి మన ఓటు మనం వేస్తేనే కదా.. మనం ప్రశ్నించగలిగేది.
ఆరేళ్ళలో ఇది మొదటి సారి అందివస్తున్న అవకాసం. స్థలాలు నెరవేరని కలలుగా మిగలకూడదు.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎన్నుకోవాలి. ఎవరి ఆలోచన వారిది అది ముఖ్యం.. ఈ నిర్ణయంపై మన భవిష్యత్తు ఆధార పడిఉంటుంది..అయిదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మంది బరిలో ఉన్నారు. అందరూ మన పాత్రికేయులే, మిత్రులే..
అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా!!!!

**Started with clouds, drizzling, rain, low pressure, depression, downpour, cyclone, thunders, hailstorm, floods, gales, 12th number signal..Spl Task Force on its toes...[starts crossing shore by 9 am tomorrow and over by 4 pm..] It is all the weather report of Jawaharilal Nehru Journalists Mac Housing Society (Hyd) Directors elections.

**నవ్వే వాళ్ళను నవ్వనీ.. ఏడ్చే వాళ్ళను ఏడవనీ.. నవ్వే వాళ్ళ అదృష్టమేమని ఏడ్చేవాళ్ళను ఏడవనీ!!  ఈ ఆ పాత మధురం ఎంత తియ్యన.. ఇది అన్నికాలాలకు వర్తిస్తుంది కదూ..

8-11-2013
**విలక్షణ హాస్య నటుడు 'అదో తుత్తి" ఎ వి సుబ్రహ్మణ్యం నాకు 1985 నుంచి పాత్రికయ మిత్రుదు..రచయిత. నేను గుంటూరు "ఉదయం" ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవిఎస్ తెనాలి ఉదయం రిపోర్టర్ గా చేరాడు. సంవత్సరంలో బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత నేను ఆంధ్రజ్యోతి లొ చేరి హైదరబాద్ వచ్చినప్పుడు అతను కూడా అంధ్రజ్యోతి తెనాలి రిపోర్టర్ గా చేరాడు. కళాకారుడు.. హస్య ప్రియుడు.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆఫీసుకు వచ్చి గంటల తరబడి హాయిగా అందరినీ నవ్వించేవాడు. తరువాత సినిమాల్లో చేరి నిలదొక్కుకున్నాడు. రామినేని ఫౌండషన్ తరఫున వార్షిక అవార్డులను ఎవిఎస్ ప్రకటించేవాడు.. హైదరాబాద్ లో రెండు పర్యాయాలు ఇంటికి కూడా వచ్చాడు. ఒక మంచి హాస్యప్రియ మిత్రుణ్ణి కోల్పొవడం బాధాకరం.. RIP

**నమ్మరాదు నమ్మరాదు .. అమ్ముడుబోయే మిడిమేలపు మీడియాను నమ్మరాదు.. నేను ఈ సంగతి ఎప్పటినుంచి చెబుతున్నానో మిత్రులు ఒక్కసారి భూతకాలంలోకి వెళ్ళండి. చిరంజీవి కాలు ఐరన్ లెగ్ అని ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమప్పుడే వ్యాఖ్య పెట్టాను. కాంగ్రెస్ కు అంత్యకాలమని చెప్పినట్లే జరిగింది. ఈయనమీద నమ్మకం పెట్టుకుని సోనియా తనను కాంగ్రెస్ లోకి అహ్వానించారని చెప్పుకున్నాడు చిరు. ఇప్పుడేమో చిర్రు బుర్రు.. ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయిందనే సామెత కరెక్ట్. సామాజిక న్యాయం.. సామాజిక తెలంగాణా.. అంటే అర్ధం అయిందా ఎవరికైనా..ఇప్పుడు సామాజిక కాంగ్రెస్..కాంగ్రెస్ ప్రయాణం జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ....

7-11-13
**"జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ"(హైదరాబాద్) ఎన్నికలు..
--------------------------------------------------------------------------------------------------
చూశారా మిత్రులారా! ఎన్నికల ప్రభావం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 1105 మంది జర్నలిస్టులు ఆరేళ్ళకిందట ఏర్పరచుకున్న "జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌజింగ్ సొసైటీ" కి మొదటి సారి డైరెక్టరల ఎన్నికలు జరుగుతున్నాయి.
అంటే ఆరేళ్ళుగా ఎన్నికలు లేకుండా నడిచిందన్నమాట. పంచాయితీలకు గాని, మునిసిపలిటీలకు గాని, కార్పొరేషన్లకు గాని ఎన్నికలు నిర్వహించడంలో ఆర్నెల్లు ఆలస్యమైతే ప్రపంచం కూలిపోతున్నదన్నట్లు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసేవాళ్ళు, గంతల తరబడి విశ్లేషణలు చేసేవారు ఆరేళ్ళుగా ఎందుకు ఎన్నికలు జరుపుకోలేదని, కోట్ల రూపాయల నిధులున్న సొసైటీ ఎవరు నిర్వహిస్తున్నారని ఎవరు ప్రశ్నిస్తారు. ఎవరు అడుగుతారు.? ప్రభుత్వంలో పారదర్శకత గురించి నిలదీసే జర్నలిస్టులు ఎంత పారదర్శకత ప్రదర్శించారు.
సొసైటీలో ఎవరు దేనికి బాధ్యులో తెలీకుండా ఆరేళ్ళు నడిచిందంటే ప్రజలకు ఉపదేశాలు చేసే పాత్రికేయ మేధావులు ఎందుకు మౌనం వహించారు. అనేక సొసైటీల్లో అవకతవకలు జరిగాయని కోడైకూసే రాతగాళ్ళూ మినహాయింపుకాదని ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతే ఎవో కుంభకోణాలు జరిగాయని మాత్రం కాదు. పారదర్శకత లేకుంటే అనర్థాలు ఏర్పడతాయని మాత్రమే చెబుతున్నాను.
జర్నలిస్టుల్లోనూ గ్రూపులున్నాయన్నది బహిరంగమే. అనేక కమిటీల్లో అనేక సంవత్సరాలుగా గుత్తాధిపత్యం సాగుతున్నదంటూ రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభావాలాకు, ప్రలోభాలకూ గురికాకుండా పాత్రికయ వర్గానికి న్యాయం జరిగేలా చూసుకోవలసిన కర్తవ్యం అందరిదీ.. కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించుకోవలసిన నైతికత మన జర్నలిస్టులది..ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక కోసం 14 మందికి పైగా బరిలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ అనుబంధాలకు దూరంగా ఉండాలి. విజ్ఞతతో ప్రతినిధులను ఎన్నుకోవాలి. 1105 మంది భవిష్యత్తు జీవనం ఆధారపడిఉంది. అందరూ రెండు లక్షల రూపాయలు చెల్లించిన వాళ్ళే!! కొందరు అకస్మాత్తుగా తెరమీదకు వస్తున్నారు. కొందరు ప్రచ్ఛన్నంగా ఉంటున్నారు. వివేకంతో ఆలోచించాలి.
ఈనెల 10 వతేదీన హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్. అందరూ హక్కు వినియోగించుకోవాలి. ఈ అభ్యర్ధన ఎవ్వరికీ వ్యతిరేకమూ కాదు.. అనుకూలమూ కాదు..
**ప్రచార పటోటోపాలు ఎక్కువతే బొమ్మ ఎప్పుడూ బోర్లా పడుతుంది.. ఇది చరిత్ర చెబుతున్న పాఠం..కలం కత్తి అనుకుని నమ్ముకుంతే అది కుత్తుకలు కోస్తుంది..ఎందుకంతే బొద్దుబారిన కత్తికి ఎందరో "సాన" పెడతారు. ఎవేరి ఉపయోగం కోసమ వారి తంటా!!
**విభజన విషయమై చర్చకు అయిదు పార్టీలనే పిలిచిందట కేంద్రం..మీడియాలో కొందరు తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 100 మీడియా సంస్థలనూ అహ్వానించకపోవడం..అప్రజాస్వామికం కదూ.. నాయకులకు పాకేజీ సలహాలు ఇచ్చేవరికి తృణమో పణమో దక్కకపోవడం విచారమే!!

6-11-13
****ఒక్క విషయం కాదు.. అన్నీ అంతే! జనాలను బలవంతంగా నమ్మించడానికే కదా పొద్దున్నే టీవీల్లో రాజకీయ రామంధాళి..చర్చల చిచ్చు.. ప్రాణాలు పణంగా పెట్టడానికి వీక్షకులు ఎవరూ ఇష్టపడడంలేదు. "పొద్దున్నే ఆ పాడు టీవీ పెట్టి ప్రాణాలు తోడకండి.. పగలూ రాత్రుళ్ళూ అదే గోల చస్తున్నాం", అని ఈ మధ్య ఇళ్ళలో తిట్లు శాపనార్ధాలు..
**సమైక్యంకోసం చచ్చిపోతామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు పాకేజీల జాబితాను సిద్ధం చేశారట.. పాపం ఎంపీలు కూడా క్యూల్లో నిల్చున్నారు..
** రాష్ట్ర దేశ రాజకీయాలను, ప్రభుత్వాలను(ప్రజలను) శాసించే స్థాయికి ఒక గుమస్తా ఎదగడం ఎంత గుణాత్మకమైన మార్పు!!
**నిన్నొక మాట, నేడొక మాట, రేపొకమాట చెప్పే పార్టీ కాదు మాది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.-విభజన ఆగిపోవాలని కోరుకుంటున్నా: బొత్స. అవును పూటకోచోట - మనిషికొక మాట చెప్పే పార్టీ మీది.  సిడబ్ల్యుసి శిరోధార్యమైతే విభజన ఎలా అగిపోతుందో?
**తాడూ, బొంగరం లేని లక్ష్మిపార్వతికి కూడా రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం లభించడం ఎంత గర్వకారణం.
**విశాలాంధ్ర మహా సభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, పేటకో జేఎసి.. ఎన్ని స్వయం ఉపాధి మార్గాలు?
**ప్రధానిని కలిశాం, రాష్ట్రపతిని కలిశాం, సోనియాను కలిశాం, రాహుల్ ను కలిశాం, చిదంబరం ను కలిశాం, షిండేని కలిశాం.. రాష్ట్రంలో తాజా రాజకీయ, శాంతిభద్రతల గురించి వివరించాం. వారు శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు. తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రయత్నాలు ఇలాగే సాగుతాయి..--
వీరికి పనిలేకపోతే డిల్లీలో వారికీ పనిలేదా..తలుపులు బార్లా తెరుచుకుని ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నట్లున్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉందా??

5-11-13
**"కేంద్రంలో ఎవరూ కెవిపి గారి సమైక్యాంధ్ర గోడు వినడం లేదని" పాపం ఒకానొక సమైక్య సీనియర్ పాత్రికేయుడు ఇవ్వాళ మధ్యహ్నం ఎంతగానో బాధపడిపోయారో. ఈ కింది మాటలు ఆయనవే.---
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావు కోరారు. ఆయన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం పురోగతి సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దశలో కెవిపి విన్నపాన్ని వినేవారు ఎవరుంటారు.--- (చూడండి రాజకీయనేతలు, పాత్రికేయుల అవినాభావ సంబంధం అలాంటిది..)
**సమైక్యమైనా. ప్రత్యేకమైనా బాదుడు సామాన్యులకే అని అర్ధమైందా! సమ్మెలు చేసిన ఆర్టీసి కుటుంబాలకి ఎటూ ఫ్రీ పాసులే. వాళ్ళకేమీ నష్టం ఉండదు. చేయించిన ప్రజా ప్రతినిధులది ఎప్పుడూ బైరాగి టిక్కెట్టే, అశొక్ జ్ఞానిది ఆకాశపయనమే.. ఎటూ చిక్కులు సామాన్యులకే. మళ్ళీ రాజకీయ పార్టీలు చార్జీల పెంపుదలపై ఆందోళనలు.. నడ్డి విరిగేది ఎవరికి?

4-11-13
**సమైక్యంకోసం ప్రాణాలిస్తాం, తెలంగాణ అంగీకరించబోమని ప్రతిజ్ఞలు చేసిన కర్నూలు, అనంతపురం ఉత్తరకుమారులు ఇప్పుడు తెలంగాణాలొ తమను "నిమజ్జనం" చేయాలని కాళ్ళా వేళ్ళా పడుతున్నారు..చీ! సిగ్గులేని రాజకీయం.
**సంతోషం ఏమిటంటే నాకు ముఖతః, ముఖపుస్తకంలోనూ మిత్రులు పరిమితం. మిత్రులందరూ ఆప్తులు, సహృదయులే..ఏఫ్‌బి లో మిత్రుల సంఖ్య నేడు ముచ్చటగా మూడార్లకు చేరింది.(666)

2-11-13
**గాంధీ భవన్ లు ఎప్పుడో బ్రాందీ భవన్లయ్యాయ్..మహాత్ములకు మగానుబావులకు తేడా ఉందండి..లక్షాధికారుల కొడుకులే కోటీశ్వరులు అవుతారు..మంత్రుల సంతానం ముఖ్యమంత్రులవుతారు, నిరక్షర కుక్షులు నిచ్చెనలెక్కుతారు..
**వంట గ్యాస్ ధర తగ్గింది:- వార్త
అంతా గ్యాస్. అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆమాత్రమయినా తగ్గక పొతే "బండ" పడుతుందన్న భయం.. తరువాత ఎలాగూ మంటే:- ఇది వాత

1-11-13
** సినిమా హీరోయిన్లందరూ తెలుగొచ్చిన వాళ్ళేనా? తెలుగు చానళ్ళలో పని చేసేవారందరికీ తెలుగు వచ్చా? రాజకీయాలకు భాష అనవసరం..భరోసా ఉంటే అదేచాలు..
-----------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment