Thursday 25 July 2013

19-7-2013 

                                                                                                         విష్ణుసహస్రనామం: (ప్రారంభం) 




శ్లో(1) విశ్వం విష్ణుః-ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః!
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః!!
తా: పరమాత్మయైన శ్రీ మహావిష్ణువు విశ్వకారకుడై విశ్వమునందు వ్యాపించి ఉన్నాడు. యజ్ఞపురుషుడు, త్రికాలజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభూతములను, ప్రాణులను సృష్టించి, పసుపతిగా పొషించి, ప్రళయకాలమున తిరిగి తనలోలయము చేసుకొనువాడు. ఆయన సత్యస్వరూపుడు.
శ్లో(2) పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః!
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవచ!!
తా: పవిత్రుడు, నిత్యుడు, మహోన్నతమైన మోక్ష స్థానము ఆయనే. సర్వప్రాణుల దేహములందుండి ఆయన సర్వసాక్షియై నిలిచిన వాడు. న్నశనము లేనివాడు, పురుషోత్తముడై, సర్వశరీరములనెడి క్షేత్రములను పూర్నముగ ఎరిగినవాడు ఆయనే.
శ్లో(3) యోగోయోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వరః!
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః!!
తా: ఆయన యోగస్వరూపుడై, యోగులకు మార్గదర్శకుడై ఉన్నవాడు. పురుషోత్తముడై, శ్రేష్ఠుడై, లక్ష్మిని లేదా మాయను ధరించి, త్రిమూర్తులను శాసించువాడు. ప్రకృతి, పురుషులకు అధిపతి, నారసింహావతార స్వరూపుడు ఆయనే!
శ్లో(4) సర్వః శర్వః శివః స్థాణు-ర్భూతాది-ర్నిధిరవ్యః!
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః!!
తా: సర్వము తెలిసియుండి, మంగళకరుడై, స్థిరుడై ఉన్నవాడు, తిరుగులేని అధికారము కలిగి సర్వజగత్తును తానే సృష్టించుచూ, ప్రళయకాలమున తిరిగి దానిని తనే ఐక్యము చేసుకొనుటవలన ఆయన నశింపని సంపదగలవాడు. ధర్మరక్షణ కొరకు అవతరించువాడు, జగత్తునుపోషించి, జీవులకర్మలకు ఫలములనిచ్చువాడు, కర్మలకు అతీతుడు ఆపరమాత్ముడు.
శ్లో(5): స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షోమహాస్వనః!
అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః!!
తా: ఆద్యంతములులేక స్వయముగ నుద్భవించి, ప్రపంచ భారమును మోయుచూ, జీవులను కర్మలకు ప్రేరేపించువాడు, శ్రేయోకారకుడు, ద్వాదశాదిత్యులలో విష్ణువు, కమలాక్షుడు,సర్వశ్రేష్ఠుడు, ఓంకార స్వరూపుదు ఆ పరమాత్మయే!
శ్లో(6):అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః!!  
     విశ్వకర్మా  మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరోధ్రువః!!
తా: ఆ మహాపురుషుడు ప్రమాణములకు, తర్కమునకు అందనివాడు. లోకాధారమగు కమలము నాభియందు గలవాడు. స్థిరుడు. ఇంద్రియములకు, అమరులకు, మనస్సునకు అధిపతి, సృష్టికర్త ఆయన. మహాబలుదు,పురాతనుడు, సర్వసంహారీ ఆయనే!
శ్లో(7):అగ్రాహ్యఃశాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః!
     ప్రభూత-స్త్రికకుబ్దామ పవిత్రం మంగళం పరం!!
తా: ఆయన శాశ్వతుడు. తెలుసుకొన వీలుగాని తత్వముగలవాడు.సచ్చిదానంద స్వరూపుడు. ఉగ్రస్వరూపుడై ప్రళయకాలమున సర్వమును నశింప జేయువాడు.త్రిలోకములందు వ్యాపించి సర్వోన్నతుడై వెలయువాడు. పవిత్రుడు, పవిత్రులను చేయువాడు,శుభకారకుడు ఆయనే.
శ్లో(8):ఈశానః ప్ర్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః!
     హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః!!
తా:సర్వమును అదుపుచేయువాడు, ప్రాణమునిచ్చువాడు, తీయువాడు,ప్రాణమే తానైన వాడు ఆ పరమాత్మ. సర్వులకు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, జీవకోటికి ప్రభువు, బ్రహ్మాండము గర్భమున ధరించిన వాడు, లక్ష్మీ విభుడు, మధుసూదనుడు ఆయనే.
శ్లో(9):ఈశ్వరో విక్రమీ ధన్వీ, మేధావీ విక్రమః క్రమః!
     అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!
తా:మహా శక్తి స్వరూపుడు, పరాక్రమవంతుడు, ధనుర్ధారి, మేధావి,వామన మూర్తి, సర్వత్రా సంచరించువాడు ఆయన. తనకన్న ఉత్తముడు లేనివాడు, ఎదిరించలేనివాడు, కృతజ్ఞుడు,ఆత్మస్వరూపుడు, మానవుని కర్మలకు ప్రేరేపించువాడు ఆ పరంధాముడే.
శ్లో(10):సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః!
      అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!
తా:సురేశ్వరుడు, శరణాగత రక్షకుడు, ఆనంద స్వరూపుడు, చైతన్య స్వరూపుడు, తేజోస్వరూపుడు ఆయన. ఎవరికీ వశము కానివాడై, కాలస్వరూపుడై విశ్వమును, అందలి ప్రాణికోటిని సృజించుచు, వానికర్మలకు సాక్షిగా నిలుచువాడు.
శ్లో(11):అజః సర్వేశ్వరః సిద్ధః సర్వాదిరచ్యుతః!
      వృషాకపి-రమేయాత్మా సర్వయోగ వినిః సృతః!!
తా: తనకు పుట్టుక లేకున్నను సర్వభూతములకు, జగత్తునకు ఆదిపురుషుడాయన. నిర్ణయించలేని విశిష్ఠమైన ప్రకృతి, ప్రవృత్తి కలిగి, బంధనాతీతుడై, జ్ఞాన స్వరూపుడై వెలుగొందువాడాయన. శాస్వతుదై, దేవదేవుదై వరాహ రూపమున భూమి నుద్ధరించినవాడు ఆ పరమాత్ముడు.
శ్లో(12):వసుర్వసు మనాః సత్యః సమాత్మాసమ్మితః సమః!
      అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః!!
తా: సర్వ జీవులయందు నివసించువాడు, ప్రశస్థమైన తత్వముగలవాడు, సత్యస్వరూపుడు, హృదయకమలమున వెలయువాడు, ఆ మహా పురుషుడు. అనంతుడు, సర్వమును సమముగా చూచువాడు, మాయా సమేతుడు, తిరుగులేని సంకల్పము గలవాడు, ధర్మ స్వరూపుడై ధర్మమును అవలంబించువాడు ఆయన.
శ్లో(13):రుద్రో బహుశిరా బభ్రు-ర్విశ్వయోనిః శుచిశ్రవాః!
      అమృతః శాశ్వతః స్థాణుః-ర్వరారోహో మహాతపాః!!
తా: ఆ మహాపురుషుడు సహస్ర శీర్షుడు, విశ్వసృష్ఠి చేయువాడు, విశ్వమును భరించువాడు, ప్రళయకాలమున విశ్వమును నశింపజేయువాడు, శ్రవణాననంద కరమైన చక్కని నామములు గలవాడు, అమృతస్వరూపుడు, నాశము లేనివాడు, జ్ఞానమే తపస్సుగా గలిగి మోక్షగాములపరమ గమ్యమై ఉన్నవాడు.
శ్లో(14):సర్వగః సర్వవిద్భాను-ర్విష్వక్సేనో జనార్దనః!
      వేదో వేదవిదవ్యంగో, వేదాంగో వేదవిత్కవిః!!
తా: సర్వప్రదేశములలో సంచరించుచు, దుష్టులను, విఘ్నములను దునుమాడుచూ, ప్రపంచమును ప్రకాశింపజేయువాడు ఆ మహాపురుషుడు. వేదవిదుడై, పూర్ణ జ్ఞానియై,  వేదస్వరూపుడై, వేద విచారణ చేయుచూ వేదజ్ఞానము నొసంగువాడు ఆయనే.
శ్లో:(15):లోకధ్యక్షఃసురాధ్యక్షో@, ధర్మాధ్యకఃకృతాకృతః!
       చతురాత్మా చతుర్వ్యూహ-శ్చతుర్దంష్ట్ర- శ్చతుర్భుజః!!  
తా: సర్వదేవతలకు, లోకములకు ప్రభువు, ధర్మమునకు ఆధారభూతుడు, కర్మలకు, వాని ఫలితంలకు కారకుదు ఆ  పరమాత్మయే. నాలుగు విధములుగా ప్రవర్తిల్లువాడు(అనగా నాలుగు వేదములు, నాలుగు యుగములు, ధర్మము సంచరిచంచు నాలుగు పదములు) ఆయనే., నాలుగు భుజములు గలవాడు, నరసింహావతారమున నాలుగు కోరలు గలవాడు, వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులనే నాలుగు వ్యూహ రూపములుగా ఉన్నవాడు ఆయనే.
శ్లో(16)భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||
తా: ఆయన కాంతిస్వరూపుడై లోకములను సృష్టించుచూ తిరిగి ప్రళయకాలమున వాటిని నశింపజేయును. జీవులయందు మళ్ళీ మళ్ళీ నివసించుచూ, ఆహార రూపమున ప్రాణులకు జీవశక్తి నిచ్చును. ఆయన సహనశీలి, పాప రహితుడు, విజయస్వరూపుడు, సవమును జయించిన వాడు.
శ్లో(17)ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||
తా: ఆయన మహాస్వరూపుడై, మహాబలుడై, జ్ఞానైశ్వర్యాదులచే ఇంద్రుని అధిగమించినవాడు. వామన స్వరూపుడై సదా విజయుడై అందరిలో అంతరాత్మగాయుండి, సర్వ భూతములను, దేవతలను,వారి వారి వ్యాపారములందు నియమించువాడు. సర్వమును సృష్టించుచు తిరిగి హరించుచు యున్నను, తాను మాత్రము మార్పులేని స్వభావము గలవాడు.
శ్లో(18)వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
తా: ఆ పరమాత్మ వేదములచే ప్రతిపాదింపబడినవాడు,జీవులకు ఆరోగ్యమునిచ్చువాడు, నిత్య యోగియై, మాధవుడై, ఇంద్రియంలచే గ్రహింపబడక మాయావియై నిలిచినవాడు. మహాబలుడై ధర్మ రక్షణకు సురులను వధించువాడు. భక్తులకు స్ఫూర్తినిచ్చు వారికి తేనెవలే ఆనందము కలిగించువాడు ఆ పరంధాముడు.
శ్లో(19)మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్||
తా: ఆయన మహాధీశాలి, తేజో స్వరూపుడు. అనంతమైన ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులతో బ్రహ్మాందమును, మాయను సృష్టించినవాడు. మహాపర్వతములను ధరించినవాడు. లక్ష్మీదేవికి మాన్యుడైనవాడు. నిర్దశింపరాని తత్వము, కిలుచుటకు వీలుగాని స్వభావము గలవాడు.
శ్లో(20)మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః|
అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||
తా: అమోఘమైన బాణముగలవాడు(శ్రీరాముడు).నిరోధింపజాలనివాడు, అసురసంహారియై దేవతలకు ఆనందమునిచ్చువాడు, భూదేవిని, శ్రీదేవిని ధరించినవాడు, సజ్జనులను, ఘొవులను రక్షించువాడు. విద్యావేత్తలకు ఆయనే ప్రభువు.
శ్లో(21)మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|
   హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః
తా: ఆ మహాపురుషుడు మహాతేజశ్వి, మహా తపస్వి, బ్రహ్మను నాభియందు గలవాడు, దుష్టులను దండిచువాడు, జీవునితో సర్వదేహములందు కలసి ఉన్న పరమాత్మ, సర్వ జీవులకు అధిపతి, హృదయకమలమున భాసిల్లువాడు, పక్షులలో గరుత్మంతుడు, నాగులలో ఆదిశేషుడు.. ఆయనయే.
శ్లో(22)అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః|
   అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా||
తా:జనన మరణములకతీతుడు, సర్వమును చూచువాడు,ప్రస్తుతింపదగిన స్వభావము గలవాడు, ఎల్లప్పుడు స్థిరముగ ఉండువాడు ఆ పరమాత్మ. నరసింహావతారమెత్తి రాక్షస సంహారము కావించిన వాడు, దుష్టులకు సింహస్వప్నము ఆయన. శాసించువాడు, సృష్టిని, జనుల కర్మమలను సంధానముచేసి కర్మఫలముల ననుగ్రహించువాడునూ ఆయనయే.  
శ్లో(23)గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః|
   నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||
తా: సర్వ విద్యలనుబోధించువాడు,గురువులకు గురువు,సర్వమును గ్రహింపగలిగిన ధీశాలి, వైజయంతిమాలను ధరించినవాడు, సర్వమునకు నివాస స్థానమై ఉండువాడు, సత్యస్వరూపుడు, వ్యర్ధముగాని పరాక్రమముకలవాడు, ఎల్లప్పుడూ జాగరూకతో ఉండువాడు, యోగనిద్రలో కనురెపలు మూసుకున్నవాడు ఆ పరంధాముడు.      
శ్లో(24)అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః|
   సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్||
తా: ఆ మహా పురుషుడుగొప్ప తేజస్సు గలవాడు, వాయురూపమున ప్రాణమునిచ్చువాడు, సర్వ జగత్తును, భూతములను నడుపుచూ భక్తులకు  తరించు మార్గము చూపువాడు.ఆయన వేద ప్రమాణములు చూపును. సహస్ర శీర్షములు, సహస్ర నయనములు గలిగి సర్వవేళలయందు సర్వమును వీక్షించుచూ సర్వ ప్రదేసముల యందు సంచరించుచు, విశ్వమంతకు ఆత్మగ నుండువాడు.
శ్లో(25)ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః|
   అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః
తా: ఆయన కాల చక్రమును, సంసార చక్రమును తిప్పుచూ జగత్తును మాయతో కప్పును. దుష్టులను మర్ధించిన వాడు, ఆది వరాహరూపమున భూమిని ధరించినవాడు, సర్వ బంధములకౌ అతీతుదై ఉన్నవాడు, అగ్నిరూపమున దేవతలకు హవిస్సుల నిచ్చువాడు, దినమును సృష్తించి ప్రాణులను మేల్కొల్పువాడు, వాయు రూపమున నిత్య సంచారిగా ఉన్నవాడు ఆ మాస్వరూపుడే.    
శ్లో(26)సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః|
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః||
తా: భక్త సులభుడు, ప్రసన్నాత్ముడు, విశ్వభారమును మోయుచు విశ్వమును పోషించువాడు, దుష్టులను దండించువాడు, ప్రళయకాలమున సమస్త జీవరాశులను సంహరించువాడు ఆ మహాత్ముడే. ప్రపంచాధిపతి, సర్వసాధకుడు, భక్తులకు మేలు చేయువాడు, కర్మఫలముల నొసగువాడు, పూజనీయుడగు  ఆ నారాయణుడే.
శ్లో(27)అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః||
తా: ఆయన లెక్కింపరాని గుణరూపములు, నామములు కలిగినవాడు. సర్వోత్తముడై ప్రమానములకందక, సాధకులకు ఫలమును, మోక్షమును, ప్రసాదించువాడు, పవిత్రుడు, సంకల్పించిన దానిని సాధించినవాడు, శిష్టరక్షకుడుకూడ ఆయనే.
శ్లో(28)వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|
వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||
తా: ఆయన ధర్మస్వరూపుడై, వేద స్వరూపుడై, సర్వ వ్యాపియై, దేనినీ అంటక యుండువాడు. వర్షముద్వారా ఆహారమునిచ్చి జీవులను వృద్ధిపొందించువాడు, ప్రపంచరూపమున తానే వృద్ధినొందువాడు.
శ్లో(29)సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః|
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః||
తా: ప్రపంచ రక్షణార్ధమై గొప్ప భుజములు, అనేక రూపములు, మహోన్నతమైన ఆకారము కలిగి ధరించుటకు లేదా భావించుటకు శక్యముకానివాడు, తనను తాను మాయచే కప్పుకొనినవాడు ఆ పరమాత్ముడు. వేదములను బోధించినవాడు, తేజోమూర్తి, యజ్ఞమూర్తి, దేవతలకు రాజు, ఐశ్వర్యమునిచ్చువాడు ఆయనయే.
శ్లో(30)ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః|
ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః||
తా: ఆయన ప్రానసక్తి, శౌర్యము, జ్ఞానముల స్వరూపుడై, సద్గుణ సంపన్నుడై, స్పష్టమైన ఓంకార మూర్తియై, మంత్రోపాసనవలన రక్షించువాడు. జ్ఞానమే తన ఆత్మగా గలిగి, సూర్యుని వంటి కాంతికలిగి, ప్రపంచమును తపింపజేసి మేలుచయువాడు.భక్తులకు చంద్రునివలె చల్లని వాడునూ ఆ పరంధాముడే.
శ్లో(31):అమృతాంశూద్భవో భానుః శశిబిందుస్సురేశ్వరః|
      ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః||
తా:చంద్రుని సృష్టించినవాడు, అమృతబిందువు వలే పోషించువాడు, సంసారమనెడి రోగ పీడితులకు ఆయన ఔషధము. సురేశ్వరుడు, సూర్య స్వరూపుడు, సత్యధర్మములే తన పరాక్రమముగ గలవాడు, జగత్తు అను సముద్రమును దాటుటకు వారధి వంటివాడు ఆ పరమాత్ముడే.
స్లో(32):భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః
      కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః||
తా: సర్వకాలములకు, భూతములకు, లోకములకు ప్రభువు, వాయు స్వరూపుడు, అగ్ని స్వరూపుడై పవిత్రులను చయువాడు ఆ మహాపురుషుడే. చక్కని రూపము గలవాడు, కామములను నశింపజేయువాడు, భక్తులచే కోరబదెడి వాడు, భక్తులకు అభీష్ట ప్రదాతాత ఆయనయే.  
శ్లో(33):యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః|
      అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనన్తజిత్||
తా: ఆ మహాపురుషుడు యుగారంభకుడు., యుగములను, కాలచక్రమును తిప్పువాడు, యుగాంతమున సర్వమును కబళించువాడు, కంతికి కనిపించక , తనదంటూ ఒక రూపము లేకుండ, అనేక మాయలు చూపువాడు.వేలాది అనుచరులను అనంత విధములుగ జయించినవాడు ఆయనయే.  
శ్లో(34):ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్ణీ నహుషో వృషః|
      క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః||
తా: సర్వజనులకు, సజ్జనులకు ఇష్టుడు, ప్రత్యేకత గలవాడు, తన మాయతో సర్వులను బంధించువాడు, ధర్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు ఆయనయే. క్రోధములేనివాడు, క్రోధస్వభావులను ఖండించువాడు, విశ్వమే తన బాహువులుగా గలిగి భూమిని ధరించిన వాడు ఆ ప్రమాత్ముడే.
శ్లో(35):అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|
      అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః
తా: ఆయన చ్యుతి లేకుండ శాశ్వతుడై, తనమహిమ యందు తానే ప్రతిష్టితుడైనవాడు, జాగరూకుడు, ఉత్కృష్టత గలవాడు. జీవులకు ప్రాణశక్తి నిచ్చువాడు, ప్రాణముతీయువాడు, వామన స్వరూపుడు, సముద్రస్వరూపుడిగ దేవతలను రక్షించిన వాడు ఆయనయే.

[ద్వితీయ భాగం మరో 35 శ్లోకాల అనంతరం]

Monday 22 July 2013

               నేడు దాశరథి కృష్ణమాచార్య  88వ జయంతి 



                                          తీగలను తెంపి అగ్నిలో దింపినావు                                                                                       నా తెలంగాణ కోటి రత్నాల వీణ..  





అని అవేదనా గళం విప్పిన దాశరథి కృష్ణమాచార్య  88వ జయంతి నేడు. ఈ నేలపై అక్షరాల పంటలు పండిస్తున్న పత్రికలు ఒక్కటీ ఆయన ను గుర్తుకు తచ్చే ప్రయత్నం చేయలేదు. దాశరథి జయంతికి ఒక్క నమస్తే తెలంగాణ మినహా ఏ తెలుగు పత్రికా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు దాశరథి గురించి ఒక్క వ్యాసంకూడా పత్రికలు ప్రచురించలేదు .

"అగ్నిధార" ఖండకావ్య సంపుటికి దేవులపల్లి రామానుజ రావు తొలిపలుకులు రాస్తూ, (15-8-1949) "....నేడు తెలంగాణాలో కవులెందరో యున్నారు. కాని పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత యిచ్చి గొంతెత్తి చెప్పగల కవి వాణి దాశరథియే. జన సామాన్యము యొక్క హృదయాలలోని ఆకాంక్షలను గట్టిగా, శక్తివంతముగా వ్యక్తీకరించిన ఆంధ్రావని యువకుడు మరొక్కడు లేడని చెప్పిన అతిశయొక్తి కాజాలదు. దౌర్జన్యము, అన్యాయము అక్రమముల మీద తిరుగుబాటే ఒక మాటలో దాశరథి కవిత్వము.. " అన్నారు. తొలి పలుఇకుల్లోనే.." గత సంవత్సరము తెలంగాణమంతయును కుంపటిలో పడి నిప్పులలో మాడిపోయినదని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. ఆనాటి ప్రజల కష్టాలు దాశరథిని కాల రుద్రుని జేసెను. కావుననే :వ్రణాలకు,రణాలకు, మరణాలకు, మాన ప్రాణ హరణాలకు, హద్దూ పద్దూ వుండని కరకునృపతి రాజ్యములో చిరఖేదం విరమించుక బ్రతికేమో! కడుపు నిండ గంజినీళ్ళు గతికేమో..." అని దీర్ఘ నిస్వాసము విడిచినారు.."" అని దేవులల్లి ఆవేదన వెలిబుచ్చారు.

ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిహైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి “ రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్” అని నిజామును సూటిగా గర్జించాడు. ఆయన కవితా సంపుటాలు:

అగ్నిధార
మహాంధ్రోదయం
రుద్రవీణ
మార్పు నా తీర్పు
ఆలోచనాలోచనాలు
ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం: [ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత]
తిమిరంతో సమరం: [కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత]

దాశరధి విరచిత "అగ్నిధార" లొ 49,రుద్రవీనలో 17,మహాంధ్రోదయం లో 15, పునర్నవం లో 24, అమృతాభిషకంలో 16, కవితాపుష్పకంలో 40 గేయాలను (రచనలను) గుదిగుచ్చారు. రుద్రవీణను తెలంగాణకే అంకితం చేశారు.

ఇందులో వీర తెలంగాణం పద్యఖండికలో

ఓ తెలంగాణ! నీ పెదవు లొత్తిన శంఖ మహారవమ్ము లీ
భూతలమెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె; ఓ
హో ; తెలవార్చి వేసినవి ఒక్కొక దిక్కు నవోదయార్కరుక్
ప్రీత జలేజ సూన తరళీక్ర్త దేవనదీ తరంగముల్..

అన్నారు.. ఆ సుకవికి, జనకవికి నేడు నివాళులేవీ? తెలంగాణ లో ఆయనను నేడు స్మరించుకున్న వారేరీ!!

Saturday 20 July 2013


                                               గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ




"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. "గురు" అన్న పదం లో గల రెండు అక్షరాలలో "గు" అనగా "తమస్సు" లేదా "చీకటి",  "రు" అనగా "చీకటిని తొలగించే వాడు", వెరసి "గురువు" అనే వ్యక్తి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు అని వివరణ చెప్పవచ్చు. ఇదే "తమసోమా జ్యోతిర్గమయ", అంటే "తమస్సు లేదా చీకటి నుండి జ్యోతి లేదా వెలుగు లోనికి" అని.  గురువు త్రిమూర్త్యవతారం కూడా. ఎందుకంటే బ్రహ్మవలె మనలో జ్ఞాన బీజం సృష్టించి, విష్ణువువలె దాన్ని స్థితిని కొనసాగించి, మహేశ్వరుని వలె మనలోని అజ్ఞానతిమిరాన్ని నశింపజేస్తాడు.  అందుకే "గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః అన్నాం.  అటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, అటువంటి గురువుకు నమస్కరించెదము.

సమస్త ఆధ్యాత్మిక, ధార్మిక విద్య అంతా  వ్యాసుని నోటినుండి వెలువడిందే. 'వ్యాసోచ్చిష్టం జగత్సర్వం'. ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . వశిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి  మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టి, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన  వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు. ఈ ఏడాది జులై నెల 22వ తేదీ అతి పవిత్రమైన గురు పూర్ణిమ.  ఉత్కృష్ట పారమార్ధిక పర్వదినం ప్రశస్తమైన ప్రాచీనమునుండి వస్తున్న గురువులను సేవించుకునే ఆచార సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ, అనంతమైన వైదిక ధార్మిక ధర్మసత్యాలను  అందించిన వ్యాసమహర్షికి ప్రణామాలు. గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు.  సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.  దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలు అందించిన వారే వ్యాసమహర్షి.  

గురుపౌర్ణమినాడు వ్యాస మహర్షి రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వశిష్ఠులవారిని, శక్తిమునిని,  పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

 "గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.  పూర్వ కాలం లో గురుకులం లో శిక్షణ ఇచ్చేవారు. పూర్తి అయిన శిష్యులు గురు దక్షిణ సమర్పించుకోవటం, గురుపూజ చేయటం చేసేవారు.  ఫలం పుష్పం, తోయం, ధనం, ధ్యాన్యం  వస్త్రం ఇలా ఏదైనా గురువుకి సమర్పించుకోవచ్చు. ఈ రోజు గురువు వందనం చేసి ఆశీర్వాదాలు పొందాలి. మనకి విద్య నేర్పిన గురువు ఎవరైనా సరే భక్తితో నమస్కరించాలి. జ్ఞానం ఇచ్చిన వారెవరైనా సరే, వయసులో చిన్న అయిన సరే, జీవిత సోపానం లో మనకి తెలియంది తెలియ చెప్పిన గురువు ఎవరైనా సరే వందనం అర్పించాల్సిందే! గురువు అంటే అజ్ఞానంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దీపాలు వెలిగించేవాడు. శిష్యుని మదిలో భక్తిని ప్రేరేపించి, మానవత్యాన్ని మేల్కొలిపి, మానసిక అందోళనలని పోగొట్టి శిష్యుని మేలు కోరేవాడు గురువు.

ఈ రోజు గురు వ్యాస దేవుడు మహాభారతాన్ని రచించాడు. పద్దెనిమిది పురాణాలు, భగవత్ గీత, బ్రహ్మసుత్రాలు మీమాంస అనే వి కూడా రచించిన ఆది గురువు.  తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి  ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు.  విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు.  అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలచుకుంటారు. అటువంటి వేద వ్యాసుడు మనకు తొలి గురువు.   దాన్నే "గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురుశ్లోకం లో రెండవ పంక్తికి అర్ధం. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తరువాత చెప్పుకోవాలంటే తండ్రి, తదుపరి అధ్యాపకుడు.  అందువలనే "మాతృ దేవోభవ! పితృ దేవోభవ! ఆచార్య దేవోభవ! " అన్నారు. వేదాలలోను, జ్యోతిషశాస్త్రంలోను దేవతల గురువైన "బృహస్పతి" ని గురువుగా తలుస్తారు. అతనిని ఒక గ్రహం గా గణించి అతని పేర "బృహస్పతి వారం" లేదా "గురు వారం" ఏర్పరచుకున్నాం.

పరిపూర్ణ అవతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ కుచేలుడు (సుధాముడు) సహాధ్యాయుడుగా సాందీపని మహర్షి వద్ద శిష్యుడై గురు శుశ్రూష చేశాడు. అంతేకాక కురుక్షేత్ర సంగ్రామారంభంలో పార్థుడు శ్రీకృష్ణుని ప్రార్ధించి "భగవత్-గీతోపదేశం" పొందాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటాం. మనకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, లేదా బోధకులు అంతా గురువులే అయినా వీరందరు "సద్గురువులు" లేదా నిజమైన గురువులు కాలేరు.  "సద్గురువు" లకు ఒకే జేవిత పరమావధి, లక్ష్యం వుంటుంది. అదేంటంటే, శిష్యుడుగా ఉపాసన పొందినవానికి "ఆత్మశోధన" ద్వారా, అంటే తనను తాను తెలుసుకొని, తద్వారా భగవంతుని తెలుసుకొనేలా చేయగల పవిత్రమూర్తి "సద్గురువు".  ఈ సద్గురువు కూడ ఇదే పద్ధతిలో తనను, భగవంతుని తెలుసుకున్నవాడై ఉండాలి. జ్ఞాన సంపన్నుడైన సద్గురువు నామ స్మరణ వలన శిష్యులకు జీవన్ముక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. అందుచేత ఆశయ సాధనకు ప్రతివొక్కరూ సద్గురువును ఆశ్రయించాలి.  ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన గురు ముఖతః విషయాలను గ్రహించి స్వీకరించాలి.  మన భరతావనిలో ఎందరో సద్గురువులు మనకు జ్ఞానభిక్ష నొసగి ముముక్ష మార్గమును చూపిస్తున్నారు.  అయితే సద్గురువులైన వారు చీనాంబరాలను, అధికారాలను, ఆడంబరాలను ఆశించరు. పాదపూజలు, కానుకలు కోరరు. వారు కోరేది కేవలం శ్రద్ధ, సహనం, నిర్మలమైన భక్తి, అచంచల విశ్వాసం.  రైతన్నలకు ఈ మాసం లో పడి తొలకరి చినుకులు వారి భవిష్యత్తుకి పునాదులు. వరి నాట్లు నాటే సమయం. ముందుగ ఈ రోజు పుడమి తల్లిని పుజిస్తారు. నాగలి పట్టి పొలం పనులు చేపడుతారు.

Thursday 18 July 2013




                    నేడే పవిత్ర తొలి ఏకాదశి..  




ఆషాఢ మాసంలో వచ్చే ఈ మొదటి (శుద్ధ) ఏకాదశినే తొలి ఏకాదశనీ, ఈ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడు కనుక శయన ఏకాదశనీ అంటారు. నిజంగా దేవుడు నిద్ర పోతాడా? విష్ణువు అంటే సూర్యుడు అని ఒక అర్ధం ఉంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా తిరిగే సూర్యుడు ఈ రోజు మొదలుకుని దక్షిణ దిక్కుకు వాలినట్టు కనిపించడం వలన ఈ రోజు మొదలుకుని దక్షిణాయణం అని దానినే మామూలు పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. అయితే మనకి ఎక్కువగా పండగలన్నీ ఈ దక్షిణాయణంలోనే వస్తాయి. మరి దేవుడే నిద్రపోతుంటే పూజలు ఎవరికి చేయాలి? ఉపవాసాలు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి? అని మామూలు జనాలు అడగవచ్చు.
ఈయన నిద్రపోయే రోజులలో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అంటారు. ఈ నెలలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం సంతరించుకోవడం వలన, అనేక రోగాలు చుట్టుముడతాయి. "లంఖణం పరమౌషధం" అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు శుద్ధి పొందుతాయి. దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. వాటిని నివారించడం కోసమే ఉపవాసాలు, పూజలు ఏర్పాటయ్యాయి. ఇవే కాక కష్ట పరిస్థితులలోను, భయంకరమయిన రోగాలు వచ్చినప్పుడు, చరమాంకంలోను వచ్చే విపరీతమయిన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పాటయ్యాయి..
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట.
ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఆధ్యాత్మిక గురువులు,పిఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి నాలుగు మాసములు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు అ౦దువలన ఈ దీక్ష కాలమును చాతుర్మాస్య దీక్ష గా వాడుక.ఈ దీక్షా కాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు. మన ప్రాంతంలో "తొలి ఏకాదశి తో పండుగలన్నీ తోసుకు వస్తాయి" అనే నానుడి వున్నది.

Sunday 14 July 2013

              ప్రతి వారికి ఒక ముఖ్య సమాచారం 

                 ప్రతివారికి సహాయ పడుతుంది 





ప్రతి వారికి ఒక ముఖ్య సమాచారం. ఇది ప్రతివారికి సహాయ పడుతుంది. దీనికి బహుళ ప్రచారం లభిస్తే ప్రాణాంతక వ్యాధుల నుంచి (శస్త్ర)చికిత్సలకు ఎవరి సిఫారసులు లేకుండా, ఏ ప్రజాప్రతినిధిని ప్రాధేయ పదకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక వంటి పథకం "ఆరోగ్యశ్రీ" కింద అమలవుతున్న "ఆరోగ్యమిత్ర" సేవలు ఇప్పటికీ రాష్త్ర వ్యాప్తంగా అమలవుతునే ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇన్సూరెన్స్ కార్డులు లేని వారు, సి.ఎం.రిలీఫ్ ఫండ్ కాకుండా రోజుకు కనీసం రాష్ట్రంలోని ఏడు పట్టణాలలో కనీసం 500-600 మందికి తక్కువకాకుండా అన్ని వర్గాల ప్రజలు రెండు లక్షలనుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు విలువైన వైద్య చికిత్సలు ఉచితంగా పొందుతున్నారు. దీనికి ప్రభుత్వ పరంగా ప్రచారం లేకపోవడం వలన ఎక్కువ మందికి తెలియడం లేదు.

ప్రభుత్వ జాబితాలో ఉన్న అనేక కార్పోరేట్ ఆస్పత్రుల్లో దర్జాగా శస్త్రచికిత్సలు చేయించుకునే అవకాశం అలందరికీ లభిస్తుంది. ప్రభుత్వం పై విపక్షాలు(పత్రికలు) ఆరోగ్యశ్రీ పై దుమ్మెత్తిపోస్తున్నా పట్టించుకుంటున్న నాధుడు లేకపోవడం యంత్రాంగం నిరాసక్తత బహిర్గతమవుతున్నది. ప్రభుత్వం విమర్శల పాలవుతున్నది. తెల్ల కార్డు లేకున్నా ఈ ఉచిత వైద్యసేవలకు అందరూ అర్హులే.

వ్యాధిగ్రస్తులు, హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం వద్ద ఆరోగ్య మిత్ర ట్రస్ట్ క్లినిక్ కార్యాలయానికి గాని, తిరుపతి స్విమ్‌స్, కర్నూల్ లో కొత్తగా నిర్మించిన జిజిహెచ్, కాకినాడ జిజిహెచ్, విజయవాడ జిజిహెచ్, విశాఖపట్నం కెజిహెచ్, వరంగల్ ఎంజిహెచ్ కేంద్రాలకు రోగులు ఆస్పత్రులు ధృవీకరించిన వ్యాధిపత్రాలతో, తగిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రతిరోజు ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు వెళితే, ఎవరి సిఫారసు లేకుండానే స్పెషాలిటీ నెట్‌వర్క్ ఆస్పత్రులలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్యాకేజిల కింద హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అనుమతి తీసుకుని ఎలాంటి చెల్లింపులు లేకుండా చికిత్స లభిస్తుది. ఇందుకు అయిన యావత్ ఖర్చులను ప్రభుత్వమ్నుంచి ఆయా ఆప్సత్రులకు నేరుగా చెల్లింపుంపులు జరుగుతాయి.

కాంప్ కార్యాలయాం వద్ద రోగనిర్ధారణ పత్రాలతో పాటు పక్క పోస్టరులొ చూపిన గుర్తింపుకార్డులలో ఏదో ఒకటి జత చేయవలసివుంటుంది. అక్కడి సిబ్బంది రోగి ఫొటో, వేలిముద్రలు (బయోమెట్రిక్)తీసుకుని సంబంధిత ఆస్పత్రికి రెఫెరల్ కార్డు జారీ చేస్తారు. ఆ కార్డు తీసుకుని నేరు ఆస్పత్రికి వెళితే 10 రోజులలోగా పైసా చెల్లించకుండా ఉచితంగా శస్త్ర చికిత్సలు జరుపుతారు. ముఖ్య మంత్రి నగరంలోఉన్నా, లేకున్నా, సెలవు దినాలతో ప్రమేయం లేకుండా 365 రోజులూ ఈ ప్రక్రియ సాగుతుంది. హైదరాబాద్ సిఎం కాంప్ ఆఫీసు వద్ద ప్రతిరోజు కనీసం 100 నుంచి 150 మందికి ఈ సేవలు లభిస్తున్నాయి. మొత్త ఏడు కేంద్రాలలో రోజుకు సగటున 600 మందికి ఈ సేవలు లభిస్తున్నాయి. గులాబి కార్డు దారులకు మాత్రమే కాకుండా ఏకార్డూ లేని వారికి కూడా కహరీదైన ఈ ఉచిత వైద్య సేవలు అందుతాయి. సి ఎం సహాయనిధి కొసం వెంపర్లాడి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెంట తిరగవలసిన అవసరం లేదు. ముఖ్య మంత్రి కార్యాలయమ వద్ద పడిగాపుల పని లేదు. రాష్ట్రంలోని మొత్తం ఏడు కేంద్రాలవద్ద సిబ్బంది అన్నీ నమోదు చేసుకుని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి కేవల గంటన్నర వ్యవధిలో రోగికి రెఫెరల్ కార్డు జారీ చేస్తారు.

చేస్తున్న పనులను ప్రభుత్వం తగిన ప్రచారం చేసుకోలేక అభాసుపాలవుతున్నది. పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు సయితం ప్రజలకు సమాచారం ఇవ్వడంలో శ్రద్ధకనబరచక రాజకీయాలపై దృష్టి పెట్టదం వలన ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటున్నారు.

(మా బంధువు శస్త్ర చికిత్స విషయంలో పదిరోజులు అందరి చుట్టూ ప్రదక్షిణలు చేసి విఫలమైన నేపథ్యంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ముఖ్య సమాచారమిది. కేవలం గంటన్నర లో రెఫెరల్ కార్డు తీసుకుని సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్స సదుపాయాన్ని సీతారామ శాస్త్రి గారు ఉచితంగా పొందగలుగుతున్నారు)