Sunday 12 April 2015

తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి: ఏబికె..
-----------------------------------------------
ఆ మార్గదర్శకత్వం లోనే కొత్తగా... వన్ న్యూస్ (తెలుగు)చానల్..
---------------------------------------------------------------------
ఏబికె ప్రసాద్.., అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్‌ జన్మదినం ఆగస్టు 1 . 1935.  అంటే తెలుగునేలపై దాదాపు అయిదు  దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం. ఆయన "జర్నలిస్టులను - ఎడిటర్లను" తయారు చేద్దామనే తపనలో తహతహలో ఎన్నో అపాత్రదానాలు చేశారు. ఆ ఫలితంగా ఎర్నలిస్టులు-సంపాదకులు ఎదిగారు. కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయనకూడా.... ఎందుకంటే ఆయన రాజీపడడు. పడి ఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. కోటిరూపాయల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. కొందరిలా...
కృష్ణా  జిల్లా పునాదిపాడులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై కొద్దికాలానికే బయటికొచ్చేశారు. నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవారు. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరారు. తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌. ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. ‘జనశక్తి’ సంపాదకుడిగా అనేక కేసులు నమోదయ్యాయి.  జైలుకెళ్లారు.
ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ఆయన ప్రారంభ సంపాదకుడు కూడా.  కొత్తగా పత్రిక పెట్టే వారికి ఆయన సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత  ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం ఆయనకిష్టం లేదు. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవారు కాదేమో.
తెలుగునేలపై ఒక కొత్త పత్రిక రావాలంటే ఏబికే మనసులో ఆలోచన పురుడు పోసుకోవాలి.  ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్లు, మంత్రసానులు, మందులు, శస్త్రచికిస్త్స సామగ్రి.. ఇలా అన్నీ ఆయన ఎంపికే.. మంచి పనిమంతుదని తలచి బృందంలో కలుపుకుని.. నిఖార్సయిన జర్నలిస్టని నమ్మకం పెంచుకుని బాధ్యత అప్పగిస్తాడు. తాను పుస్తకాల్లో.. చదువులో... రాతల్లో.. అధ్యయనాల్లో మునిగిపోతాడు. అందరినీ నమ్మేస్తాడు (నమ్మదగని వాళ్ళని ముఖ్యంగా..). ఇక తన ప్రపంచంలో  మునిగిపోతాడు. యాజమాన్యంతో రాజీ పడడు, రాజకీయంతో రాజీ పడడు. తనతో తనే రాజీపడడు.. రోజులు, నెలలు.. మహ అయితే మూడు, నాలుగేళ్ళు సాఫీగా సాగిపోతాయి..   ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలనుకూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి.  
ఆయన అందలం ఎక్కించినవాళ్లందరూ ఆయన్ను నెట్టేసారు. ఆయనే లేకుంటే ఇందరు జర్నలిస్టులుగా బోర విడిచి ఈ నేలపై తిరిగేవాళ్ళుకాదు. ఆయన సమైక్య వాది. ప్రజల మనిషి. కులాలకు, పార్టీలకు అతీతుడు. ఏకొత్త మాధ్యమం మొదలవ్వాలన్నా ఏబికె చేయి పడాల్సిందే.. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు ..అన్నీ మూసలోనుంచి బయటపడి కొత్త దారిపట్టాయి. జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన ఒక మార్గదర్శి. అభిమాని. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రభలో, ఉదయంలో, వార్తలో, ఆంధ్రభూమిలో... ఎందరో ఆయన్ను ఆశ్రయించి చేరారు. ఆయన్ను పక్కకు నెట్టేసి పత్రికాస్థానాల్లో పైస్థానాలు  అలంకరించారు.
తెలుగు భాష కు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు.
చిన్నపత్రికైనా.. పెద్ద పత్రికైనా.. ఆయనకు ఒకటే. దేనికైనా రాస్తారు ఆయన... కాలాన్ని, కలాన్ని నమ్ముకున్న ఒక కాలమిస్టు. ఆపర్చునిస్టు మాత్రం కాదు.  ఇప్పుడు 80వ దశకంలో "వన్ న్యూస్"-తెలుగు కొత్త వార్తా చానల్‌కు ఎడిటోరియల్ నాయకుడు. ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలనుకూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి.
 నాకలాన్ని సానపట్టింది, ధైర్యం నూరిపోసింది ఆయనే..నేను ఇప్పటికీ ఆయన అభిమానినే.. ఉదయంలో రెండేళ్ళు.. నేరుగా ఆయన సారథ్యంలో, తరువాత ఓ రెండేళ్ళు మాత్రమే ఆంధ్రజ్యోతిలో ఆయనతో కలసి పనిచేశాను.  ఆయనపై నా ఫిర్యాదు ఒక్కటే. ఆయన మోసగాళ్ళను తేలికగా నమ్ముటాడు. వలలో చిక్కుకుపోతాడు. దాంతో ఆయనను నమ్ముకున్నోళ్ళు మునిగిపోతారు. ఆ తరువాత ఆయన జరిగిన పొరపాటు తెలుసుకుంటారు.. ఇంతలో పుణ్యకాలం అయిపోతుంది.. మళ్ళీ కథ మొదలు.. ఇది వృత్తం..   ఇతి వృత్తం....